సోము వీర్రాజు ఒకలా....రామ్ మాధవ్ ఇంకోలా?
ABN , First Publish Date - 2020-08-12T19:33:07+05:30 IST
ఆంధ్రా బీజేపీలో నేతలు వర్గాలు మారి రాజధాని సహా కీలక అంశాలపై భిన్నవాదనలు వినిపిస్తున్నారు.

అమరావతి: ఆంధ్రా బీజేపీలో నేతలు వర్గాలు మారి రాజధాని సహా కీలక అంశాలపై భిన్నవాదనలు వినిపిస్తున్నారు. రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఒకలా మాట్లాడుతుంటే.. ఇతరులు మరోలా?.. రాంమాధవ్ ఇంకోలా ప్రకటనలు చేస్తున్నారు. ఈ తికమక నేతలతో పార్టీ కార్యకర్తల్లో అయోమయం నెలకొంది. మొన్నటి వరకు ఉన్న అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ అమరావతికి అనుకూలం... ఇప్పుడు కొత్తగా వచ్చిన అధ్యక్షుడు సోము వీర్రాజు అమరావతికి వ్యతిరేకం.. ఢిల్లీలో ఉన్న నాయకుడు ఒక మాట చెబుతారు. రాష్ట్రంలో ఉన్న నేత ఇంకొకటి చెబుతారు.
రాజధాని రాష్ట్రం పరిధిలోనే ఉంటుందని, కేంద్రం ఏమీ చేయలేదని అంటూనే.. అమరావతి రైతులకు మాత్రం న్యాయం జరగాలని చెబుతారు. ఇది బీజేపీ పరిస్థితి. ఇప్పటికే ఒక్కొక్కరు ఒక్కో రకంగా జనాన్ని గందరగోళం పరుస్తుండగా.. సీనియర్ నేత రాంమాధవ్ మూడు రాజధానులను వ్యతిరేకించారు. పరోక్షంగా అమరావతిని సమర్ధించారు. ఇంతకీ బీజేపీ వైఖరేంటి? వారికొక దశా దిశ ఉందా? రాష్ట్రంలో బలపడే విషయంలోగానీ, అధికారపక్షంపై పోరాటంలోగానీ స్పష్టత ఉందా? ఇవీ విశ్లేషకుల ప్రశ్నలు. దేశాన్ని నడిపిస్తున్న జాతీయ పార్టీ బీజేపీ ఏపీలో మాత్రం నిర్ధిష్ట దిశలేకుండా నడుస్తోందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఏ ఒక్క అంశంలోనూ పార్టీ నేతల మద్య ఏకాబిప్రాయం కనిపించడంలేదు సరికదా.. కీలకాంశాలపై అంతర్గత వైరుధ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.