శానిటైజర్‌, మద్యం ఒక్కటి కాదు!

ABN , First Publish Date - 2020-08-01T09:45:44+05:30 IST

చేతులు శుభ్రం చేసుకునే హ్యాండ్‌ శానిటైజర్‌, వోడ్కా చూడటానికి ఒకేలా ఉంటాయి. ఎలాంటి రంగూ ఉండదు.

శానిటైజర్‌, మద్యం ఒక్కటి కాదు!

చూడటానికి వోడ్కాలా ఉన్నా హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌తో చాలా ప్రమాదం

శానిటైజర్‌ తాగితే ప్రాణాలకు ముప్పు


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

చేతులు శుభ్రం చేసుకునే హ్యాండ్‌ శానిటైజర్‌, వోడ్కా చూడటానికి ఒకేలా ఉంటాయి. ఎలాంటి రంగూ ఉండదు. పైగా నీరులానే కనిపిస్తాయి. రెండిటిలోనూ ఇథైల్‌ ఆల్కాహాల్‌ ఉంటుంది. అయితే, రెండిటిలోనూ ఆల్కాహాల్‌ ఉందని శానిటైజర్‌ తాగితే మాత్రం ప్రాణాలకు ముప్పు ఖాయమని అంటున్నారు వైద్య నిపుణులు. శానిటైజర్‌లో కలిపే హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌ ఒక రకంగా పాయిజన్‌. శానిటైజర్‌లో తక్కువ శాతమే ఉన్నప్పటికీ.. అది ప్రాణాలు పోయేందుకు దారి తీస్తుంది. శుక్రవారం ప్రకాశం జిల్లాలో శానిటైజర్‌ తాగి కొంతమంది చనిపోవడంతో వీటిని వినియోగిస్తున్న వారంతా ఉలిక్కిపడ్డారు. కరోనా నేపథ్యంలో శానిటైజర్ల వినియోగం భారీగా పెరిగింది. శానిటైజర్లలో ఎక్కువ ఆల్కాహాల్‌ శాతం ఉండటంతో కొందరు మందుబాబులు దీనిని తాగే ప్రయత్నం చేస్తున్నారు. మద్యం వినియోగానికి ఉపయోగించే ఎక్స్‌ట్రా న్యూట్రియల్‌ ఆల్కాహాల్‌(ఈఎన్‌ఏ) లేదా ఇథైల్‌ ఆల్కాహాల్‌నే శానిటైజర్లలోనూ వాడతారు. ఏ శానిటైజర్‌లో అయినా కనీసం 60ుకి తగ్గకుండా ఇఽథైల్‌ ఆల్కాహాల్‌ ఉంటుంది.


మన రాష్ట్రంలో తయారుచేసే శానిటైజర్‌లలో దాదాపు 80% ఇథైల్‌ ఆల్కాహాల్‌ ఉంటోంది. ఏడు నుంచి ఎనిమిది శాతం హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌ ఉంటుంది. 4 నుంచి 5 శాతం గ్లిజరిన్‌ కలుపుతారు. ఆల్కాహాల్‌, హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌లు బాక్టీరియా, ఫంగ్‌సలను చంపేందుకు ఉపయోగపడితే, గ్లిజరిన్‌ చేతికి అంటుకోకుండా వెంటనే ఆరిపోవడానికి ఉపయోగపడుతుంది. శానిటైజర్‌ను శరీరానికి వెలుపలి భాగంలో తప్ప లోపలికి తీసుకోకూడదు.


కళ్లలోకి, నోట్లోకి వెళ్లకుండా చూడాలి. శానిటైజర్‌ మనిషి శరీరంలోకి వెళ్తే ఇథైల్‌ ఆల్కాహాల్‌ వల్ల పెద్దగా ప్రమాదం లేకపోయినా హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌ తీవ్ర ప్రమాదకరంగా మారుతుంది. అయితే, చాలా మంది ఈ తేడా తెలియకపోవడంతో 80ు ఆల్కాహాల్‌ ఉందన్న భావనతో శానిటైజర్‌ తాగే ప్రయత్నాలు చేస్తున్నారు. దాని వాసన కూడా ఒకరకంగా వోడ్కాలా ఉండడం.. మందుబాబులను ఆకర్షిస్తోంది. కానీ, ఇది అత్యంత ప్రమాదకరమనే విషయాన్ని గుర్తించాలని వైద్యులు చెబుతున్నారు.

Updated Date - 2020-08-01T09:45:44+05:30 IST