అధికార పార్టీ సభ్యులు వ్యవహరించిన తీరు దురదృష్టకరం: సోమిరెడ్డి
ABN , First Publish Date - 2020-06-18T18:48:16+05:30 IST
అమరావతి: శాసనమండలిలో మంత్రుల తీరును మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఖండించారు. చట్టసభల్లో..

అమరావతి: శాసనమండలిలో మంత్రుల తీరును మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఖండించారు. చట్టసభల్లో.. ఉమ్మడి ఏపీలోనూ ఎప్పుడూ ఇలాంటి పరిస్థితులు నెలకొనలేదన్నారు. సభ్యులు ఎంతో గౌరవంగా వ్యవహరించే వారని... కానీ వైసీపీ అధికారంలోకి వచ్చాక తొలిరోజు నుంచే సభల్లో దారుణంగా ప్రవర్తించడం మొదలైందన్నారు. నిన్న శాసనమండలిలో అధికార పార్టీ సభ్యులు, మంత్రులు వ్యవహరించిన తీరు దురదృష్టకరమన్నారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పైకి దూసుకురావడం, అడ్డుకోబోయిన బీద రవిచంద్రపై దాడి చేయడం దుర్మార్గమన్నారు. చివరకు అప్రాప్రియేషన్ బిల్లును కూడా అడ్డుకుంటారా? అని సోమిరెడ్డి ప్రశ్నించారు. పరిపాలనలో కీలకమైన ఈ బిల్లును ప్రవేశపెట్టాలని కోరారు. ఆమోదిస్తామని ప్రతిపక్షమే కోరితే వద్దు అని ఆపిన మంత్రులను చూస్తే సభలో వారి పరిజ్ఞానానికి నవ్వాలో, ఏడ్వాలో అర్ధం కావడం లేదన్నారు. సభలో మంత్రుల ప్రవర్తనను ఖండిస్తున్నానన్నారు. ఇప్పటికైనా మంత్రులు, అధికార పార్టీ సభ్యులు చట్టసభలకు గౌరవం తెచ్చేలా వ్యవహరించాలని సోమిరెడ్డి కోరారు.