వసూళ్లు.. ఒత్తిళ్లు!

ABN , First Publish Date - 2020-07-18T08:21:51+05:30 IST

పాలకపక్ష నేతల అవినీతి ఇప్పుడు విద్యుత్‌ శాఖకూ పాకింది. సబ్‌స్టేషన్లలో షిఫ్ట్‌ ఆపరేటర్లుగా నియమిస్తామని ఉద్యోగార్థుల నుంచి ఎమ్మెల్యేలు వందల కోట్లు వ సూలు చేస్తున్న వైనం వెలుగులోకి

వసూళ్లు.. ఒత్తిళ్లు!

  • షిఫ్ట్‌ ఆపరేటర్ల పోస్టులకు వందల కోట్లు స్వాహా..
  • ఒక్కో ఉద్యోగానికి రూ.10 లక్షలు?
  • మేం చెప్పిన వారినే పెట్టుకోవాలి
  • ఖాళీల్లేకుంటే ఉన్నవారిని తీసేయండి
  • వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రుల హుకుం
  • తలదూర్చవద్దని సీఎం చెప్పినా ససేమిరా
  • రాష్ట్రవ్యాప్తంగా ఖాళీలు 1,800
  • ఎమ్మెల్యేల జాబితాల్లో 4-5 వేలు
  • ఆందోళన బాటలో ఉద్యోగులు


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

పాలకపక్ష నేతల అవినీతి ఇప్పుడు విద్యుత్‌ శాఖకూ పాకింది. సబ్‌స్టేషన్లలో షిఫ్ట్‌ ఆపరేటర్లుగా నియమిస్తామని ఉద్యోగార్థుల నుంచి ఎమ్మెల్యేలు వందల కోట్లు వసూలు చేస్తున్న వైనం వెలుగులోకి వచ్చింది. ఈ నియామకాల్లో ఎమ్మెల్యేలు తలదూర్చకుండా చూడాలని సీఎం జగన్‌ మంత్రులకు సూచించినా వినిపించుకోవడం లేదు. ఇప్పటికే వసూళ్లు చేసిన ఎమ్మెల్యేలు.. తాము చెప్పినవారికే ఆ పోస్టులు ఇవ్వాలని, ప్రస్తుతం పనిచేస్తున్నవారిని తీసేయాలని అధికారులపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తెస్తున్నారు. దీంతో షిష్ట్‌ ఆపరేటర్ల పోస్టుల భర్తీ వ్యవహారం విద్యుత్‌ శాఖలో దుమారం రేపుతోంది. ఈ ఉద్యోగాల భర్తీలో మంత్రులు, ఎమ్మెల్యేలు జోక్యం చేసుకోవద్దని స్వయంగా సీఎం జగన్‌ మొన్నటి కేబినె ట్‌ భేటీలో చెప్పినా.. వారు లెక్కచేయడం లేదు. వారి ఒత్తిళ్లు తట్టుకోలేక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో కొన్నిచోట్ల తొలగింపులు మొదలునెట్టడంతో ఉద్యోగులు ఉద్యమ బాట పడుతున్నారు. గత ప్రభుత్వంలో షిఫ్ట్‌ ఆపరేటర్లకు జీతాలు గణనీయంగా పెరగడంతో ఈ పోస్టులకు డిమాండ్‌ పెరిగింది.


భవిష్యత్‌లో పర్మినెంట్‌ అవుతుందన్న అభిప్రాయంతో ఉద్యోగార్థుల నుంచి ఒక్కో పోస్టుకు రూ. పది లక్షల వరకూ ఎమ్మెల్యేలు వసూలు చేశారని ఆరోపణలు వస్తున్నాయి. సీఐటీయూ కార్మిక సంఘానికి అనుబంధంగా ఉన్న యునైటెడ్‌ ఎలక్ట్రికల్‌ కాంట్రాక్ట్‌ వర్కర్స్‌ యూనియన్‌ ఈ వ్యవహారంపై కొంతకాలం క్రి తం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసింది. ఒక్కో పోస్టుకు రూ.పది లక్షల చొప్పు న రాష్ట్రవ్యాప్తంగా రూ.200 కోట్లు వసూలు చేశారని, దీనివెనుక కొందరు ఎమ్మెల్యేలు, మంత్రులు ఉన్నారని తెలిపింది. ఈ వ్యవహారం సీఎం వరకూ వెళ్లడంతో ఈ పోస్టుల భర్తీని నిలిపివేయాలని ఆయన అప్పట్లో ఆదేశించారు. దీంతో వసూళ్లకు, భర్తీకి బ్రేకు పడింది. కానీ చాలాచోట్ల డబ్బులు వసూలు చేసిన నేతలు.. వాటిని అభ్యర్థులకు తిరిగి ఇవ్వలేదు. 4 రోజులాగితే పోస్టులు ఇప్పిస్తామని నచ్చజెబుతూ వచ్చారు. డబ్బు తీసుకుని నెలలు గడుస్తున్నా ఉద్యోగాల ఊసు లేకపోవడంతో కొన్నిచోట్ల అభ్యర్థులు ఆ నేతలపై ఒత్తిడి పెంచారు. దీంతో ఎమ్మెల్యేలు అధికారుల వెంట పడుతున్నారు.


