జగన్‌ను న్యాయస్థానాలు తప్పుపడతాయని అనుకోవడంలేదు: సోమిరెడ్డి

ABN , First Publish Date - 2020-04-12T17:30:00+05:30 IST

రాష్ట్రంలో ఈసీ నిమ్మగడ్డ రమేష్‌ను తప్పించి కొత్తగా జస్టిస్‌ కనగరాజ్‌‌ నియమకాన్ని న్యాయస్థానాలు తప్పుపడతాయని..

జగన్‌ను న్యాయస్థానాలు తప్పుపడతాయని అనుకోవడంలేదు: సోమిరెడ్డి

నెల్లూరు: రాష్ట్రంలో ఈసీ నిమ్మగడ్డ రమేష్‌ను తప్పించి కొత్తగా జస్టిస్‌ కనగరాజ్‌‌ నియమకాన్ని న్యాయస్థానాలు తప్పుపడతాయని తాను అనుకోవడంలేదని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గతంలో సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా కోర్టులు తీర్పులు ఇచ్చాయని..వాటిని భేఖాతరు చేశారన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌పై కోర్టు తీర్పు ఇస్తే.. అప్పుడైనా ముఖ్యమంత్రి నైతిక విలువలకు కట్టుబడతారా? అని ప్రశ్నించారు.


ఏది ఏమైనా ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే చాలా బాధగా ఉందన్నారు. సీఎం నియంతృత్వంగా, కక్షసాధింపులతో తీసుకున్న నిర్ణయాలు ఎక్కడా.. ఏ రాష్ట్రంలో చూడలేదని సోమిరెడ్డి అన్నారు. టీడీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు విజయవాడ రావాలంటే 14 రోజులు క్వారంటైన్‌లో ఉండాలని వైసీపీ నేతలు మాట్లాడుతున్నారని, మరి ప్రభుత్వం మాత్రం నిబంధనలు ఉల్లంఘిస్తోందని ఆయన మండిపడ్డారు. 


లాక్ డౌన్ సమయంలో ఎస్ఈసీని తొలగించి ఎక్కడో ఇతర రాష్ట్రంలో ఉన్న మాజీ  జస్టిస్‌ కనగరాజ్‌‌ను విజయవాడకు తీసుకువచ్చి పదవిలో కూర్చోబెట్టారని, ఆయనకు క్వారంటైన్ అవసరంలేదా? అని సోమిరెడ్డి ప్రశ్నించారు. అలాగే వైసీపీ నేతలు హైదరాబాద్, బెంగళూరు నుంచి ఏపీకి వస్తున్నారని, వారికి క్వారంటైన్ అవసరం లేదా? అని నిలదీశారు. అసలు వైసీపీ తీరు ఏంటనేది అర్థం కావడం లేదన్నారు. వైసీపీ కనుసన్నల్లో ఎవరైనా ఉండకపోతే వారు ఏపీలో ఉండేందుకు లేదన్న రీతిలో జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని సోమిరెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు.


ఎన్నికల కమిషనర్‌గా రమేష్ కుమార్ నిర్ణయాలను సుప్రీంకోర్టు సమర్ధించిందని సోమిరెడ్డి అన్నారు. రమేష్ కుమార్ తొలగింపు దస్త్రాన్ని రాజ్యాంగ పదవిలో ఉన్న గవర్నెర్ గంట కూడా ఆపలేదని, గవర్నెర్ ఎందుకు భయపడ్డారన్నారు. రమేష్ కుమార్‌ని భయపెట్టినట్లు గవర్నర్‌ను కూడా భయపెట్టారా? అని ప్రశ్నించారు. ప్రథమ పౌరుడిగా మంచి నిర్ణయాలు ఎందుకు తీసుకోలేక పోతున్నారనే అభిప్రాయం ప్రజల్లో ఉందన్నారు. దీనిని గవర్నర్ నివృత్తి చేయాలన్నారు. జగన్‌ను కాదంటే రాష్ట్రంలో ఎవ్వరూ బతకకూడదు అనే పరిస్థితులు ఉండటం దురదృష్టకరమన్నారు. రాజ్యాంగానికి లోబడే పాలించాలని ప్రజలు అధికారం ఇచ్చారన్న విషయానని జగన్ గ్రహించాలని సోమిరెడ్డి సూచించారు.

Updated Date - 2020-04-12T17:30:00+05:30 IST