సీఎం జగన్ ఇప్పటికైనా కళ్లు తెరవాలి: సోమిరెడ్డి

ABN , First Publish Date - 2020-04-24T21:23:36+05:30 IST

ఏపీ సర్కార్‌పై మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

సీఎం జగన్ ఇప్పటికైనా కళ్లు తెరవాలి: సోమిరెడ్డి

నెల్లూరు: ఏపీ సర్కార్‌పై మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మీడియాతో శుక్రవారం మాట్లాడిన ఆయన.. ప్రమాదకరమైన కరోనా వ్యాధిని కంట్రోల్ చేయడంలో ఏపీ ప్రభుత్వం విఫలమైందన్నారు. పాలనలో విఫలమైన ప్రభుత్వం చేతులెత్తేసినట్టు కనిపిస్తోందని విమర్శించారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు నిస్సహాయంగా మిగిలిపోయారని.. మ్మెల్యేలు బరితెగించి ప్రవర్తిస్తూ వసూళ్లు జరిపి కరోనాను మరింతగా వ్యాప్తి చేసేందుకు ఊరేగింపులు, సభలు నిర్వహిస్తున్నారన్నారు. వైరస్ కమ్యూనిటీ ట్రాన్స్‌ఫర్‌కు కారణమవుతున్నారన్నారు. చిత్తూరు, నెల్లూరు, గుంటూరు, కర్నూలులో బరితెగించి వ్యవహరిస్తున్న ఎమ్మెల్యేలను సీఎం జగన్ మందలించలేకపోతున్నారా..మరో ఎమ్మెల్యేను కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తే ఎస్పీ, కలెక్టర్‌ను నోటికొచ్చినట్టు బహిరంగంగానే తిట్టారన్నారు. దీంతో కలెక్టర్, ఎస్పీ కూడా చేతులెత్తేశారని..ఇప్పటికైనా సీఎం జగన్మోహన్ రెడ్డి కళ్లు తెరవాలని చెప్పుకొచ్చారు. ఎవరూ చూడని విపత్తు ఇదని... ఇంట్లో కూర్చోవడం కాదు...పరిపాలనను గాడిన పెట్టండని సీఎం జగన్‌కు సూచించారు. ఎమ్మెల్యేలు వసూలు చేసిన సొత్తుకు లెక్కలు అడగండని...చట్ట ప్రకారం చర్యలు తీసుకోండన్నారు. లేదంటే 175 నియోజకవర్గాల్లో వైకాపా నాయకులు, ఎమ్మెల్యేలు ఎవరైనా వసూళ్లు చేసుకోవచ్చని చెప్పేయండని ఎద్దేవా చేశారు. సీఎం వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోకపోతే రాష్ట్రంలో ప్రమాదకర పరిస్థితులు రాబోతున్నాయని.. దానికి జగన్మోహన్ రెడ్డే బాధ్యులవుతారని హెచ్చరించారు.

Updated Date - 2020-04-24T21:23:36+05:30 IST