నీటిపై నిగ్గు తేల్చండి

ABN , First Publish Date - 2020-12-10T08:23:48+05:30 IST

ఏలూరులో వందల మందికి అస్వస్థత తాగునీటి వల్లనే వచ్చిందా అనేది ముందుగా తేల్చాలని, ఆ తర్వాతే మిగిలిన అంశాలపై దృష్టి పెట్టాలని జాతీయ

నీటిపై నిగ్గు తేల్చండి

ఏలూరులో ఏమైనా వెలికివచ్చిందా?.. తుది నిర్ధారణలకు ఎప్పుడొస్తారు?

జాతీయ వైద్య సంస్థల నిపుణులతో సీఎం జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌

 అమరావతి, డిసెంబరు 9(ఆంధ్రజ్యోతి): ఏలూరులో వందల మందికి అస్వస్థత తాగునీటి వల్లనే వచ్చిందా అనేది ముందుగా తేల్చాలని, ఆ తర్వాతే మిగిలిన అంశాలపై దృష్టి పెట్టాలని జాతీయ సంస్థల నిపుణులను సీఎం జగన్‌ కోరారు. బుధవారం కేంద్ర వైద్య బృందాలు, ప్రఖ్యాత సంస్థల నిపుణులు, అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.


ఇప్పటి వరకూ సేకరించిన శాంపిల్స్‌, చేసిన పరీక్షలు, వెల్లడవుతున్న అంశాలపై ఈ సందర్భంగా ఆయన సమాచారం తీసుకున్నారు. కచ్చితమైన నిర్ధారణకు రావడానికి ఎంత సమయం పడుతుందని నిపుణులను అడిగి తెలుసుకున్నారు. అస్వస్థతకు కచ్చితమైన కారణాలు కనుక్కోవాలని విజ్ఞప్తి చేశారు. ఏలూరులో పరిస్థితి చక్కబడేలా అనుసరించాల్సిన కార్యాచరణ, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు. తుది నివేదికల ఆధారంగా సమగ్ర కార్యాచరణ ఉంటుందని ఆయన వెల్లడించారు. వీలైనంత త్వరగా అన్ని రకాల పరీక్షలు పూర్తిచేస్తే, శుక్రవారం మరోసారి సమావేశం అవుదామని వారితో సీఎం అన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న జాతీయ సంస్థల ప్రతినిధులు ఏమన్నారంటే...


నికెల్‌ ఓకే.. సీసంతోనే సమస్య: ఎయిమ్స్‌ న్యూఢిల్లీ 

‘‘ఇంకా సమగ్ర పరీక్షలు చేయాల్సి ఉంది. అస్వస్థతకు గురైన వారి రక్తంలో సీసం అధికంగా కనిపిస్తోంది. నికెల్‌ కూడా ఉంది. కాకపోతే భారతీయుల్లో నికెల్‌ ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి సీసం విషయంలోనే ఆందోళన పడాల్సి ఉంటుంది. బ్యాటరీలను రీసైక్లింగ్‌ చేసే ప్రక్రియ కూడా ఈ పరిస్థితికి దారి తీసి ఉండవచ్చు. పగలగొట్టిన బ్యాటరీలను డంప్‌ చేయడం వల్ల అవి భూమిలో కలిసి ఉండొచ్చు. కూరగాయలు, ధాన్యం లాంటి వాటి ద్వారానూ లెడ్‌ శరీరంలోకి చేరే అవకాశం ఉంది’’


ఇంటింటికీ వెళ్లి నమూనాల సేకరణ: ఎన్‌ఐఎన్‌

‘‘ఏలూరులోని ఐదు ప్రాంతాల్లో ప్రతి ఇంటికీ వెళ్లి, అస్వస్థతకు గురైన కుటుంబాలను కలుసుకున్నాం. వారు తీసుకున్న ఆహారంపై ఆరా తీశాం. కూరగాయలు, రక్తం, మూత్రం శాంపిళ్లు వారినుంచి సేకరించాం. ప్రస్తుతానికి ప్రమాదకర స్థాయిలో సంకేతాలు ఏమీ కనిపించడం లేదు’’


నీరు బాగానే ఉంది..వైర్‌సపైనే దృష్టి: ఐఐసీటీ

‘‘తాగునీటిపై వివిధ రకాల నమూనాలు తీసుకున్నాం. ఈ నమూనాలను పరీక్షించగా,  అనుకున్నస్థాయిలో ప్రమాదకర సంకేతాలేవీ కనిపించడం లేదు. అస్వస్థతకు వైరల్‌ కారణమా..? అన్న దానిపై పరీక్షలు చేస్తున్నాం’’ 


‘కొవిడ్‌’ చర్యలూ కారణం కావచ్చు: డబ్ల్యూహెచ్‌వో 

‘‘ఏలూరులో అస్వస్థతకు గురైన ప్రాంతాల్లో సర్వే చేస్తున్నాం. అక్కడి ప్రజలు తీసుకున్న ఆహారం సహా ఆరోగ్యపరమైన వివరాలు తీసుకుంటున్నాం. ఈ ప్రక్రియను త్వరలోనే పూర్తిచేస్తాం. కొవిడ్‌ నివారణా చర్యల్లో భాగంగా పారిశుద్ధ్య కార్యక్రమాలకు వినియోగించిన బ్లీచింగ్‌, క్లోరిన్‌లు కూడా కారణమై ఉండొచ్చు’’


Updated Date - 2020-12-10T08:23:48+05:30 IST