ఆదిలోనే తొక్కేయాలని చూశారు!

ABN , First Publish Date - 2020-09-06T07:16:29+05:30 IST

‘ప్రజా సమస్యలపై పోరాటం కోసం స్థాపించిన పార్టీని ఆదిలోనే తొక్కేయాలని రెండు బలమైన

ఆదిలోనే తొక్కేయాలని చూశారు!

బీ టీమ్‌ అంటూ విషప్రచారం చేశారు

రెండు పార్టీల కుతంత్రాలు విఫలమయ్యాయి

విజయదశమి నుంచి బీజేపీతో కలిసి ప్రజల్లోకి వెళతాం: నాదెండ్ల


అమరావతి, సెప్టెంబరు 5(ఆంధ్రజ్యోతి): ‘ప్రజా సమస్యలపై పోరాటం కోసం స్థాపించిన పార్టీని ఆదిలోనే తొక్కేయాలని రెండు బలమైన పార్టీలు ప్రయత్నించాయి. ఒక పార్టీకి బీ టీమ్‌ అంటూ ఎన్నికల సమయంలో విష ప్రచారం చేశాయి. కొంతమందిని పార్టీలోకి పంపించి, ఎన్నికల తర్వాత బయటకు వెళ్లిన అటువంటి వారితో పార్టీపై బురద జల్లే ప్రయత్నం చేశాయి. నిస్వార్థం, నిబద్ధతతో పనిచేసిన జన సైనికుల వల్ల ఆ కుతంత్రం విఫలమైంది’ అని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ వ్యాఖ్యానించారు.


‘జనసేన పార్టీ బలోపేతం-దేశాభివృద్ధిలో సాంకేతిక పరిజ్ఞానం’ అనే అంశంపై బెంగళూరు ఐటీ టీం సభ్యులు నాదెండ్ల మనోహర్‌తో వెబినార్‌ ద్వారా చర్చించారు. ఈ సందర్భంగా మనోహర్‌ మాట్లాడుతూ రాజకీయాల్లో మార్పు రావాలంటే కొత్త రక్తం రావాలని, యువత రాజకీయాలను కూడా కెరీర్‌గా ఎంచుకోవాలని అన్నారు. విజయదశమి నుంచి బీజేపీతో కలిసి ఉమ్మడిగా కార్యక్రమాలు రూపొందించి.. క్షేత్రస్థాయిలో ముందుకు వెళ్తామని చెప్పారు. పార్టీ నేత మనుక్రాంత్‌రెడ్డి నేతృత్వంలో సాగిన వెబినార్‌ వివరాలను శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.


Updated Date - 2020-09-06T07:16:29+05:30 IST