కాపులతో పథకాలాట!
ABN , First Publish Date - 2020-06-25T07:40:26+05:30 IST
గత ప్రభుత్వం కాపులకు ఏడాదికి వెయ్యి కోట్లే ఇచ్చింది.. ఈ ప్రభుత్వం అక్షరాలా రూ.4,770 కోట్లు ఇచ్చింది...

అందరికీ వర్తించేవీ ప్రత్యేకంగా ఇచ్చినట్లు గొప్పలు
ఏడాదిలో 4,770 కోట్లు ఇచ్చినట్టు ప్రచారం
కాపు కార్పొరేషన్‌కు రూ.2 వేల కోట్లకు లెక్క
ఒక్క భరోసా కిందే 1497 కోట్లు ఇచ్చినట్లు
అలాగే పెన్షన్లు, అమ్మ ఒడి, ఫీజు రీయింబర్స్, వాహనమిత్ర, స్థలాలూ అన్నీ కలగాపులగం
కాపులకు మాత్రమేఇచ్చేది రూ.388 కోట్లే
అమరావతి, జూన్ 24 (ఆంధ్రజ్యోతి): గత ప్రభుత్వం కాపులకు ఏడాదికి వెయ్యి కోట్లే ఇచ్చింది.. ఈ ప్రభుత్వం అక్షరాలా రూ.4,770 కోట్లు ఇచ్చింది... అంటే నమ్మలేకపోతున్నారా? ప్రభుత్వం చెప్పింది నమ్మి తీరాల్సిందే. ప్రతి రూపాయికీ వైసీపీ ప్రభుత్వం పక్కాగా లెక్కలు గట్టింది. అటు అంకెలు ఇటు, ఇటు అంకెలు అటు మార్చి ఇదే మా సంక్షేమం అంటోంది. దానినే ప్రజలు నమ్మాలని చెబుతోంది. గతంలో బడ్జెట్, ఖర్చులు అంటే అంకెల గారడీలు, మాయలు అనే మాటలే విన్నాం. కానీ వైసీపీ సర్కారు లెక్కలు చూస్తే అంతకంటే పెద్ద పదాలే కావాలి. పేపరుపై తప్ప వాస్తవంలో కనిపించని సంక్షేమ పద్దు ఇది. ప్రచార ఆర్భాటానికి మాత్రమే పనికొచ్చే కాకి లెక్కలు ఇవి. కాపు సంక్షేమం కేటాయింపులు, ఖర్చులు చూస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతోంది. అంకెల మాయ చేసినా ఎవరికీ అర్థంకాదనుకున్నారో ఏమో....దాన్ని అంతకంతకూ పెంచుకుంటూ పోతున్నారు.
మొన్నటికి మొన్న బడ్జెట్‌లో ముగిసిన ఏడాదికి రూ.2,014 కోట్లు ఖర్చు చేసినట్లు చూపించి.. ఇప్పుడు అమాంతం రూ.4770 కోట్లకు పెంచింది. రాష్ట్రంలో సగటు కాపు కుటుంబానికి ప్రభుత్వం ద్వారా వచ్చే ప్రతి లబ్ధినీ వైసీపీ ప్రభుత్వం తన ఖాతాలో వేసుకుంది. ఈ పథకాలన్నీ ఇప్పుడే కొత్తగా ఇస్తున్నట్టు రంగులు మార్చి చూపిస్తోంది. బహుశా కేంద్రం రాయితీ ఉందనేమో..ఒక్క రేషన్ బియ్యాన్ని మాత్రం తన ఖాతాలో వేసుకోలేదు. అది మినహా కాపులకు ఏ చిన్న సాయం జరిగినా అది తన చలవే అనేలా లెక్కలు గట్టింది. గత ప్రభుత్వం ‘అన్నదాతాసుఖీభవ’ పేరుతో రైతుల ఖాతాల్లో నగదు వేస్తే, ఈ ప్రభుత్వం దాన్ని ‘రైతు భరోసా’గా మార్చింది. ఇది కులాలతో సంబంధం లేకుండా రైతులకు ఇచ్చే పథకం. కానీ ఈ పథకంలో కాపు రైతు లబ్ధిదారులను ప్రభుత్వం వేరు చేసింది. దీన్ని కాపు సంక్షేమంగా చూపించి రూ.1,497 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు లెక్కగట్టింది. కాపు కార్పొరేషన్ లేకపోతే, కాపు కాకపోతే రైతు భరోసా రాదా అంటే, కచ్చితంగా వస్తుంది.
