తిరుగుబోతూ, తిండిబోతునూ కాదు

ABN , First Publish Date - 2020-06-11T09:34:19+05:30 IST

‘‘నేను తాగుబోతును కాదు. తిరుగుబోతునీ, తిండిబోతునీ కాదు. వ్యవసాయం కోసమే

తిరుగుబోతూ, తిండిబోతునూ కాదు

  • సాగు కోసమే అప్పులు చేశా..
  • సూసైడ్‌ నోట్‌ రాసి రైతు ఆత్మహత్య
  • పదేళ్లుగా 16 బోర్లు వేసి కష్టాలసాగు..
  • 27లక్షలదాకా అప్పులపాలు
  • వాటికింద పొలాలు పోతాయని చింత..
  • నోట్‌లో రుణదాతల పేర్లు
  • ప్రకాశం జిల్లా పెద్దారవీడులో ఘటన

పెద్దారవీడు, జూన్‌ 10: ‘‘నేను తాగుబోతును కాదు. తిరుగుబోతునీ, తిండిబోతునీ కాదు. వ్యవసాయం కోసమే అప్పులు చేశాను’’ అంటూ సూసైడ్‌ నోట్‌ రాసి ఓ రైతు ఆత్మహత్య చేసుకొన్నాడు. చనిపోయేముందు తాను అప్పులు ఎవరెవరికి చెల్లించారో వారందరి పేర్లు ఆ నోట్లో వివరంగా రాసిపెట్టారు. ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండ లం సిద్దినాయునిపల్లిలో బుధవారం చోటుచేసుకొన్న ఈ ఘటన వివరాలు.. సింగారెడ్డి సత్యనారాయణరెడ్డి (46) మిరప, పత్తి సాగు చేస్తున్నారు. ఆయనకు మొత్తం తొమ్మిదెకరాల సొంత భూమి ఉంది. 10 ఏళ్లుగా 16 బోర్లు వేసి సాగు చేస్తున్నారు. దీనికి అవసరమైన పెట్టుబడుల కోసం భారీగా అప్పులు తెచ్చారు. అప్పు, వడ్డీలతో కలిసి అవి రూ.27లక్షలకు చేరాయి.


ఇందులో బంగారం పెట్టి బ్యాంకు నుంచి తీసుకొన్నవి రూ.3 లక్షలు కాగా, మిగతావన్నీ ప్రైవేటు వ్యక్తుల నుంచి తెచ్చినవే. గతంలో ఒకసారి ఇలాగే అప్పులయితే, తనకున్న పొలంలో ఆరెకరాలు అమ్మారు. ఇప్పుడు మళ్లీ అదే పరిస్థితి ఎదురయింది. వివాదాలకు దూరంగా, గుట్టుగా బతికే తత్వం సత్యనారాయణరెడ్డిది. ఉన్న పొలాలు అమ్ముకొని ఊళ్లో తలెత్తుకొని బతకడం ఎలాగని మథనపడ్డారు. అదే సమయంలో పొలం అమ్మితేగానీ, తనను నమ్మి అప్పులు ఇచ్చినవారికి తిరిగి చెల్లించలేడు. ఇదే వ్యథతో మానసికంగా ఆయన కుంగిపోయారు. బుధవారం ఉదయం లేవగానే ఆత్మహత్యకు గల కారణాలను ఒక కాగితంపై రాశారు. అందులోనే అప్పులిచ్చిన వారి పేర్లను ప్రస్తావించారు. అనంతరం ఇంట్లోని ఫ్యాన్‌కు ఉరేసుకొన్నారు. సత్యనారాయణరెడ్డికి భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. 

Updated Date - 2020-06-11T09:34:19+05:30 IST