శివయ్య స్థలం స్వాహాయ!
ABN , First Publish Date - 2020-07-10T08:16:43+05:30 IST
విజయవాడ నగరంలో అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో ఒకటి... సత్యనారాయణపురం. ఇక్కడి శివాజీ కేఫ్ సెంటర్లో శ్రీకాశీ విశ్వేశ్వరస్వామి దేవస్థానం ఉంది.

- విజయవాడలో మంత్రి మంత్రాంగం
- స్థానిక ప్రజాప్రతినిధితో కలిసి చక్రం
- 10 కోట్ల విలువైన 900 గజాలు స్వాహా
- పీఠాన్ని తెరపైకి తెచ్చి ‘అధికార కబ్జా’
- ఆ పీఠం స్థానిక నేత అనుచరుడిదే!
- కీలక మంత్రి కావడంతో చకచకా ఉత్తర్వులు
- నేడో రేపో స్థలం స్వాధీనం!
అది ఖరీదైన స్థలం! అందులోనూ... దేవుడిది! దానిపై పెద్దల కన్ను పడింది. అయితే, నేరుగా పాగా వేస్తే విమర్శలు వస్తాయి కదా! అందుకే, ఓ స్కీమ్ వేశారు. తమ వర్గానికే చెందిన ‘పీఠానికి’ స్థలాన్ని అప్పగించేలా స్కెచ్ గీశారు. చేతికి మట్టి అంటకుండానే... పది కోట్ల విలువైన స్థలానికి టెండరు పెట్టారు. కీలక మంత్రే రంగంలోకి దిగడంతో... చకచకా ఉత్తర్వులూ జారీ అయిపోయాయి. అదెలాగో మీరూ చూడండి!
(విజయవాడ - ఆంధ్రజ్యోతి)
విజయవాడ నగరంలో అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో ఒకటి... సత్యనారాయణపురం. ఇక్కడి శివాజీ కేఫ్ సెంటర్లో శ్రీకాశీ విశ్వేశ్వరస్వామి దేవస్థానం ఉంది. ఈ ఆలయ అభివృద్ధి నిమిత్తం సత్యనారాయణపురానికి చెందిన తాడేపల్లి సీతమ్మ అరవై ఏళ్ల కిందట సుమారు 600 గజాల డాబా ఇల్లు ఉన్న స్థలాన్ని దానంగా ఇచ్చారు. 1957లో విజయవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో దేవస్థానం పేరుతో ఈ ఆస్తిని రిజిస్టర్ చేయించారు. డాబా పోను మిగిలిన ఖాళీ స్థలంలో 1964లో కళ్లేపల్లి కృష్ణంరాజు అనే దాత, మరికొందరు దాతలు కలిసి భక్తుల కోసం శ్రీసీతారామ కల్యాణమండపాన్ని నిర్మించారు. అప్పటి నుంచి ఈ కల్యాణమండపం శ్రీకాశీ విశ్వేశ్వరస్వామి దేవస్థానానికి చెందిన స్థిరాస్తిగా ఉంది. 600 గజాల స్థలం వెనుక దేవస్థానానికి దాతలు ఇచ్చిన మరో 300 గజాల స్థలం ఉంది. మొత్తం 900 గజాలు! దీని విలువ... రూ.10 కోట్లు. దీనిని స్వాహా చేసేందుకు అధికార పార్టీ నేతలు పావులు కదుపుతున్నారు.
ఎప్పటి నుంచో కన్ను...
దేవుడు.. పైగా భోళా శంకరుడు కదా! ఆయన భూమి సొంతం చేసుకున్నా ‘ఫర్వాలేదులే’ అని నాయకులు భావించారు. 2008లోనే దీనిపై రాజకీయ నాయకుల కన్ను పడింది. తమ అనుచరులను ట్రస్టు బోర్డు సభ్యులుగా ప్రవేశపెట్టి ఆలయానికి చెందిన ఆస్తులపై పెత్తనం సాగించడం మొదలుపెట్టారు. 2010లో దేవస్థానం ఈవోతో సంప్రదించకుండానే 900 గజాల స్థలాన్ని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేందుకు కొందరు సభ్యులు తీర్మానం చేశారు. ఈ తీర్మానంపై ట్రస్టు బోర్డు చైర్మన్, శాశ్వత ధర్మకర్త ఇద్దరూ సంతకాలు చేయలేదు. దీంతో ఆ తీర్మానానికి విలువ లేకపోవడంతో దేవదాయశాఖ అధికారులు కొట్టివేశారు. 2015లో మరోసారి ఆ స్థలాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నాలు జరగ్గా, దేవదాయ శాఖ ఆ స్థలం ఆలయానికి చెందినదేనని, దాన్ని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడం కుదరదని స్పష్టం చేసింది.
ఇప్పుడు కొత్త స్కీమ్
ప్రభుత్వం మారింది. ఆలయ స్థలాన్ని దక్కించుకునేందుకు కొత్త స్కీమ్ మొదలైంది. ఒక మంత్రి, స్థానిక ప్రజాప్రతినిధి తమ అనుచరుల ద్వారా పావులు కదపడం మొదలుపెట్టారు. శివాజీ కేఫ్ ఏరియా కమర్షియల్ ప్రాంతం కావడంతో ఎలాగైనా ఖరీదైన ఈ స్థలాన్ని కాజేయాలన్న లక్ష్యంతో గట్టి ప్రయత్నాలే చేశారు. దేవుడి భూమి కదా... దానిని పీఠానికి అప్పగిస్తే సరి! అయితే... ఆ పీఠం తమకు చెందినదై ఉండాలి! ఇదీ వాళ్ల స్కీమ్! స్థానిక ప్రజాప్రతినిధి అనుచరుల్లో ఒకరికి గన్నవరంలో శ్రీభువనేశ్వరి పీఠం ఉంది. దేవస్థానానికి చెందిన సుమారు 900 గజాల స్థలాన్ని ఆ పీఠానికి అప్పగించాలని మంత్రి, స్థానిక ప్రజాప్రతినిధి దేవదాయ శాఖ అధికారులపై ఒత్తిళ్లు తీసుకొచ్చారు. దీంతో ఆగమేఘాలపై కాగితాలు కదిలాయి.
స్థలాన్ని శ్రీభువనేశ్వరి పీఠానికి అప్పగించాలంటూ ఉన్నతాధికారుల నుంచి ఉత్తర్వులు విడుదలైపోయాయి. నేడో, రేపో ఈ స్థలాన్ని భువనేశ్వరి పీఠానికి అప్పగించేందుకు సిద్ధమవుతున్నారు. దీనిపై కాశీవిశ్వేశ్వర స్వామి దేవస్థానం ఈవో సీతారామయ్యను వివరణ కోరగా.. కల్యాణ మండపం ఉన్న స్థలాన్ని భువనేశ్వరి పీఠానికి అప్పగించాలని ఉత్తర్వులు వచ్చాయని, ఉన్నతాధికారుల నిర్ణయంపై తాను ఏమీ మాట్లాడలేనని చెప్పారు. ఆ స్థలం పరాధీనానికి 2015లో ససేమిరా అన్న దేవదాయ శాఖ... ఇప్పుడు కిమ్మనకుండా ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం.
2015లో కల్యాణమండపం దేవస్థానానికి చెందినదిగా గుర్తిస్తూ అప్పటి దేవదాయశాఖ అధికారులు జారీ చేసిన ఉత్తర్వు