సీఎం సాక్షిగా ఆన్‌లైన్‌లో ఇసుక దందా

ABN , First Publish Date - 2020-06-11T18:57:48+05:30 IST

ఏపీలో ఇసుక ఫ్రీగా దొరుకుతుంది... పారదర్శకంగా ఆన్ లైన్ ద్వారా ఇసుకను సరఫరా చేస్తున్నాం..

సీఎం సాక్షిగా ఆన్‌లైన్‌లో ఇసుక దందా

అమరావతి: ఏపీలో ఇసుక ఫ్రీగా దొరుకుతుంది... పారదర్శకంగా ఆన్ లైన్ ద్వారా ఇసుకను సరఫరా చేస్తున్నాం.. ఇవి ఏపీ మంత్రుల నోటి నుంచి వచ్చే మాటలు. కానీ వాస్తవ పరిస్థితి ఎలా ఉంది? క్వాలిటీ ఇసుక దొరుకుతుందా? ఆన్ లైన్‌లో గోల్‌మాల్ జరుగుతుందా? మీరే చూడండి.. కొన్ని రీచ్‌ల్లో నిముషాల్లోనే నో స్టాక్ బోర్డులు.. మరికొన్ని రీచ్‌ల్లో బుక్ చేస్తే జేబులు గుల్ల.. ఇసుక బదులు బుసక సరఫరా.. ఏపీలో ఇసుక అక్రమాలు సాగుతున్నాయి. ఆన్ లైన్‌లో ఇసుకను బుక్ చేసుకున్నవారు మోసపోతున్నారు. ముఖ్యంగా కృష్ణా జిల్లాలో మంచి ఇసుక పేరుతో బుసకను పంపిస్తూ దోపిడీ చేస్తున్నారు. ఈ గోల్ మాల్ వ్యవహారం ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఆపరేషన్‌లో బయటపడింది.


ఏపీలో ఇసుకే బంగారంగా మారిపోయింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆన్ లైన్ బుకింగ్ విధానానికి శ్రీకారం చుట్టింది. అదేమంటే.. టీడీపీ హయాంలో ఇసుకను దోచుకున్నారని ఆ అక్రమాలను అరికట్టేందుకు పారదర్శకతతో ఉండేందుకే కొత్త విధానమని అన్నారు. ఈ కొత్త విధానం కోసం మూడు నెలలు అసలు రాష్ట్రంలో ఇసుక దొరక్కా లక్షలాదిమంది కార్మికులు పనులు లేక పస్తులున్నారు. ఆ తర్వాత ఎట్టకేలకు కొత్తగా ఆన్ లైన్ ఇసుక విధానాన్ని అమలులోకి తెచ్చారు. తక్కువ ధరకే ఇసుక అందిస్తున్నామని మంత్రులు ఆర్భాటంగా ప్రకటనలు చేశారు. 


క్వారీ నుంచి ఇసుక టన్ను రూ. 375 లెక్కన నిర్ణయించారు. స్టాక్ పాయింట్ నుంచి  అవసరమైనవారికి చేర్చేందుకు రవాణా ఖర్చులు అదనం. వీటికి కి.మీ.కు దూరాన్నిబట్టి రూ. 10 నుంచి 15 ఇవ్వాలని ప్రకటించారు. అయితే అధికార బలం, ఆర్థిక బలం ఉన్నవారికే ఇసుక అందుబాటులో ఉంటుందని అర్థమైపోయింది. పేద, మధ్యతరగతి ప్రజలు పాట్లు పడక తప్పదని అర్థమైపోయింది. దీంతో చాలా మంది తమ ఇళ్ల నిర్మాణ పనులు వాయిదా వేసుకున్నారు. ఎన్నో సమీక్షలు, సవరణలు చేసిన తర్వాత దేశంలోనే సరికొత్త విధానంతో ఇసుకను సరఫరా చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

Updated Date - 2020-06-11T18:57:48+05:30 IST