ఉపాధి’పై తేల్చండి
ABN , First Publish Date - 2020-12-05T09:35:03+05:30 IST
రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ఉపాధి హామీపనుల బిల్లులను ఎప్పటిలోగా చెల్లిస్తారో తేల్చిచెప్పాలని డిమాండ్ చేస్తూ శాననమండలిలో టీడీపీ సభ్యులు శుక్రవారం నిరసన తెలిపారు.

మండలి వెల్‌లో లోకేశ్ తదితరుల నిరసన
అమరావతి, డిసెంబరు 4(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ఉపాధి హామీపనుల బిల్లులను ఎప్పటిలోగా చెల్లిస్తారో తేల్చిచెప్పాలని డిమాండ్ చేస్తూ శాననమండలిలో టీడీపీ సభ్యులు శుక్రవారం నిరసన తెలిపారు. వెల్‌లోకి వెళ్లి లోకేశ్ తదితర టీడీపీ సభ్యులు పెద్దపెట్టున నినాదాలు చేశారు. చైర్మన్ పోడియంపైకి మరికొందరు ఎక్కి నిరసన వ్యక్తంచేశారు. దీంతో మండలి మూడుసార్లు వాయిదా పడింది. సభ జరగటానికి సహకరించాలని వైస్‌చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం కోరినా, సభ్యులు పట్టువీడలేదు. దీంతో సభను తొలుత 15నిమిషాలు వాయిదా వేశారు. అనంతరం సభ ప్రారంభమైనా పరిస్థితి మారలేదు. టీడీపీ సభ్యుల నిరసనల మధ్యే చైర్మన్ ఎంఏ షరీఫ్ అప్రాప్రియేట్ బిల్లును ఆమోదించారు. అనంతరం సభ వాయిదా పడింది.
ఉపాధి బిల్లుల బకాయిలపై జరిగిన చర్చలో టీడీపీ సభ్యుడు రాజేంద్రప్రసాద్ మాట్లాడారు. ‘‘పెండింగ్‌లో ఉన్న రూ.2,500 కోట్ల బకాయిలను వెంటనే చెల్లించాలి. కేంద్రం మంజూరు చేసిన రూ.18,600కోట్ల ఉపాధి నిధులను సొంత పథకాలకు ప్రభుత్వం మళ్లించింది. పనులు చేయించిన సర్పంచులు బిల్లులు చెల్లించకపోవడంతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కోపం ఉంటే మాపై తీర్చుకోండి. కేసులు పెట్టుకోండి. కానీ బిల్లులు మాత్రం చెల్లించండి’’ అని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నుంచి ఈ అంశాలపై స్పష్టమైన సమాధానం రాకపోవడంతో బుద్దా నాగజగదీశ్వరరావు, బుద్దా వెంకన్న, రాజేంద్రప్రసాద్, గౌనివాని శ్రీనివాసులు చైర్మన్ పోడియం పైకి ఎక్కి నిరసన తెలిపారు. ఈ సమయంలో సభ వాయిదాపడింది. మళ్లీ ప్రారంభమైన తర్వాత ఇదే అంశంపై యనమల మాట్లాడారు. ‘‘సీఎం జగన్, మంత్రి పెద్దిరెడ్డి నియోజకవర్గాల్లోనే పెండింగ్ బిల్లులు చెల్లించారు.
మిగతావాటిలో ఎందుకు చెల్లించలేదు? పులివెందుల, పుంగనూరువాసులు ఏం పుణ్యం చేశారు.. మిగతా నియోజకవర్గాల్లో వారు ఏం పాపం చేశారు?’’ అని ధ్వజమెత్తారు. కాగా, ఉపాధి పనుల్లో నాణ్యతను తగ్గిస్తూ గత ప్రభుత్వం జీవో ఇచ్చిందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు. ‘‘గత ప్రభుత్వంలో జరిగిన పనుల్లో అవినీతి జరిగిందని, నాణ్యతాలోపం ఉందని అనేక ఫిర్యాదులు వచ్చాయి. వీటిపై విజిలెన్స్ విచారణ జరుగుతోంది. బిల్లులు ఎప్పుడు చెల్లించేది టైం చెప్పడం సాధ్యంకాదు. విచారణ పూర్తయిన తర్వాత తప్పులు జరగని వాటికి బిల్లులు చెల్లిస్తాం. పనుల్లో నాణ్యత లేకపోతే సంబంధిత ఇంజనీర్లపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాం’’ అని పెద్దిరెడ్డి వివరించారు.