ప్రాణాలకే ‘షాక్‌’

ABN , First Publish Date - 2020-08-01T09:47:30+05:30 IST

కొత్త పాలసీ... అంటే చెత్త మద్యాన్ని ప్రవేశపెట్టారు. ‘షాక్‌ కొట్టాలి’ అంటూ ధరలు విపరీతంగా పెంచేశారు. దీని ఫలితమే...

ప్రాణాలకే ‘షాక్‌’

  • కొంపముంచుతున్న మద్యం ధరలు
  • అత్యంత చీప్‌ కూడా రూ.150
  • అంతపెట్టి కొనలేక పక్కదారులు
  • విపరీతంగా సారాయి, గంజాయి
  • తాజాగా... శానిటైజర్‌ వినియోగం

(అమరావతి - ఆంధ్రజ్యోతి)

కొత్త పాలసీ... అంటే చెత్త మద్యాన్ని ప్రవేశపెట్టారు. ‘షాక్‌ కొట్టాలి’ అంటూ ధరలు విపరీతంగా పెంచేశారు. దీని ఫలితమే... అక్రమ మద్యం, నాటుసారా, శానిటైజర్‌ మరణాలు అని అధికారులే చెబుతున్నారు. మద్య నియంత్రణ పేరుతో ధరలు రెట్టింపు చేయడంతో తాగుడుకు అలవాటు పడిన పేదలు ప్రత్యామ్నాయ దారులు వెతుక్కుంటున్నారనే వాదన వినిపిస్తోంది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక... దశలవారీగా మద్య నిషేధం అంటూ మొదట 25శాతం ధరలు పెంచింది. ఇటీవల కరోనా లాక్‌డౌన్‌ అనంతరం మద్యం షాపులు తిరిగి తెరుచుకున్నాక మరోసారి 25శాతం ధరలు పెంచింది. షాపుల వద్ద భారీగా బారులు తీరడం, మందుబాబులతో మద్యం షాపులు రద్దీగా మారడంతో తర్వాతి రోజే మరో 50 శాతం ధరలు పెంచింది. అంటే కరోనా సమయంలోనే ఒకేసారి 75శాతం ధరలు పెరిగాయి. అవి కూడా కచ్చితంగా 75శాతం కాకుండా ఒక్కో బ్రాండ్‌పై ఒక్కోలా ధరలు ఇష్టానుసారం పెంచారు. కొన్ని బ్రాండ్లపై 75శాతం దాటి కూడా ధరలు పెరిగాయి. రాష్ట్రంలో అత్యంత చీప్‌ లిక్కర్‌ తాగాలన్నా క్వార్టర్‌కు రూ.150 పెట్టాల్సిందే.


కరోనా వల్ల ఉపాధి లేక పేదలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో మందు అలవాటు ఉన్నవారు కొనుగోలు చేసి తాగలేని పరిస్థితి ఏర్పడింది. అలవాటు మానలేని వారు మద్యం కొనలేని పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. అందులో ముఖ్యంగా నాటుసారా, ఎన్‌డీపీఎల్‌, గంజాయి విపరీతంగా పెరిగిపోయాయి. దాదాపుగా అన్ని జిల్లాల్లోనూ నాటుసారా తయారీ విచ్చలవిడిగా సాగుతోంది. మద్యం ధరలతో పోలిస్తే అతి తక్కువ ధరకే నాటుసారా లభిస్తుండటంతో మందుబాబులు క్రమంగా అటువైపు మొగ్గుతున్నారు. 


నిషేధం రాకముందే ఇలా...

మద్య నిషేధం అమల్లోకి వస్తే మందు దొరక్క మందుబాబులు అడ్డదారుల్లోకి వెళ్తారని అందరూ భావించారు. కానీ, నిషేధం రాకముందే ఒకేసారి భారీగా ధరలు పెంచడంతో ప్రమాదాలు మొదలయ్యాయి. నాటుసారా, గంజాయి వైపు మళ్లే ప్రమాదాన్ని ఊహించామని... ఇలా శానిటైజర్లు కూడా ప్రత్యామ్నాయం అవుతాయని అంచనా వేయలేకపోయామని అధికార వర్గాలు అంటున్నాయి. పెరిగిన ధరలు ఇలాగే కొనసాగితే మరిన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నాయి.

Updated Date - 2020-08-01T09:47:30+05:30 IST