ఇళ్ల స్థలాలు కొందరికే కాదుగా!
నవరత్నాల్లో భాగంగా 25 లక్షల మందికి ఇళ్ల స్ధలాల పట్టాలు ఇవ్వడానికి ఉద్దేశించిన పథకం ఇది. అన్ని కులాల లబ్ధిదారులు ఉన్నట్టే ఈ పథకంలో కాపులు కూడా 2.56 లక్షల మంది ఉన్నారు. ఇక అన్ని పథకాల్లాగే ప్రభుత్వం దాని ఖర్చును కూడా కాపు సంక్షేమం ఖాతాలో పడేసింది. ఇంకేముంది, కాపులకు ఇచ్చే దాంట్లో మరో రూ.653 కోట్లు చేరాయి. ఈ పథకం కొత్తదే అయినా ప్రభుత్వం అందరికీ అమలుచేస్తోంది తప్ప కేవలం కాపులకే కాదు కదా! అలాగే, ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు ఏటా రూ.10 వేలు ఇస్తున్నారు. అన్ని కులాలతో పాటే ఇచ్చినా దీన్ని కూడా కాపు సంక్షేమంలో చేర్చారు. ఇక విద్యార్థుల హాస్టళ్లకు ఇచ్చే వసతి దీవెన నిధులు, చేనేత కార్మికులకు ఇచ్చే సాయం, లా నేస్తం కింద లాయర్లకు ఇచ్చే గౌరవ వేతనాలు, దర్జీలకు ఇచ్చే చేదోడు సాయం, డ్వాక్రా మహిళలకు ఇచ్చే ఆసరా సాయం అన్నీ కాపు సంక్షేమంలో కలిపేశారు.
నికరం ఇంతే...
కాపులకు ప్రత్యేకంగా ప్రభుత్వం ఇస్తోంది అక్షరాలా రూ.388 కోట్లు. దీనికి రకరకాల పథకాలు కలిపి కలగాపులగం చేసి రూ.4,770 కోట్లుగా చూపింది. గత ప్రభుత్వం ఏటా రూ.వెయ్యి కోట్లు కాపు కార్పొరేషన్‌కు కేటాయించింది. ఆ నిధులు కాపుల కోసం ప్రత్యేకంగా పెట్టిన పథకాల కోసమే. పెన్షన్లు, అన్నదాత సుఖీభవ, ఇతర సాధారణ పథకాలేవీ అందులో కలపలేదు. జగన్ ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరానికి సాధారణ పథకాలు పోగా, కాపు నేస్తం కింద రూ.350 కోట్లు, విదేశీవిద్య, స్వయంఉపాధి, విద్యోన్నతికి కలిపి రూ.38 కోట్లు మాత్రమే చివరికి కాపులకు ప్రత్యేకంగా కేటాయించినట్టు స్పష్టంగా కనిపిస్తోంది. రైతు భరోసా, ఇళ్ల స్థలాల్లోనూ ఇలాంటి లెక్కలే. ఇంతవరకూ ఇళ్ల పట్టాల పంపిణీ ప్రారంభమే కాలేదు. లబ్ధిదారుల ఎంపిక కూడా పూర్తి కాలేదు. రైతుల్లో ఏ కులం వారు ఎంతమంది అనే లెక్కలు ప్రభుత్వం వద్ద లేవు. అయినప్పటికీ కచ్చితంగా కాపు రైతులనే లెక్కగట్టి కేటాయింపులు చేయడం విశేషం. జూలైలో ఇస్తామని చెబుతోన్న రైతు పట్టాల విలువను ఇప్పుడే ఇచ్చేసినట్టుగా ప్రచారం చేసుకోవడం వైసీపీ ప్రభుత్వానికే చెల్లింది.
