-
-
Home » Andhra Pradesh » Solar love for anyone
-
ఎవరికోసమీ సౌర ప్రేమ!
ABN , First Publish Date - 2020-12-28T08:14:59+05:30 IST
సౌర విద్యుత్ కొత్త టెండర్లపై విమర్శల వర్షం కురుస్తున్నా ముందుకు వెళ్లడానికే రాష్ట్ర ప్రభుత్వం చూపిస్తున్న పట్టుదల విద్యుత్‌వర్గాలనే విస్మయానికి గురిచేస్తోంది.

- ఏటా రూ.2250 కోట్ల నష్టం
- ఇప్పటికే ఎన్నో ఒప్పందాలు
- అయినా.. కొత్త టెండర్లు?
- సౌరపాలసీపై నాడు వ్యతిరేకత
- నాశనం చేసిందని టీడీపీ సర్కారుపై నిప్పులు
- అనూహ్యంగా ఇప్పుడు ప్రభుత్వ వైఖరిలో మార్పు
- సీఎంవోలో పెరిగిన ‘అస్మదీయ’ సందడి
- ఎవరి కోసం ఇదంతా?: జేఏసీ నిలదీత
(అమరావతి-ఆంధ్రజ్యోతి): సౌర విద్యుత్ కొత్త టెండర్లపై విమర్శల వర్షం కురుస్తున్నా ముందుకు వెళ్లడానికే రాష్ట్ర ప్రభుత్వం చూపిస్తున్న పట్టుదల విద్యుత్‌వర్గాలనే విస్మయానికి గురిచేస్తోంది. దీని వెనుక ఉన్న లోగుట్టు ఏమిటి... తెరవెనుక ఎవరున్నారనేది చర్చనీయాంశంగా మారింది. దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వనన్ని రాయితీలు ఇవ్వడానికి ప్రభుత్వం ముందుకు రావడమూ, కొత్త ఒప్పందాల వల్ల భారీ నష్టం వాటిల్లుతుందని ఇంజనీర్ల సంఘాలు గగ్గోలు పెడుతున్నాయి. అయినా వాటిని సరుకు చేయకపోవడం వెనుక ఏం ఉందన్నది ఆసక్తికర చర్చగా మారింది. అధికారంలోకి వచ్చిన కొత్తలో పవన, సౌర విద్యుత్ ఉత్పత్తి సంస్థలపై వైసీపీ ప్రభుత్వం తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. గత టీడీపీ ప్రభుత్వం వాటిని అనవసరంగా ప్రోత్సహించి, రాష్ట్రంపై భారంమోపిందని ఆరోపించింది. కొనుగోలు ఒప్పందాల్లో కుదుర్చుకొన్న ధరను సగానికి సగం తగ్గించాలని ఉత్పత్తి సంస్థలకు నోటీసులు జారీ చేసింది. కొన్ని నెలలపాటు వాటి నుంచి విద్యుత్ తీసుకోవడం నిలిపివేసింది. ఏడాదిన్నర తర్వాత దీనికి పూర్తి విరుద్ధ వైఖరిని తీసుకొంది. కొత్తగా 10వేల మెగా వాట్ల సౌరవిద్యుత్ ఉత్పత్తికి టెండర్లు పిలవాలని నిర్ణయం తీసుకొంది. అంతేకాదు, దేశంలో మరే రాష్ట్రమూ ఇవ్వనన్ని రాయితాలను పెట్టుబడి సంస్థలకు ప్రతిపాదించింది. గత ప్రభుత్వం పాతికేళ్లకు కొనుగోలు ఒప్పందాలు కుదుర్చుకొంటే, ఇప్పుడు 30ఏళ్లకు కుదుర్చుకుంటూ ఉండటం గమనార్హం!
ఎల్‌సీలూ ఇచ్చేశారు..
