సచివాలయ పరీక్షా ఫలితాలు విడుదల

ABN , First Publish Date - 2020-10-28T08:36:58+05:30 IST

రాష్ట్రంలోని గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న పోస్టులకు నిర్వహించిన పరీక్షల ఫలితాలను సీఎం జగన్‌ మంగళవారం తన క్యాంపు

సచివాలయ పరీక్షా ఫలితాలు విడుదల

13 శాఖల్లో 16,208 పోస్టుల భర్తీ

త్వరలో నియామకాలు: సీఎం వెల్లడి


అమరావతి, అక్టోబరు 27(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న పోస్టులకు నిర్వహించిన పరీక్షల ఫలితాలను సీఎం జగన్‌ మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో విడుదల చేశారు. త్వరలోనే నియామకాలు చేపడతామన్నారు. మొత్తం 13 శాఖల్లో మిగిలిపోయిన 16,208 పోస్టుల భర్తీకోసం గత నెల 20 నుంచి 26వ తేదీ వరకు ఈ పరీక్షలు నిర్వహించారు. 19 రకాల పోస్టుల కోసం 14 రకాల పరీక్షలు జరిపారు. ఈ పరీక్షలకు 7,68,965 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ప్రతి కేటగిరీలోనూ ముగ్గురు టాపర్లను ఎంపిక చేశారు. కాగా, అభ్యర్థుల మెరిట్‌ జాబితాలను గ్రామ సచివాలయ వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. ఓపెన్‌, బీసీ కేటగిరీల్లో అభ్యర్థులు అత్యధికంగా 111 మార్కులు సాధించారు. ఎస్సీ కేటగిరీలో 99.75, ఎస్టీ కేటగిరిలో అత్యధికంగా 82.75 మార్కులు సాధించారు. మహిళా అభ్యర్థుల్లో గరిష్ఠంగా 98, పురుష అభ్యర్థుల్లో గరిష్ఠంగా 111 మార్కులు పొందారు. ఇన్‌ సర్వీస్‌ అభ్యర్థులకు వారి సర్వీసును బట్టి గరిష్ఠంగా 15 మార్కులు కలిపారు. మెరిట్‌లిస్టు ప్రకారం అర్హులైన అభ్యర్థులను ‘రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌’, ‘రోస్టర్‌’ ప్రకారం ఎంపిక చేసి ప్రొవిజినల్‌ సెలక్షన్‌ లెటర్‌ పంపుతారు. అభ్యర్థులను కలెక్టర్ల ఆధ్వర్యంలో జిల్లా సెలక్షన్‌ కమిటీలు నిర్ణయిస్తాయి. ఎంపికైన అభ్యర్థులు తమ ఒరిజినల్‌ సర్టిఫికెట్లను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాలి. వెరిఫికేషన్‌ అనంతరం నియామక ఉత్తర్వులు అందజేస్తారు.

 

సిబ్బందికి డిజిటల్‌ శిక్షణ

కొత్తగా ఏర్పడ్డ గ్రామ, వార్డు సచివాలయాల శాఖలో సిబ్బందికి డిజిటల్‌ సేవలపై మరింత అవగాహన పెంచేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించినటు సచివాలయాల శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్‌ ఒక ప్రకటనలో తెలిపారు. నవంబరు 3 నుంచి 12 వరకు గుంటూరు జిల్లాలోని కేఎల్‌ యూనివర్సిటీలో శిక్షణ తరగతులు జరుగుతాయని పేర్కొన్నారు. 3, 4తేదీల్లో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పు, పశ్చిమగోదావరి.. 5, 6ల్లో కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు... 9, 10ల్లో అనంతపురం, చిత్తూరు, కర్నూలు.. 11, 12ల్లో కడప జిల్లా సిబ్బందికి తరగతులు నిర్వహిస్తామన్నారు. సచివాలయాల్లో సాంకేతిక సమస్యలపై అవగాహన కల్పిస్తారని తెలిపారు.

Updated Date - 2020-10-28T08:36:58+05:30 IST