రోజు విడిచి రోజు బడి

ABN , First Publish Date - 2020-10-21T08:14:30+05:30 IST

లాక్‌డౌన్‌ అనంతరం రాష్ట్రంలో పాఠశాలలు తెరుచుకోనున్నాయి. ప్రస్తుత విద్యాసంవత్సరానికి సంబంధించి నవంబరు 2వ తేదీ నుంచి స్కూళ్లు ప్రారంభించనున్నారు.

రోజు విడిచి రోజు బడి

నవంబరు 2 నుంచి స్కూళ్లు

ఉదయం 9 నుంచి 1.30 వరకే

1, 3, 5, 7 తరగతులకు ఒక రోజు

2, 4, 6, 8 క్లాసులకు మరో రోజు

కార్యాచరణకు సీఎం జగన్‌ ఆదేశం

తల్లిదండ్రులు నిరాకరిస్తే ఆన్‌లైనే


అమరావతి, అక్టోబరు 20(ఆంధ్రజ్యోతి): లాక్‌డౌన్‌ అనంతరం రాష్ట్రంలో పాఠశాలలు తెరుచుకోనున్నాయి. ప్రస్తుత విద్యాసంవత్సరానికి సంబంధించి నవంబరు 2వ తేదీ నుంచి స్కూళ్లు ప్రారంభించనున్నారు. అయితే, కరోనా నేపథ్యంలో రోజు విడిచి రోజు తరగతులు నిర్వహించాలని, అవి కూడా ఒంటి పూటకే పరిమితం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు స్పందన కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో మంగళవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాఠశాలల అంశంపై సీఎం జగన్‌ చర్చించారు. నవంబరు 2 నుంచి పాఠశాలలు ప్రారంభించాలని, అయితే, రోజు విడిచి రోజు తరగతులు నిర్వహించేలా కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు.


పాఠశాలలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు పనిచేయాలని స్పష్టం చేశారు. 1,3,5,7 తరగతుల విద్యార్థులకు ఒక రోజు, 2,4,6,8 తరగతుల విద్యార్థులకు మరో రోజు తరగతులు నిర్వహించాలన్నారు. తమ పిల్లలను పాఠశాలలకు పంపేందుకు తల్లిదండ్రులు నిరాకరిస్తే ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించాలని సూచించారు. అన్ని పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని, భోజనం పెట్టాక విద్యార్థులను ఇంటికి పంపేయాలని ఆదేశించారు.

Updated Date - 2020-10-21T08:14:30+05:30 IST