ఆంగ్ల మాధ్యమమే!

ABN , First Publish Date - 2020-05-14T09:09:57+05:30 IST

విద్యా హక్కు చట్టానికి విరుద్ధమైనప్పటికీ, ఏ మీడియంలో చదువుకోవాలో నిర్ణయించుకునే హక్కు విద్యార్థికి ఉండాలని హైకోర్టు చెప్పినప్పటికీ...

ఆంగ్ల మాధ్యమమే!

  • 1 నుంచి 6 వరకు అమలు చేయాలి
  • దశలవారీగా పదోతరగతి దాకా వర్తింపు
  • ఎస్‌సీఈఆర్‌టీ సిఫారసులకు సర్కారు ఆమోదం
  • విద్యార్థులు, తల్లులు కోరుతున్నారంటూ సమర్థన
  • విద్యాహక్కు చట్టాన్ని పరిగణించని ఎస్‌సీఈఆర్‌టీ

అమరావతి, మే 13 (ఆంధ్రజ్యోతి): విద్యా హక్కు చట్టానికి విరుద్ధమైనప్పటికీ, ఏ మీడియంలో చదువుకోవాలో నిర్ణయించుకునే హక్కు విద్యార్థికి ఉండాలని హైకోర్టు చెప్పినప్పటికీ... ఆంగ్ల మాధ్యమంపై ప్రభుత్వం అడుగు ముందుకే వేసింది.  ఒకటి నుంచి ఆరో తరగతి వరకు ఆంగ్ల మాధ్యమంలోనే బోధన ఉండాలని.. దశలవారీగా పదో తరగతి వరకు ప్రవేశపెట్టాలని రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్‌సీఈఆర్‌టీ) చేసిన సిఫారసులు, పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ చేసిన ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది.


ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బి.రాజశేఖర్‌ బుధవారం ఉత్తర్వులు (జీ.వో.నం. 24) జారీచేశారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఆంగ్ల మాధ్యమాన్నే కోరుకుంటున్నందున ప్రభుత్వం 2020-21 నుంచి  1-6 తరగతుల్లో ప్రవేశపెట్టవచ్చని ఎస్‌సీఈఆర్‌టీ  సిఫారసు చేసింది. విద్యా హక్కు చట్టం ప్రకారం, ఒకటి నుంచి 8వ తరగతి వరకు మాతృభాషలో విద్యాబోధన జరగాలని పేర్కొన్నప్పటికీ, ఆ విషయాన్ని పక్కనపెట్టి భారత రాజ్యాంగ విలువలను తన సిఫారసుల్లో ప్రస్తావించింది. రాజ్యాంగం సూచించిన విలువలు ఆంగ్లమాధ్యమంతో విద్యార్థుల్లో పెరుగుతాయని పేర్కొంది. మాతృభాషలో పిల్లలు ప్రావీణ్యత సాధించడానికి ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూనే, ఇతర సబ్జెక్టుల్లో సమగ్ర నైపుణ్యానికి ఒకటో తరగతి నుంచే ఆంగ్ల మాధ్యమంలో బోధన ఉండాలని తన సిఫారసుల్లో పేర్కొంది. ఆంగ్ల మాధ్యమం ద్వారా అనుకున్న లక్ష్యాలు నెరవేరతాయని అభిప్రాయపడింది.


విద్యార్థుల్లో శారీరక, మానసిక సామర్థ్యాలు పెరుగుతాయని కూడా సిఫారసు చేసింది. విద్యార్థి కేంద్రంగా బోధన జరగాలని, అభ్యసనం అనేది వివిధ ప్రక్రియలను చేపట్టడం ద్వారా కొనసాగించాలని తెలిపింది. విద్యార్థుల్లో ఒత్తిడి, భయం, ఆందోళన లేకుండా తన భావాలను స్వేచ్ఛగా, తడబాటుకు తావులేకుండా  చెప్పగలగాలని అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో 1 నుంచి 10 వ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమాన్ని దశల వారీగా ప్రవేశపెట్టవచ్చునని ఎస్‌సీఈఆర్‌టీ సిఫారసు చేసింది. ఎస్‌సీఈఆర్‌టీ ఇందుకు సంబంధించి 1-6 తరగతులకు ఆంగ్ల మాధ్యమం పుస్తకాలకు సంబంధించిన ప్రక్రియలను పూర్తి చేయించి పాఠ్యపుస్తకాలను అభివృద్ధి చేయించినట్లు పేర్కొంది. 


అవి యథాతథంగానే..: ఉర్దూ, తమిళం, కన్నడం, ఒరియా మాధ్యమం స్కూళ్లు యథాతథంగా కొనసాగుతాయని, ఆ స్కూళ్లలో విద్యార్థుల ఆప్షన్లకు అనుగుణంగా ఆంగ్ల మాధ్యమం తరగతులు సమాంతరంగా కొనసాగించవచ్చని ఎస్‌సీఈఆర్‌టీ తెలిపింది. తల్లిదండ్రుల్లో ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహిస్తూ విద్యార్థుల పురోగతిపై వారికి వివరిస్తూ, చర్చిస్తూ ఉండాలని పేర్కొంది. రాష్ట్రంలోని 672 మండల కేంద్రాల్లో తెలుగు మీడియం స్కూళ్లు ఏర్పాటు చేస్తున్నట్లు, అందులో చేరే సమీప ప్రాంతాల విద్యార్థులకు రూ.ఆరు వేల చొప్పున రవాణా సౌకర్యానికి వ్యయం చేస్తామని తెలిపింది. ఇందుకోసం 2020-21 విద్యా సంవత్సరానికి రూ.32 కోట్ల బడ్జెట్‌ కేటాయిస్తున్నట్లు ఎస్‌సీఈఆర్‌టీ తెలిపింది. 

Updated Date - 2020-05-14T09:09:57+05:30 IST