జేసీ ప్రభాకర్‌రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ కేసు

ABN , First Publish Date - 2020-12-26T08:22:04+05:30 IST

అనంతపురం జిల్లా తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తన అనుచరులతో కలిసి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇంట్లో వీరంగం చేయడం.

జేసీ ప్రభాకర్‌రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ కేసు

  • ఆయన కుమారుడు, అనుచరులపైనా...
  • పెద్దారెడ్డిపై ఎఫ్‌ఐఆర్‌కు పోలీసులు నో


అనంతపురం, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి): అనంతపురం జిల్లా తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తన అనుచరులతో కలిసి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇంట్లో వీరంగం చేయడం.. ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో.. పోలీసులు ప్రభాకర్‌రెడ్డి, ఆయన తనయుడు జేసీ అస్మిత్‌రెడ్డి, మరికొందరిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారు. దళితుడినైన తనను కులం పేరుతో దూషించారని ఎమ్మెల్యే వర్గీయుడు మనోజ్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. తాడిపత్రి పోలీసులు శుక్రవారం వారిద్దరితోపాటు సోమశేఖర్‌నాయుడు, రఘునాథరెడ్డి, జగన్నాథ్‌రెడ్డి, లోకనాథ్‌రెడ్డి, వేలూరు రంగయ్య, తిరుపాలురెడ్డి, ఖదీర్‌, త్రినాథ్‌రెడ్డి, మరికొందరిపైన 147, 148, 506, 307ఆర్‌/డబ్ల్యూ 149 ఐపీసీ, సెక్షన్‌ 3(1)(ఆర్‌)(ఎస్‌) ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారు.


ఎమ్మెల్యే కుటుంబసభ్యులు బండి ఇసుకకు రూ.10వేలు వసూలు చేస్తున్నారని సోషల్‌ మీడియాలో ఆడియో రికార్డును వైరల్‌ చేసిన జేసీ మద్దతుదారులు వలీ, కులశేఖర్‌రెడ్డి, సోమశేఖర్‌నాయుడులపై సుమోటోగా కేసులుపెట్టారు. అయితే జేసీ ఇంట్లో జరిగిన ఘర్షణకు  సంబంధించి కేతిరెడ్డి, ఆయన అనుచరులపై ఎలాంటి కేసులూ నమోదు చేయలేదు. ప్రభాకర్‌రెడ్డి ఫిర్యాదు చేస్తే తప్ప.. కేసులు పెట్టబోమని పోలీసులు అంటున్నట్లు తెలుస్తోంది. ప్రభాకర్‌రెడ్డి మాత్రం ఫిర్యాదు ఇచ్చే ప్రసక్తే లేదని.. సీసీ టీవీ ఫుటేజీల ఆధారంగా వారే సుమోటోగా కేసు నమోదు చేయాలని పట్టుబడుతున్నారు.

Updated Date - 2020-12-26T08:22:04+05:30 IST