‘ఆర్థిక సంఘం నిధుల’పై మార్గదర్శకాలు
ABN , First Publish Date - 2020-10-27T08:36:43+05:30 IST
రాష్ట్రంలోని పట్టణ స్థానిక సంస్థలు 15వ ఆర్థిక సంఘం నిధులను పొందేందుకు పాటించాల్సిన మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది.

అమరావతి, అక్టోబరు 26(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని పట్టణ స్థానిక సంస్థలు 15వ ఆర్థిక సంఘం నిధులను పొందేందుకు పాటించాల్సిన మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి జె.శ్యామలరావు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. పట్టణ ప్రాంతాల్లోని వాయు నాణ్యత, భూగర్భ జలాలు, పారిశుద్ధ్యం, తాగునీరు తదితరాల ప్రాధాన్య ప్రాతిపదికన నిధులు ఇవ్వనున్నట్లు తెలిపారు. 10 లక్షలకుపైగా జనాభా కలిగిన విశాఖపట్నం, విజయవాడ నగరాలను ఒక విభాగంగా, 10 లక్షల కంటే తక్కువ జనాభా ఉన్న ఇతర నగరాలు, పట్టణాలను మరొక కేటగిరీగా విభజించి ఈ గ్రాంట్లు ఇస్తారన్నారు. గతేడాదితో పోల్చితే పట్టణ స్థానిక సంస్థలు చేసిన కృషిని మదింపు చేసి, దాని ఆధారంగా ఈ గ్రాంట్లు మంజూరు చేస్తారని పేర్కొన్నారు. ఇందుకోసం ప్రతి పట్టణ స్థానిక సంస్థ వార్షిక అభివృద్ధి ప్రణాళిక (ఏడీపీ)లను రూపొందించుకోవాలని, ఆయా మున్సిపల్ కమిషనర్ చైర్‌పర్సన్‌గా, ఇంజనీరింగ్ విభాగాధిపతి కన్వీనర్‌గా, వివిధ విభాగాధిపతులు, పట్టణ వ్యవహారాల్లో నిపుణులు, కన్సల్టెంట్లు సభ్యులుగా టెక్నికల్ వర్కింగ్ కమిటీలను ఏర్పాటు చేసుకోవాలని శ్యామలరావు ఆదేశించారు. 15వ ఆర్థిక సంఘం మంజూరుచేసే గ్రాంట్లలో 40 శాతాన్ని ఎస్సీ, ఎస్టీలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో వెచ్చించాల్సి ఉంటుందన్నారు.