అరబ్‌ కంపెనీకే షేక్‌!

ABN , First Publish Date - 2020-10-28T08:54:01+05:30 IST

యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌కు చెందిన రస్‌అల్‌ఖైమకు తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటలో రాక్‌ సిరామిక్‌ కంపెనీ ఉంది. 2005లో ఏర్పాటైన ఈ కంపెనీ

అరబ్‌ కంపెనీకే షేక్‌!

‘రస్‌ అల్‌ఖైమ’లో అధికార పెద్దల దందా

ప్రతినెలా 35 లక్షలు జేబులో పడేలా డీల్‌

సూక్ష్మ లోపాలున్న టైల్స్‌తో లాభసాటి బేరం 

రంగంలోకి ముఖ్య నేత బంధువు

సీఎం పేషీ నుంచి నేరుగా ఫోన్లు

గనుల్లేక విశాఖలో ఇప్పటికే ఓ కంపెనీ మూత

భయపడి తలవంచిన అరబ్‌ కంపెనీ గ్రూపు

చిల్లర పైసలిచ్చి లక్షల విలువైన టైల్స్‌తరలింపు


‘గుర్తించలేని సూక్ష్మ లోపాలుగల పట్టు చీరలు అతి తక్కువ ధరకే’... ఇలాంటి ప్రకటనలు చూసే ఉంటారు!  లాభసాటి బేరమనిపిస్తే కొనేవాళ్లూ ఉంటారు. ‘సూక్ష్మలోపాల’ ఫార్ములాతో అధికార పార్టీ నేత ఒకరు భారీ లాభాలు గడిస్తున్నారు. చిన్న లోపాలున్న  సిరామిక్‌ టైల్స్‌ను లోడ్లకు లోడ్లు తరలిస్తూ ప్రతినెలా రూ.35 లక్షలు గడిస్తున్నారు. ఇప్పటిదాకా స్థానికంగా ఉన్న డీలర్లే ఈ సూక్ష్మ లోపాల టైల్స్‌ కొని లాభాలు పొందుతుండగా... ఇప్పుడు ఏకంగా బడా నాయకుడే వీటిపై కన్నేశారు. ‘ఎంతోకొంత ఇస్తే ఇస్తాం... లేదంటే లేదు’ అంటూ కంపెనీని బెదిరించి మరీ లోడ్‌లు తరలిస్తున్నారు. అరబ్‌ కంపెనీనే ‘షేక్‌’ చేస్తున్న ఆ కథేమిటో మీరూ చూడండి!


(కాకినాడ-ఆంధ్రజ్యోతి)

యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌కు చెందిన రస్‌అల్‌ఖైమకు తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటలో రాక్‌ సిరామిక్‌ కంపెనీ ఉంది. 2005లో ఏర్పాటైన ఈ కంపెనీ సుమారు 56 దేశాలకు విట్రిఫైడ్‌ టైల్స్‌ సరఫరా చేస్తోంది. రాక్‌ సిరామిక్‌ టైల్స్‌కు బాగా ఖరీదైనవిగా పేరుంది. అయితే... తయారైన టైల్స్‌లో గీతల వంటి సూక్ష్మ లోపాలు ఉంటే కొనుగోలుదారులు తిరస్కరిస్తారు. వెంటనే వెనక్కి పంపించివేస్తారు. అలాంటి సరుకును స్థానిక డీలర్లకు ఈ కంపెనీ తక్కువ ధరకు విక్రయిస్తోంది. విదేశాలకు సరఫరాచేసేందుకు అన్నివిధాల సిద్ధంచేసిన టైల్స్‌ టన్ను రూ. 30-40 వేలు ఉంటే, వీటిని రూ.13వేలుకు డీలర్లకు కంపెనీ అమ్ముతోంది. ఈ సరుకును దక్కించుకొన్న కొందరు డీలర్లు కోట్లకు కోట్లు వెనుకేసుకొంటున్నారు. దీంతో రాక్‌ సిరామిక్‌ కంపెనీపై కడప జిల్లాకు చెందిన ఓ ఢిల్లీ స్థాయి కీలకనేత కన్నుపడిండి.


వికటించిన రాయ..బేరం!

