ఒక్కరోజే 180 కేసులు

ABN , First Publish Date - 2020-06-04T08:44:08+05:30 IST

కరోనా కేసుల్లో రాష్ట్రం రికార్డు సృష్టించింది. బుధవారం ఒక్కరోజే అత్యధికంగా 180 కొత్త కేసులు నమోదయ్యాయి. మార్చి 12న నెల్లూరులో తొలికేసు నమోదైన తర్వాత ఈ స్థాయిలో కేసులు బయటపడటం ఇదే తొలిసారి.

ఒక్కరోజే 180 కేసులు

  • రాష్ట్రంలో కరోనా కేసుల్లో ఇదే రికార్డు
  • సచివాలయంలో మరో ఉద్యోగికి పాజిటివ్‌
  • కరోనాకు మరో నలుగురు బలి


(ఆంధ్రజ్యోతి, న్యూస్‌నెట్‌వర్క్‌) : కరోనా కేసుల్లో రాష్ట్రం రికార్డు సృష్టించింది. బుధవారం ఒక్కరోజే అత్యధికంగా 180 కొత్త కేసులు నమోదయ్యాయి. మార్చి 12న నెల్లూరులో తొలికేసు నమోదైన తర్వాత ఈ స్థాయిలో కేసులు బయటపడటం ఇదే తొలిసారి. మే 27న 134మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ కావడమే ఇప్పటి వరకూ అత్యధికం. ఇప్పుడు ఈ సంఖ్య 180కి చేరడంతో ఆరోగ్యశాఖ అధికారులు ఉలిక్కిపడ్డారు. లాక్‌డౌన్‌ సడలింపులతో జూన్‌ 15 తర్వాత కేసులు భారీగా పెరుగుతాయని అంచనా వేశారు. దానికంటే ముందే వైరస్‌ ఉధృతమైంది. తాజా కేసుల్లో 79మంది రాష్ట్రంలోని వారు కాగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 94మందికి, విదేశాల నుంచి వచ్చిన ఏడుగురికి వ్యాధి సోకింది. వీటితో కలిపి మొత్తం పాజిటివ్‌ కేసులు 3,971కి చేరాయి. బుధవారం 35మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకూ రాష్ట్రంలో 2,244మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి కాగా, 967మంది చికిత్స పొందుతున్నారు. ఇంకోవైపు కరోనా కాటుకు మరో నలుగురు బలయ్యారు. వీరిలో చిత్తూరులో ఇద్దరు, కృష్ణా, కర్నూలు జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు. 


వీటితో కలిపి కరోనా మరణాలు 68కి చేరాయి. పశ్చిమగోదావరి జిల్లాలో మరో 18మంది కరోనా బారిన పడ్డారు. గుంటూరు జిల్లాలో మరో 14కేసులు నమోదయ్యాయి. ఇండోనేషియా, చెన్నై, పుణె, హైదరాబాద్‌ నుంచి వచ్చి క్వారంటైన్‌ సెంటర్‌లో ఉన్న 9మందికి కరోనా నిర్ధారణ అయింది. కడప జిల్లాలో మరో 15మంది కరోనా బారిన పడ్డారు. మైలవరం మండలానికి చెందిన వ్యక్తికి 5రోజుల క్రితం పాజిటివ్‌ వచ్చింది. ఆ కుటుంబంలో ఐదేళ్ల బాలికకు రెండురోజుల క్రితమే కరోనా నిర్ధారణ అయింది. ఆయనతో కలిసి ఉపాధి పనులు చేసిన 191మంది శాంపిల్స్‌ తీసి పరీక్ష చేయగా పదిమందికి పాజిటివ్‌గా నిర్ధారించారు. వీరిని ప్రత్యేక బస్సులో కడప ఫాతిమా మెడికల్‌ కాలేజీ జిల్లా కొవిడ్‌-19 ఆస్పత్రికి తరలిస్తున్న సమయంలో అదే గ్రామానికి చెందిన వృద్ధుడు(64) అక్కడే ఉన్నాడు. మన ఊళ్లో ఇంతమందికి కరోనా వచ్చిందా... అంటూ షాక్‌కు గురయ్యాడు. అక్కడినుంచి ఇంటికి వెళ్తుండగా గుండెపోటుతో కుప్పకూలి మృతిచెందాడు. కర్నూలు జిల్లాలో మరో 11మందికి వైరస్‌ నిర్ధారణ అయింది. దేవనకొండ మండలంలో 3నెలల చిన్నారికి వ్యాధి సోకింది. తూర్పుగోదావరి జిల్లాలో మరో 11కేసులు నమోదయ్యాయి. అల్లవరం మండలానికి చెందిన ఒకే కుటుంబంలో అయిదుగురికి పాజిటివ్‌గా తేలింది. ర శ్రీకాకుళం జిల్లాలో మరో 3కేసులు, ప్రకాశం జిల్లాలో ఇంకో 8 కేసులు నమోదయ్యాయి. ఒంగోలు జీజీహెచ్‌లో కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న స్టాఫ్‌నర్సు, ఆమె భర్తకు పాజిటివ్‌ వచ్చింది. చిత్తూరు జిల్లాలో మరో 11కేసులు నమోదయ్యాయి. విశాఖలో నలుగురు, కృష్ణాజిల్లాలో ముగ్గురు, విజయనగరం జిల్లాలో మరో పదిమంది కరోనా బారిన పడ్డారు. నెల్లూరు జిల్లాలో మరో 10కేసులు నమోదయ్యాయి.


జీఏడీ ఉద్యోగికి కరోనా

సచివాలయంలో ముఖ్యమంత్రి ఉండే మొదటి బ్లాకులో జీఏడీ పొలిటికల్‌ విభాగంలో పనిచేసే ఉద్యోగికి పాజిటివ్‌ నిర్ధారణయింది. ఇప్పటికే హైదరాబాద్‌ నుంచి వచ్చిన వ్యవసాయశాఖ ఉద్యోగికి వ్యాధి సంక్రమించగా తాజాగా పాజిటివ్‌ వచ్చిన వ్యక్తి అతని రూమ్‌మేట్‌గా అధికారులు చెబుతున్నారు.

Updated Date - 2020-06-04T08:44:08+05:30 IST