ఫీజు రీయింబర్స్ కొత్తదేనా?
పేద విద్యార్థుల ఉన్నత చదువుల కోసం పెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకానికి వైసీపీ ప్రభుత్వం ‘జగనన్న విద్యాదీవెన’ అని పేరు మార్చింది. ఇందులో లబ్ధి పొందే 1.23లక్షల మంది కాపు విద్యార్థులకు ఇచ్చే రూ.367 కోట్ల మొత్తాన్ని కాపు సంక్షేమం కింద చూపించింది. గతంలోనూ కాపు విద్యార్థులకు ఈబీసీ కింద రేషన్ కార్డులు ఉన్నవారందరికీ రీయింబర్స్‌మెంట్ వర్తించింది. అయినా కాపు సంక్షేమానికి కొత్తగా తామే ఇస్తున్నట్టుగా ప్రత్యేకంగా ఎందుకు చూపిస్తున్నారనేది ఇప్పుడు ఉత్పన్నమవుతున్న ప్రశ్న.
ఉపాధి హుళక్కే..
కులాలు, వర్గాలవారీగా ఏర్పాటుచేసే కార్పొరేషన్లు అంటే ఎవరైనా ఆశించేది స్వయం ఉపాధి రాయితీలు. గత ప్రభుత్వం ఆ పథకానికే ఎక్కువ ఖర్చు చేసింది. ఆ ఒక్క పథకానికి ఏటా రూ.400 కోట్లకు పైగా ఖర్చు చేసింది. కానీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదికాలంలో రాష్ట్రంలో ఒక్కరికీ స్వయం ఉపాధి యూనిట్ పెట్టుకోవడానికి రాయితీ ఇవ్వలేదు. కనీసం ఈ ఏడాది బడ్జెట్‌లో కూడా దానికోసం ప్రత్యేకంగా నిధులు పెట్టలేదు. అంటే ఇక స్వయంఉపాధి పథకం దాదాపుగా లేనట్టే అని అర్థమవుతోంది.
పెన్షన్ ఇప్పుడే ఇస్తున్నారా?
వృద్ధాప్య, వితంతు, దివ్యాంగుల పెన్షన్ ఈ నాటిది కాదు. దశాబ్దాలుగా అమలవుతున్న పథకం అది. టీడీపీ ప్రభుత్వం వృద్ధాప్య పెన్షన్ రూ.2వేలు ఇస్తే, వైసీపీ దానికి రూ.250 కలిపి రూ.2,250 ఇస్తోంది. అయితే కాపులకు ఇస్తున్న పెన్షన్ల లెక్కలు తీసి కాపు లకు ప్రత్యేక కార్పొరేషన్ పెట్టి అమలుచేస్తున్న గొప్ప సంక్షేమంగా కొత్త రంగు పూసింది.
అమ్మఒడి కాపులకేనా?
నవరత్నాల్లో భాగంగా విద్యార్థుల తల్లులకు ఏటా రూ.15 వేలు ఇస్తున్నారు. ఇది కులాలతో సంబంధం లేకుండా ప్రవేశపెట్టిన పథకం. చివరికి ప్రైవేటు పాఠశాలల్లో చదివే వారికీ అమలుచేస్తున్న పథకం. ఈ పథకంలో లబ్ధిపొందిన కాపులను వేరుచేసి, కాపులకు ప్రత్యేకంగా రూ.571 కోట్లు ఇచ్చామని ప్రభుత్వం చెబుతోంది. కాపు కార్పొరేషన్ లేకపోతే కాపులకు అమ్మఒడి నగదు ఇవ్వరా? కార్పొరేషన్లు లేని కులాలకు ఈ పథకం అమలుకాలేదా? అందరికీ అమలైంది. కానీ ఇదేదో కాపులకు మాత్రమే ఇస్తున్నట్టు అటు అంకెలు తెచ్చి ఇటు కలిపింది.