సిరామిక్‌ స్ర్కాప్‌తో వ్యాపారం చేయాలని నిర్ణయించుకొని సదరు కడప నేత తన ప్రయత్నాలు ప్రారంభించారు. రాష్ట్ర ముఖ్యనేతకు ఆయన బాగా దగ్గరి బంధువు. వైసీపీ అధికారంలోకి వచ్చి అప్పటికి ఐదు నెలలు. రఘునాథరెడ్డి అనే తన మనిషిని తూర్పుగోదావరి జిల్లాకు ఈ నేత పంపించారు. ‘నా మనిషి వస్తాడు. ఆయన చెప్పినట్టు చేయండి’ అని అప్పటికే కంపెనీ ప్రతినిధులకు ఆయన హుకుం జారీచేశారు. కాకినాడ నియోజకవర్గం కీలక అధికార నేతను కలుపుకొని వెళ్లి రఘునాథరెడ్డి కంపెనీ ప్రతినిధులతో చర్చలు జరిపారు. నెలనెలా తమకు విట్రిఫైడ్‌ టైల్స్‌ ఇవ్వాలని బేరం పెట్టారు. విదేశీ కంపెనీ కావడంతో లోకల్‌ దందాల రుచి వారికి పరిచయం లేరు. కడప నేత పంపించిన ప్రతిపాదనను అప్పుడూ, రెండోసారి ఆ నేతే ఫోన్‌ చేసినప్పుడూ కంపెనీ ప్రతినిధులు తిరస్కరించారు. దీంతో సీన్‌లోకి చివరకు అమరావతిలోని సీఎం పేషీ ప్రవేశించింది.

రంగంలోకి ‘సీఎం పేషీ’

కడప నేత పురమాయింపుతో సీఎం పేషీలోని ఓ కీలక వ్యక్తి రంగంలోకి దిగారు. ఆ వెంటనే నేరుగా కంపెనీకి ఫోన్‌ వెళ్లింది. ఏం మాట్లాడారో ఏమోగానీ, .మొత్తానికి కంపెనీ ప్రతినిధులు అయిష్టంగానే దారికివచ్చినట్టు సమాచారం. ఈ కంపెనీలో కార్మికులకు సంబంధించిన పలు సమస్యలున్నాయి. కొన్నిసార్లు అగ్ని ప్రమాదాలు సంభవించాయి. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే సరుకు, జీఎస్టీ తదితర వ్యవహారాల్లో అధికారులతో కంపెనీకి పనులున్నాయి. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకునే, పెద్దల డీల్‌కు రాక్‌ సిరామిక్‌ తల వంచినట్టు తెలిసింది. విశాఖ జిల్లా మాకవరపాలెంలో అన్‌రాక్‌ పేరుతో రస్‌అల్‌ఖైమ గ్రూపునకు భారీ అల్యుమినియం రిఫైనరీ ఉంది.


అప్పటి సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో రూ.ఆరు వేల కోట్ల పెట్టుబడితో ప్లాంట్‌ నిర్మాణమయింది. విశాఖ ఏజెన్సీలో బాక్సైట్‌ గనుల తవ్వకాలకు సంబంధించి అనుమతులు రాకపోవడంతో ఈ కంపెనీ అక్కడ ఇప్పటికీ నిరుపయోగంగానే పడిఉంది. తాజాగా సీఎం జగన్‌ ప్రభుత్వం బాక్సైట్‌ గనుల తవ్వకాలను కూడా నిషేధించింది. అయితే ఏపీలో తమ పెట్టుబడులకు అనేక సమస్యలున్న నేపథ్యంలో కంపెనీ చేసేదిలేక దారికి వచ్చిందని సమాచారం. అధికార పెద్దల ఒత్తిళ్లతో గత ఏడాది నవంబరులో డీల్‌ కుదిరినట్టు తెలిసింది.


లాభాలు కోట్లలోనే...