నైట్‌వాచ్‌మన్‌గా తీసుకోవాలని..

రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్‌ సబ్‌ స్టేషన్లలో షిఫ్ట్‌ ఆపరేటర్‌ పోస్టులు సుమారు 12 వేలు ఉంటాయని అంచనా. గ్రామ సచివాలయాల్లో ఉద్యోగాలు రావడం తో ఇందులో సుమారు 1,800 పోస్టులు ఇటీవల ఖాళీ అయ్యాయి. కానీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఇచ్చిన జాబితాల్లో 4-5 వేల పేర్లు ఉన్నట్లు తెలిసింది. ఈ లెక్కన ఆశావహుల నుంచి నేతలు వసూలు చేసిన మొత్తం రూ.400 కోట్ల వరకూ ఉన్నా ఆశ్చర్యపడనక్కర లేదని ఉద్యోగ సంఘాల నేతలు అంటున్నారు. అన్ని సబ్‌ స్టేషన్లలో నైట్‌ వాచ్‌మన్‌ ఒకరు ఉంటారు. వారికి బయట మరేదైనా పని అప్పగించి తాము చెప్పిన వారిని నైట్‌ వాచ్‌మన్‌గా తీసుకోవాలని కొందరు ఎమ్మెల్యేలు హుకుం జారీ చేస్తున్నారు. నైట్‌ వాచ్‌మన్‌కు ఇతరత్రా పనులు ఏం అప్పగించాలో తెలియక అధికారులు అయోమయంలో పడుతున్నారు.


తిరుపతి కేం ద్రంగా ఉన్న ఎస్‌పీడీసీఎల్‌ డిస్కం అధికారులు కొంత మెతకగా ఉండడంతో అక్కడ నేతల ఒత్తిడి బాగా ఎక్కువగా ఉందని వినవస్తోంది. ముఖ్యమంత్రి ఆదేశాలతో సంబంధం లేకుండా కింది స్ధాయిలో మంత్రులు, ఎమ్మెల్యేలు తాము చెప్పిన పని చేయాల్సిందేనని ఒత్తిడి పెంచుతుండడంతో అధికారులకు దిక్కుతోచడం లేదు. ప్రస్తుతం ఈ అంశం సీఎం కార్యాలయం పరిశీలనలో ఉందని, భర్తీపై ప్రభుత్వ ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నామని ఒక అధికారి వెల్లడించారు.


సబ్‌స్టేషన్లలో అభ్యర్థుల బైఠాయింపు..

గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో ఒక చిత్రం చోటు చేసుకుంది. ఎమ్మెల్యేలు చెప్పారంటూ కొందరు అభ్యర్థులు వచ్చి విద్యుత్‌ శాఖ కార్యాలయాల్లో, సబ్‌ స్టేషన్లలో కూర్చుంటున్నారు. వారికి ఎవరూ పని అప్పగించకపోయినా ఉద్యోగుల్లా రోజూ వచ్చి ఎదురుగా కూర్చుండడంతో అధికారులకు ఎటూ పాలుపోవడం లేదు. పైగా రోజూ వచ్చి కూర్చుంటున్న వారికి ఎలాగోలా జీతాలు చెల్లించాలని కొందరు ఎమ్మెల్యేలు ఫోన్లు చేస్తుండడం మరో విశేషం. వారిని సర్దుబాటు చేయడానికి పోస్టులు ఖాళీగా లేవని చెబితే.. పాతవారిని తీసివేసి తాము చెప్పిన వారినే పెట్టుకోవాలని ఎమ్మెల్యేలు ఆదేశిస్తున్నారు. ఒక ఎమ్మెల్యే తెచ్చిన ఒత్తిడి తట్టుకోలేక అధికారులు నెల్లూరు జిల్లాలో 15 మంది ఆపరేటర్లను తొలగించి కొత్తవారిని పెట్టుకున్నారు. ఈ విషయం తెలిసి మిగిలిన ఎమ్మెల్యేలు కూడా ఈ దిశగా ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఇప్పటికే పనిచేస్తున్న వారిని అర్ధాంతరంగా తొలగించడం సరికాదని కాంట్రాక్ట్‌ వర్కర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో నెల్లూరు ఎస్‌ఈ కార్యాలయం ముందు శుక్రవారం ధర్నా జరిగింది. గుంటూరు జిల్లాలో కూడా ఉద్యోగులు ఆందోళన చేశారు.

Updated Date - 2020-07-18T08:21:51+05:30 IST