పోలవరం కట్టడానికి వీళ్లెవరు?

ABN , First Publish Date - 2020-11-06T09:07:20+05:30 IST

‘పోలవరం కేంద్ర ప్రాజెక్టు. దానిని సీఎం జగన్‌, మాజీ సీఎం చంద్రబాబు వివాదాస్పదం చేశారు. అసలు ప్రాజెక్టు కట్టడానికి వీళ్లెవరు?’

పోలవరం కట్టడానికి వీళ్లెవరు?

ఇళ్ల స్థలాల భూమి కొనుగోళ్లలో భారీ కుంభకోణం: సోము వీర్రాజు


రాజమహేంద్రవరం, నవంబరు 5(ఆంధ్రజ్యోతి): ‘పోలవరం కేంద్ర ప్రాజెక్టు. దానిని సీఎం జగన్‌, మాజీ సీఎం చంద్రబాబు వివాదాస్పదం చేశారు. అసలు ప్రాజెక్టు కట్టడానికి వీళ్లెవరు?’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రశ్నించారు. ‘చంద్రబాబు ఓ కాంట్రాక్టర్‌ను మార్చి నవయుగను తెస్తే, జగన్‌ మేఘా ను తెచ్చారు. ఎందుకు ఈ మార్పులు? పైగా చంద్రబాబు పోలవరం అంచనాలను భారీగా పెంచేశారు. పెంచిన దానికి పార్లమెంట్‌లో ఆమోదం లభించినట్టు చెబుతున్నారు. అప్పుడు జరిగిన అవకతవకలపై జగన్‌ ఐదు పేజీల ఫిర్యాదు లేఖ రాశారు. ఇప్పుడు వాటిని ఎందుకు పరిశీలించడం లేదు. ఆ సొమ్మును జగన్‌ కూడా తీసేసుకోవాలని చూస్తున్నారా?’ అని ప్రశ్నించారు. ప్రాజెక్టులో ఎల్‌ఎంసీ, ఆర్‌ఎంసీ అంచనా రేట్లు పెంచేశారు. రూ.5కోట్ల పనిని రూ.25 కోట్లకు పెంచారు. పెద్దాపురం ప్రాంతంలో ఓ వర్కును రూ.50కోట్లకు పెంచి యనమల వియ్యంకుడికి కాంట్రాక్టు ఇచ్చారు. ప్రభుత్వ భూములు కూడా ప్రైవేట్‌ భూములుగా చూపించారు. 48వేల కోట్లకు ప్రాజెక్టు అంచనాలను పెంచేశారు. ఈ అక్రమాలన్నీ సరిచేస్తేనే కేంద్రం డబ్బు ఇస్తుంది’ అని ఆయన స్పష్టం చేశారు. ‘వెంకయ్యనాయుడు ఏపీకి 7లక్షల ఇళ్లు ఇస్తే, చంద్రబాబు 3.42 లక్షలు ఇళ్లు కట్టారు. కేంద్రం 4వేల కోట్లు సబ్సిడీగా ఇచ్చింది. చంద్రబాబు 5వేల కోట్లు ఇచ్చారు. మిగతా డబ్బు ఎవరిస్తారు. 6వేల కోట్లు వస్తేనే ఇళ్లు పూర్తవుతాయి. సీపీఐ కార్యదర్శి రామకృష్ణ టీడీపీ ఏజెంట్‌. కట్టిన ఇళ్లను ప్రభుత్వం లబ్ధిదార్లకు ఇవ్వకపోతే ఆయనే ఇచ్చేస్తారట. ఇవ్వడానికి ఆయనెవరు? నేనెవర్ని?’ అని సోము ప్రశ్నించారు. ఆ ఇళ్ల నిర్మాణంలో కూడా అవినీతి జరిగిందని వీర్రాజు పేర్కొన్నారు. ఇప్పుడు ఇళ్ల పట్టాల పేరిట ఇష్టానుసారం భూమి కొన్నారని, దీంట్లో పెద్ద కుంభకోణం జరిగిందని ఇందులో ఐఏఎ్‌సలు నీరబ్‌కుమార్‌. ప్రవీణ్‌ప్రకాశ్‌ కీలకంగా వ్యవహరించారని ఆయన ఆరోపించారు.

Updated Date - 2020-11-06T09:07:20+05:30 IST