నేటి నుంచి సచివాలయ పరీక్షలు

ABN , First Publish Date - 2020-09-20T09:09:16+05:30 IST

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 16,208 గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు రాత పరీక్షలు ఆదివారం నుంచి ప్రారంభం కానున్నాయి. అందుకోసం ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తిచేసింది. రాష్ట్రవ్యాప్తంగా

నేటి నుంచి సచివాలయ పరీక్షలు

  • 14062 గ్రామ, 2146 వార్డు కార్యదర్శుల భర్తీ

అమరావతి, సెప్టెంబరు 19(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 16,208 గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు రాత పరీక్షలు ఆదివారం నుంచి ప్రారంభం కానున్నాయి. అందుకోసం ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తిచేసింది. రాష్ట్రవ్యాప్తంగా 11,162 గ్రామ సచివాలయాలు, 3786 వార్డు సచివాలయాలకుగాను గత ఏడాది 1,26,728 ఉద్యోగాలకు రాత పరీక్షలు  నిర్వహించి 1,10,520 పోస్టులు భర్తీ చేశారు. ఇంకా 16,208 పోస్టులు మిగిలిపోయాయి. గ్రామ సచివాలయ పోస్టులు 14062 కాగా, వార్డు సచివాలయ పోస్టులు 2146 ఉన్నాయి. మొత్తం 10.56 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. 14 రకాల ఈ పోస్టుల కోసం ఈ నెల 20 నుంచి 26వ తేదీ వరకూ రెండు పూటలా పరీక్షలు నిర్వహిస్తారు.


తొలిరోజు ఆదివారం ఉదయం, మధ్యాహ్నం కలిపి మొత్తం 6.81 లక్షల మంది పరీక్షలకు హాజరుకానున్నారు. ఉదయం రాసే వారి కోసం 2221 కేంద్రాలు, మధ్యాహ్నం పరీక్ష రాసే వారి కోసం 1068 కేంద్రాలను అధికారులు సిద్ధం చేశారు. పరీక్షల నిర్వహణ కోసం 77,558 మంది సిబ్బందిని వినియోగిస్తున్నారు. ఓఎంఆర్‌ షీట్లు, ప్రశ్నాపత్రాలు ఉంచడానికి 13 జిల్లాల కేంద్రాల్లో స్ట్రాంగ్‌రూములు ఏర్పాటుచేశారు. నిరంతర సీసీ కెమెరా నిఘా, సాయుధులైన భద్రతా సిబ్బంది పర్యవేక్షణలో స్ట్రాంగ్‌రూములు నిర్వహిస్తున్నారు. ప్రశ్నాపత్రాలను పరీక్షా కేంద్రాలకు తరలించడానికి రాష్ట్రవ్యాప్తంగా 806 రూట్లను ఏర్పాటుచేసి ప్రతిరూట్‌కు ఒక గెజిటెడ్‌ అధికారిని నియమించారు. పరీక్షల నిర్వహణ అనంతరం పర్యవేక్షణ కోసం అన్ని జిల్లాలతోపాటు రాష్ట్రస్థాయిలోనూ కమాండ్‌ కంట్రోల్‌రూమ్‌ ఏర్పాటుచేశారు. కొవిడ్‌ నేపథ్యంలో పరీక్షా కేంద్రాల వద్ద వైద్యఆరోగ్యశాఖతో ప్రాథమిక చికిత్స సదుపాయాలకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి అభ్యర్థి మాస్క్‌ ధరించడం తప్పనిసరి. కొవిడ్‌ పాజిటివ్‌ ఉన్న వారికి ప్రత్యేక ఐసోలేషన్‌ గదులను, పీపీఈ కిట్‌లతో ఇన్విజిలేటర్లను, సదరు గదిలో వీడియో రికార్డింగ్‌ ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. అభ్యర్థులను ఒక్క నిమిషం ఆలస్యమైనా అభ్యర్థులను లోపలకు అనుమతించబోమని ప్రకటించారు. పరీక్షా కేంద్రాల ప్రవేశద్వారం వద్ద థర్మల్‌ స్కానర్‌ తప్పనిసరి చేశారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద తగినంత మంది వైద్య సిబ్బంది, సాధారణ మందులు, పల్స్‌ ఆక్సీమీటర్లతో కూడిన ప్రథమ చికిత్స వస్తుసామగ్రి అందుబాటులో ఉంచుతున్నారు. 

Updated Date - 2020-09-20T09:09:16+05:30 IST