షిఫ్ట్‌ ఆపరేటర్‌ పోస్ట్‌ ఫర్‌ సేల్‌!

ABN , First Publish Date - 2020-10-28T08:47:06+05:30 IST

విద్యుత్‌ శాఖలో ప్రతిభ, అర్హత ఆధారంగా ఇవ్వాల్సిన షిఫ్ట్‌ ఆపరేటర్ల ఉద్యోగాలను ప్రజాప్రతినిధులు, అధికారులు బహిరంగ వేలం

షిఫ్ట్‌ ఆపరేటర్‌ పోస్ట్‌ ఫర్‌ సేల్‌!

ఒక్కో ఉద్యోగానికి రూ.8-10 లక్షలు వసూలు

వచ్చే నెల 13న సామూహిక రాయబార కార్యక్రమం


విజయవాడ, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): విద్యుత్‌ శాఖలో ప్రతిభ, అర్హత ఆధారంగా ఇవ్వాల్సిన షిఫ్ట్‌ ఆపరేటర్ల ఉద్యోగాలను ప్రజాప్రతినిధులు, అధికారులు బహిరంగ వేలం వేస్తున్నారని యునైటెడ్‌ విద్యుత్‌ కాంట్రాక్ట్‌ ఉద్యోగుల సంఘం నేతలు బాలకాశి, అనిల్‌, మణిపాల్‌ ఆరోపించారు. సాక్షాత్తు విద్యుత్‌ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జిల్లాలోనే ఈ పోస్టులు అమ్మేసుకున్నారని వెల్లడించారు. ఒక్కో పోస్టును రూ.8-10 లక్షలకు విక్రయించారని స్పష్టం చేశారు. డబ్బులు చెల్లించిన అభ్యర్థులు ఇప్పుడు ఉద్యోగాలు రాకపోవడంతో చెట్లు, విద్యుత్‌ టవర్లు ఎక్కి ఆత్మహత్యలు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. విజయవాడ గాంధీనగర్‌లోని ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం వారు మీడియాతో మాట్లాడారు. సీపీడీసీఎల్‌ పరిధిలోని మూడు జిల్లాలు, ఎస్పీడీసీఎల్‌ పరిధిలోని ఐదు జిల్లాల్లో సుమారు 1000కి పైగా షిఫ్ట్‌ ఆపరేటర్ల పోస్టుల నియామకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపించారు. ఈ పోస్టులకు సంబంధించి మంత్రి ఆదిమూలపు సురేశ్‌, కడప ఎంపీ అవినాశ్‌రెడ్డి, గురజాల ఎమ్మెల్యే కాసు మహేశ్వరరెడ్డి, పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరి శంకరరావు ఇచ్చిన సిఫార్సు లేఖలను వారు మీడియా ముందుంచారు.


మీటరు రీడర్లకు కూడా కాంట్రాక్టర్లు దారుణంగా వేతనాలు తగ్గించారని చెప్పారు. సీపీడీసీఎల్‌ పరిధిలోని మూడు జిల్లాలను మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి సంబంధించిన వ్యక్తి కాంట్రాక్ట్‌ తీసుకున్నారన్నారు. షిఫ్ట్‌ ఆపరేటర్ల నియామకాల్లో అక్రమాలు, మీటర్‌ రీడర్లకు సంబంధించిన సమస్యలపై నవంబర్‌ 13న విజయవాడలోని విద్యుత్‌ సౌధ వద్ద సామూహిక రాయబార కార్యక్రమాన్ని నిర్వహిస్తామని వెల్లడించారు.

Updated Date - 2020-10-28T08:47:06+05:30 IST