మాస్కులకు కటకట!

ABN , First Publish Date - 2020-03-25T07:50:00+05:30 IST

రాష్ట్రంలో ఎక్కడా మాస్కులు లభించడం లేదు. కేవలం వైద్యులు, అధికారులు, పోలీసులు, పారిశుద్ధ్య సిబ్బంది వద్ద మాత్రమే మాస్కులతో...

మాస్కులకు కటకట!

రాజమహేంద్రవరం, మార్చి 24(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఎక్కడా మాస్కులు లభించడం లేదు. కేవలం వైద్యులు, అధికారులు, పోలీసులు, పారిశుద్ధ్య సిబ్బంది వద్ద మాత్రమే మాస్కులతో కనిపిస్తున్నారు. చాలా తక్కువమంది సామాన్య ప్రజలకు మాత్రమే లభ్యమవుతున్నాయి. రాష్ట్రంలో సరిపడా మాస్కులు ఉత్పత్తి చేసే కంపెనీలు లేవు. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం ఇండస్ర్టియల్‌ ఎస్టేట్‌లోని ఆదిత్య కంపెనీ రోజుకు 30- 40వేల మాస్కులు తయారు చేస్తున్నట్టు అధికారుల కథనం. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో ఉన్న మరో పరిశ్రమలో రోజుకు కేవలం 6వేల మాస్కులు తయారవుతాయి. గతంలో ఎప్పుడూ ఇంత అవసరం లేకపోవడం వల్ల కేవలం ఆస్పత్రులకు, అక్కడక్కడా శానిటరీ సిబ్బంది అవసరాలకు మాత్రమే మాస్కులు కొనేవారు. పైగా ఈ మాస్కులు ఎక్కువసేపు పనిచేయవు.  ఏరోజుకారోజు కొత్తవి వాడాల్సిందే. రెండుమూడు రోజులు వాడేవి కూడా ఉన్నా అవి అందుబాటులో ఉండడం లేదు. దీంతో మాస్కుల కొరత పెద్ద సమస్యగా మారింది. వీటికి కేంద్రం ధరలు నిర్ణయించింది. ఫేస్‌మాస్కు 2ప్లే రూ.8, 3ప్లే రూ.10, శానిటైజర్‌ 50ఎంఎల్‌ రూ.25,  100 ఎంఎల్‌ రూ.50,  200 ఎంఎల్‌  రూ.100,  250 ఎంఎల్‌ రూ.125,  500 ఎంల్‌ రూ.250. ఎవరైనా అధిక ధరలకు అమ్మితే ఔషఽధ నియంత్రణ, లీగల్‌ మెట్రాలజీ అధికారులు దాడులు చేసి, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. 


లక్ష మాస్కులు సిద్ధం : సీఎంవో అదనపు ప్రధాన కార్యదర్శి పీవీ రమేశ్‌ 

అమరావతి, మార్చి 24(ఆంధ్రజ్యోతి): కరోనా వ్యాప్తి కట్టడికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని సీఎంవో అదనపు ప్రధాన కార్యదర్శి పీవీ రమేశ్‌ అన్నారు. నిత్యావసరాల కోసం ప్రజలు బయటకు వచ్చి ఇబ్బందులు పడకుండా ఇళ్ల ముందుకే తోపుడు బండ్లపై తీసుకొచ్చే యోచన ఉందన్నారు.  కరోనా బాధితులకు సేవలందించే డాక్టర్లు, నర్సులు, బాధితుల సన్నిహితుల కోసం లక్ష వరకు ఎన్‌-95 మాస్కులు సిద్ధంగా ఉన్నాయన్నారు. డాక్టర్లు, నర్సులు ఉపయోగించాల్సిన ప్రొటెక్షన్‌ సూట్లు 10వేల వరకు అందుబాటులో ఉన్నాయని చెప్పారు .గంటకోసారి సబ్బు/ శానిటైజర్‌తో చేతులు కడుక్కోవాలని, చేతులు మొహంపై పెట్టుకోవద్దని కోరారు. మంగళవారం ఆయన సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 800వెంటిలేటర్లు అందుబాటులో ఉన్నాయన్నారు. మరో 200 వెంటిలేటర్లు కొనాలని సీఎం ఆదేశించారని చెప్పారు. కరోనా లక్షణాలున్నవారు, వారితో సన్నిహితంగా ఉంటున్నవారు, వారికి సపర్యలు చేస్తున్నవారు మాత్రమే మాస్కులు ధరించాల్సిన అవసరం ఉందన్నారు. వాడిన మాస్కులు కాల్చాలని లేకుంటే పూడ్చిపెట్టాలని, ఎక్కడబడితే అక్కడ పడేయకూడదని వివరించారు. జ్వరంవస్తే పారాసిటమాల్‌ వేసుకోవాలని సూచించారు. వైద్యుల సలహా మేరకు మాత్రమే హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ వాడాలని చెప్పారు. ప్రభుత్వం తరఫున, సీఎం తరఫున రాష్ట్ర ప్రజలందరికీ రమేశ్‌ ఉగాది శుభాకాంక్షలు చెప్పారు. 

Read more