రాక్‌సిరామిక్‌ కంపెనీ నెలకు 25 లారీల వరకు విట్రిఫైడ్‌ టైల్స్‌ను సుమారు ఏడాది కాలంగా సదరు కడప నేతకు సమర్పించుకుంటోంది. ఇందులో సగం లారీలకు అసలు సొమ్ము చెల్లించకుండానే ఆయన అనుచరులు తరలించుకుపోతున్నారు. మిగిలిన లారీల్లో సరుకుకు మాత్రం తక్కువ ధర చెల్లిస్తున్నారు. రాక్‌ సిరామిక్‌ కంపెనీ టన్ను విట్రిఫైడ్‌ టైల్స్‌ను నాణ్యత ఆధారంగా సరాసరి రూ.13 వేలు వరకు విక్రయిస్తుంది. ఒక్కో లారీకి 30 టన్నుల టైల్స్‌ లోడ్‌ చేస్తుంది. అంటే రూ.3.90 లక్షలు. కానీ సదరు నేత మాత్రం టన్నుకు రూ.9 వేల వరకు మాత్రమే చెల్లిస్తున్నారు. అంటే ఒకలారీకి రూ.1.20లక్షల లాభం. ఇలా 15 లారీలకు నెలకు రూ.20 లక్షల వరకు జేబులోకి వెళుతోంది. ఉచితంగా తరలించుకొనిపోయే సరుకునూ కలుపుకొంటే రూ.35 లక్షల వరకు జేబుల్లోకి వెళుతోంది. సదరు కడప నేత తరఫున ఈ వ్యవహారాలను రఘునాథరెడ్డి చక్కబెడుతున్నారు. కర్నూలు జిల్లా డోన్‌కు చెందిన రఘునాథరెడ్డికి కృష్ణ ఎంటర్‌ ప్రైజెస్‌ అనే కంపెనీ ఉంది.  రాక్‌సిరామిక్‌ నుంచి తరలించుకొచ్చే టైల్స్‌ తొలుత ఈ కంపెనీ గోదాములకే చేరతాయి. అక్కడినుంచి కీలక నేత ఆదేశాలు, ఆర్డర్ల మేరకు అవి వేర్వేరు ప్రాంతాలకు సరఫరా అవుతున్నాయి. ఇందులో కొంత సరుకు కడప చేరుతోంది. అక్కడ అపార్ట్‌మెంట్‌ బిల్డర్లతో ఒప్పందం కుదుర్చుకుని రాయలసీమలో పలు ప్రాంతాలకు ఆ సరుకు విక్రయిస్తున్నారు.


ఆయన వద్దే కొనాలట!

రాక్‌ సిరామిక్‌ నుంచి తీసుకువెళ్లే టైల్స్‌లో చాలావరకు పెద్దగా శ్రమ లేకుండా ఆ కంపెనీ పరిసరాల్లోని రిటైల్‌ దుకాణదారులకు రఘునాథరెడ్డి విక్రయిస్తున్నట్టు సమాచారం. వాస్తవానికి ఏడాది కిందటి వరకు ఈ కంపెనీ సమీపంలో అనేక మంది వ్యాపారులు ఒకరిద్దరు డీలర్ల ద్వారా విట్రిఫైడ్‌ టైల్స్‌ (స్ర్కాప్‌) కొనుగోలు చేసి విక్రయించేవారు. ఇప్పుడు కడప నేత రంగంలోకి రావడంతో సరుకు ఎవరైనా రఘునాథరెడ్డి వద్దే కొనుగోలు చేసేలా చక్రం తిప్పారు. చెప్పిన ధర ఇస్తేనే సరుకు ఇస్తున్నారు. సరుకు కొనుగోలు చేసిన వ్యక్తి లారీని ప్లాంట్‌ వద్దకు తీసుకువెళ్లి సరుకు తెచ్చుకోవాలి. అంటే సదరు నేతకు రవాణా చార్జీలు కూడా మిగులుతున్నాయన్నమాట! 


బెదిరింపులు తట్టుకోలేక...

రాక్‌సిరామిక్‌లో టైల్స్‌ కోసం అదేపనిగా కడప కీలకనేత తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు పెంచారు. ఎట్టిపరిస్థితుల్లోనూ అడిగినన్ని లారీల సరుకు ఇవ్వాల్సిందేనంటూ సిరామిక్‌ ప్లాంట్‌ జనరల్‌ మేనేజర్‌పై హెచ్చరికలు, బెదిరింపులకు దిగారు. అయితే అది తన పరిధిలో లేని విషయం అంటూ సదరు అధికారి ప్రాధేయపడ్డారు. అయినా కీలకనేత వినలేదు. సీఎం పేషీ నుంచీ జీఎంపై మరింత ఒత్తిడి తెచ్చారు. దందాకు తలొగ్గకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఈ వేధింపులకు తట్టుకోలేక ఏకంగా ఆయన తన ఉద్యోగానికి రాజీనామా చేసి వెళ్లిపోయారు.  

Updated Date - 2020-10-28T08:54:01+05:30 IST