నేడు ఎస్‌ఈసీ అఖిలపక్ష భేటీ
ABN , First Publish Date - 2020-10-28T08:15:16+05:30 IST
స్థానిక ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) బుధవారం రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం కానుంది.

గత ‘స్థానిక’ నోటిఫికేషన్ రద్దుపై చర్చ?
సమావేశానికి వైసీపీ దూరం!
అమరావతి, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): స్థానిక ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) బుధవారం రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం కానుంది. ఉదయం 10 గంటలకు విజయవాడలోని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో ఈ భేటీ జరుగుతుంది. కరోనా కారణంగా స్థానిక ఎన్నికలను గత మార్చిలో కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మన రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించేందుకు అభ్యంతరమేమిటని, దీనిపై నవంబరు 2లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని రాష్ట్ర హైకోర్టు కమిషనర్‌ను ఆదేశించింది. ఈ పరిస్థితుల్లో పార్టీల అభిప్రాయాలు తెలుసుకునేందుకు అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం కావాలని కమిషనర్ నిర్ణయించారు. ఆ మేరకు పార్టీలకు ఆహ్వానాలు పంపారు. అయితే అధికార పార్టీ వైసీపీ ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా లేనందున ఈ భేటీకి హాజరు కావడం లేదని సమాచారం. వైసీపీయేత పార్టీలన్నీ ఇప్పటికే నిర్వహించిన ఎన్నికల ప్రక్రియను రద్దు చేసి కొత్తగా నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. అఖిల పక్ష భేటీలోనూ ఇదే చెప్పనున్నాయి.
భేటీకి మేం వెళ్లం: వైసీపీ
అఖిలపక్ష భేటీకి తాము వెళ్లడం లేదని వైసీపీ అధికారికంగా ప్రకటించింది. మంగళవారమిక్కడ పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రధాన కార్యదర్శి అంబటి రాంబాబు ఈ విషయాన్ని వెల్లడించారు. ఒకసారి ఎన్నికల ప్రక్రియ ఆగిపోయాక.. దానిని తిరిగి ప్రారంభించాలంటే రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయాలను తీసుకుని ఆ ప్రకారం వెళ్లాలని సుప్రీంకోర్టు చెప్పిందన్నారు. ఆరోగ్య కార్యదర్శి ఇచ్చే అభిప్రాయాలతో నిమిత్తం లేకుండా రాజకీయ పార్టీలను పిలవడంలోనే కమిషనర్‌కు వేరే దురుద్దేశాలు ఉన్నాయని స్పష్టమవుతోందన్నారు. ఈ నేపథ్యంలో ఈ సమావేశానికి వెళ్లడం సరికాదని వైసీపీ భావిస్తోందని చెప్పారు. ఒక రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించే పరిస్థితులు ఉన్నాయో లేదో రాష్ట్ర చీఫ్ సెక్రటరీతో, ప్రభుత్వ అభిప్రాయాలు తెలుసుకోకుండా.. సుప్రీంకోర్టు తీర్పునూ పట్టించుకోకుండా పార్టీలను పిలవడం కచ్చితంగా నిమ్మగడ్డ-చంద్రబాబు రాజకీయంలో భాగమేనని ఆరోపించారు. రాష్ట్రంలో ఉనికే లేని, పోటీయే చేయని పార్టీలను పిలిచారంటే.. దీని మర్మమేంటో 24 గంటల్లోనే తెలుస్తుందన్నారు.