పవన, సౌర విద్యుత్ సంస్థలకు గత ప్రభుత్వం లెటర్ ఆఫ్ క్రెడిట్ (ఎల్‌సీ) సదుపాయం ఇవ్వలేదు. ఈ సదుపాయం కల్పిస్తే నెలసరి చెల్లింపులను ముందుగానే బ్యాంకు ఖాతాల్లో జమ చేయాల్సి ఉంటుంది. గతంలోని పవన, విద్యుత్ ఉత్పత్తి సంస్ధలకు ఈ సదుపాయం ఇవ్వాలని కేంద్రం కోరినా వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు కొత్తగా వచ్చేవారికి మాత్రం లెటర్ ఆఫ్ క్రెడిట్ ఇవ్వాలని నిర్ణయించారు. పైగా ఎల్‌సీల కు ప్రభుత్వం తరఫున గ్యారంటీ ఇవ్వాలని మరో నిర్ణయం తీసుకొన్నారు. దేశంలో ఏ ప్రభుత్వం ఇలా ఎల్‌సీలకు గ్యారంటీ ఇవ్వడం లేదు. ఎల్‌సీల చెల్లింపులో ఎప్పుడైనా రాష్ట్ర ప్రభుత్వం విఫలమైనా ఇబ్బంది లేకుండా ఈ గ్యారంటీని అదనంగా చేర్చారు. ఇప్పుడు టెండర్లు దక్కించుకొన్నవారు అదే ధరకు తర్వాత మరో ఏభై శాతం ఉత్పత్తి అదనంగా చేయడానికి వెసులుబాటు కల్పించారు. ఇన్ని రాయితీలు దేశంలో ఏ రాష్ట్రమూ ఇవ్వడం లేదని అధికార వర్గాలే చెబుతున్నాయి.
ఇంతింత రాయితీలా!
కొత్తగా పెట్టుబడులు అవసరమైనచోట రాయితీలు ఇస్తేఅర్థం ఉందని, అవసరం లేనిచోట ఇంతింత రాయితీల అవసరం ఏమిటని విద్యుత్ ఇంజనీర్ల జేఏసీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు రాష్ట్రంలో 10వేల మెగావాట్ల విద్యుత్ వాడకం ఉంటే 20వేల మెగావాట్ల మేర విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు ఉన్నాయని, ఇంకా అదనంగా విద్యుత్ ఎందుకన్నది వారిప్రశ్న. విద్యుత్ వాడకం ఏటా 6శాతం పెరుగుతోందని, దాన్నిబట్టి కొత్త విద్యుత్ అవసరమన్న ప్రభుత్వ వర్గాల లెక్కలతో జేఏసీ విభేదించింది. కరోనా తర్వాత పూర్వపు వాడకం స్థాయికే చేరుకోలేదని, ఇంతశాతం వాడకం పెరుగుతుందనడానికి హేతుబద్ధత లేదని వ్యాఖ్యాని స్తోంది. వాడకం పెరిగినా ఉన్న పీపీఏలతో లభ్యమయ్యే విద్యుత్ సరిపోతుందని వాదిస్తున్నారు. వ్యవసాయ రంగం కోసమే కొత్త సౌర ప్లాంట్లు పెడుతున్నామని, దానివల్ల ఖర్చు తగ్గుతుందనేది విద్యుత్‌శాఖ ఉన్నతాధికారుల మరో వాదన. దానిని కూడా జేఏసీ అంగీకరించడం లేదు.
తెర వెనుక ఎవరు?
‘‘ఇప్పటికే ఉన్న పీపీఏలతో వస్తున్న విద్యుత్‌ను ఇప్పటిదాకా వ్యవసాయ రంగానికి వాడుతున్నాం. కొత్తగా వేరే ఒప్పందాలు కుదుర్చుకొని వారివద్ద విద్యుత్ తీసుకొంటే పాత విద్యుత్ ఏం కావాలి? తీసుకోకపోయినా పాత విద్యుత్ ఉత్పత్తి సంస్ధలకు యూనిట్‌కు రూ.1.50 చొప్పున స్థిర విద్యుత్ చార్జీలు చెల్లించాలి. కొత్త ఒప్పందాలతో పాత వారికి ఉత్త పుణ్యానికి ఏటా రూ.2250 కోట్లను చెల్లించాలి. అంత అవసరం ఏమిటి? కోరి తెచ్చుకొంటున్న భారం ఇది’’ అని జేఏసీ ముఖ్యనేత ఒకరు అన్నారు. ఆంతరంగిక శిబిరంలో ఉన్న అస్మదీయుల ప్రభావంతోనే ప్రభుత్వం విమర్శలు పట్టించుకోకుండా ముందుకు వెళ్తోందని విద్యుత్ వర్గాల్లో వ్యాఖ్యలు వినవస్తున్నాయి. ప్రచారంలో ఉన్న అస్మదీయులు అప్పుడప్పుడూ సచివాలయంలో మెరుపులా కనిపించి మాయమవుతున్నారు. వారి కంపెనీల ప్రతినిధులు మాత్రం ఈ కసరత్తులో పాలుపంచుకొంటున్న ప్రభుత్వ సంస్థలకు చెందిన అధికారుల వద్ద తరచూ హాజరు వేయించుకొంటున్నారు. చివరకు తెరపై నిలబడేది వీరేనా లేక మరేవైనా కొత్త తారలా అన్నది వేచి చూడాల్సి ఉందని విద్యుత్ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.