-
-
Home » Andhra Pradesh » Siva Shankar Serious Comments
-
ఆ ముగ్గురు తోకలేని కోతుల లాంటి వారు: జనసేన నేత
ABN , First Publish Date - 2020-12-30T20:37:30+05:30 IST
ఈ ముగ్గురు తోకలు కత్తిరించిన కోతులులాంటివారని శివశంకర్ అభివర్ణించారు.

అమరావతి: జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌పై ఏపీ మంత్రులు చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ నేత శివశంకర్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెనుక ఉన్న ముగ్గురు మంత్రులు.. వెల్లంపల్లి శ్రీనివాస్, కొడాలి నాని, పేర్ని నాని.. ఈ ముగ్గురు తోకలు కత్తిరించిన కోతులులాంటివారని అభివర్ణించారు. వారికి మంత్రివర్గ సమిష్టి బాధ్యతలు తెలియవని, ప్రజస్వామ్యం గానీ, రాజ్యాంగంలోని ఓనమాలు తెలియని మంత్రులని విమర్శించారు. వారు ప్రాచీనయుగంలో పుట్టవలసినవాళ్లని అన్నారు. ఈ యుగంలో పుట్టడం ఆంధ్రరాష్ట్ర ప్రజల దౌర్భాగ్యమని అన్నారు.
కొడాలి నాని బూతులు మాట్లాడుతూ.. వ్యక్తిగత దూషణలకు వెళుతున్నారని, ప్రజా సమస్యలపై మాట్లాడడంలేదని శివశంకర్ విమర్శించారు. మంత్రులు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలన్నారు. బూతులు మాట్లాడేవారిని పక్కన పెట్టుకుని సీఎం జగన్ పరిపాలన సాగిస్తున్నారని విమర్శించారు. 19 లక్షల మంది రైతులకు నష్టం జరిగిందని వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు అసెంబ్లీ సాక్షిగా చెప్పారని... ఇప్పుడు 11 లక్షల మంది రైతులని చెబుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో రైతుల సమస్యను గాలికొదిలేశారని, నివర్ తుఫాన్ వచ్చినప్పుడు తడిసిన ధ్యాన్నాన్ని కొనుగోలు చేస్తానని ముఖ్యమంత్రి చెప్పారని.. ఇప్పుడు మిల్లర్లు శాసిస్తున్నారని, రైతులు రోడ్డుపై ఉన్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా వ్యక్తిగత దాడులు ఆపాలని, నివర్ నష్టపరిహారం రైతులకు తక్షణమే ఇవ్వాలని శివశంకర్ డిమాండ్ చేశారు.