చిన్న గుడి..‘పెద్ద’ పోటీ

ABN , First Publish Date - 2020-11-25T09:48:17+05:30 IST

అదొక చిన్న గుడి. ఏడాది మొత్తమ్మీద రూ.2లక్షల ఆదాయం కూడా రాదు. అయినా ఆ గుడి ట్రస్టుబోర్డు నియామకంపై పెద్ద యుద్ధమే జరుగుతోంది. ఏకంగా ఓ మంత్రి, ప్రభుత్వంలో పలుకుబడి ఉందని చెప్పుకొనే ఓ స్వామీజీ దీనిపై పోటాపోటీగా ఉన్నారు. ఫలితంగా గత శుక్రవారం నియామకం అయిన ట్రస్టుబోర్డు సభ్యులు వారం తిరక్కుండానే

చిన్న గుడి..‘పెద్ద’ పోటీ

ట్రస్టుబోర్డుపై స్వామీజీ, మంత్రి పట్టు..బోర్డు సభ్యుల రాజీనామా 

 

అమరావతి, నవంబరు 24(ఆంధ్రజ్యోతి): అదొక చిన్న గుడి. ఏడాది మొత్తమ్మీద రూ.2లక్షల ఆదాయం కూడా రాదు. అయినా ఆ గుడి ట్రస్టుబోర్డు నియామకంపై పెద్ద యుద్ధమే జరుగుతోంది. ఏకంగా ఓ మంత్రి, ప్రభుత్వంలో పలుకుబడి ఉందని చెప్పుకొనే ఓ స్వామీజీ దీనిపై పోటాపోటీగా ఉన్నారు. ఫలితంగా గత శుక్రవారం నియామకం అయిన ట్రస్టుబోర్డు సభ్యులు వారం తిరక్కుండానే రాజీనామాలు చే శారు. బోర్డు రద్దుకు బుధవారం అధికారిక ఆమోదం లభించనుంది. అదే విశాఖపట్నంలోని గుడిలోవ రంగనాథస్వామి ఆలయం. దేవదాయశాఖలో 6(సి) జాబితా లో ఉంది. స్వామీజీ సిఫారసుతో గత శుక్రవారమే ట్రస్టుబోర్డును నియమించారు. వారం గడవకముందే సభ్యులు రాజీనామా చేశారు.


దీని వెనుక మంత్రి ఉన్నారని ప్రచారం సాగుతోంది. తనకు తెలియకుండా ట్రస్టుబోర్డు ఎలా వేస్తారని మంత్రి అంటున్నారనే వాదన వినిపిస్తున్నా, అంత చిన్న ఆలయం గురించి ఇంత పట్టు ఎందుకనేది సందేహం. ఈ వ్యవహారం సీఎంవో వరకు వెళ్లినట్లు తెలిసింది. ఇక  బోర్డును రద్దు చేస్తే, అప్పుడు మంత్రికి చెందిన వర్గం ట్రస్టుబోర్డులో కొత్తగా చేరుతుందంటున్నారు. ఈ ఆలయానికి 105 ఎకరాల భూములున్నాయి. అందులో కొంతమేర ఆక్రమణలకు గురైనా విశాఖలో భూములు కావడం వల్లే ట్రస్టుబోర్డుకు ఇంత డిమాండ్‌ ఏర్పడిందనేది దేవదాయశాఖ వర్గాల్లో జరుగుతున్న చర్చ. ఆలయానికి ఉన్న భూములే ఇంత పెద్ద పోటీకి కారణమని వారు అంటున్నారు.

Updated Date - 2020-11-25T09:48:17+05:30 IST