ఏ ఎండకు ఆ గొడుగు
ABN , First Publish Date - 2020-03-02T08:38:39+05:30 IST
ముఖ్యమంత్రి జగన్ ఏ ఎండకు ఆ గొడుగు పట్టే వ్యక్తి అని, ఆయన చేతగాని సీఎం అని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న విమర్శించారు. ఆదివారం ఆయన హైదరాబాద్‌లో మీడియతోనూ, ట్విటర్‌లోనూ స్పందిస్తూ...

- రిలయన్స్‌పై నాడు విమర్శలు..
- నేడు ముఖేశ్‌కు సన్మానాలా?: బుద్దా
- విభజించి పాలించడం జగన్ నైజం: యనమల
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్) : ముఖ్యమంత్రి జగన్ ఏ ఎండకు ఆ గొడుగు పట్టే వ్యక్తి అని, ఆయన చేతగాని సీఎం అని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న విమర్శించారు. ఆదివారం ఆయన హైదరాబాద్‌లో మీడియతోనూ, ట్విటర్‌లోనూ స్పందిస్తూ జగన్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘తండ్రి మరణం వెనుక రిలయన్స్ హస్తం ఉందంటూ ఆ సంస్థ ఆస్తులపై ఆనాడు దాడులు చేయించి విధ్వంసం సృష్టించిన జగన్, ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ముఖేశ్ అంబానీకి జ్ణాపికలు ఇచ్చి సన్మానం చేశారు. ఈ జబ్బు ఏంటో? దానికి మందు ఏమిటో? అని ప్రపంచ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు.
కరోనా వైర స్‌కి మందు కనిపెట్టడం పక్కన పెట్టి జగన్‌కి వచ్చిన జబ్బుకి మందు కనిపెట్టే పనిలో ఉన్నారు. జగ్గడు యాంటీ సోషల్ పర్సనాలిటీ డిజాస్టర్ జబ్బుతో బాధ పడుతున్నారు. జైలు భయం వెంటాడుతోందేమో? దానికి ముందే అందరిపై కక్ష తీర్చుకోవడమే లక్ష్యంగా చెలరేగిపోతున్నాడు’ అని బుద్ధా మండిపడ్డారు. కేఈ కృష్ణమూర్తి కూడా జగన్ వైఖరిని ఎండగట్టారు. ‘ఓదార్పు అంతా హంబక్కు అని తేలిపోయింది. తండ్రిపై వలగబోసిన ప్రేమ సీఎం పీఠం కోసమే! తండ్రిని హత్య చేయించింది అంబానీనే అంటూ ఆనాడు రాళ్లు వేయించారు. ఈయన్ని నమ్మి రాళ్లేసిన బడుగు వర్గాల యువత ఇంకా కోర్టు చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఇప్పుడు ఆయన(అంబానీ)ను పిలిచి సన్మానం చేస్తున్నారు. తండ్రి పోతే పోయాడు అనుకున్నాడా? లేక ఇదేమైనా కొత్త జబ్బా? తండ్రిని చంపాడనే వ్యక్తికి సన్మానం చేస్తే.. చిన్నాన్నని లేపేసిన వాళ్లని పిలిచి బిర్యానీ పెట్టినా ఆశ్చర్యం లేదు!’ అని ట్వీట్ చేశారు.
రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా రాక్షస పాలన కొనసాగుతోందని మాజీ మంత్రులు యనమల రామకృష్ణ, చినరాజప్ప అన్నారు. ప్రజా చైతన్య యాత్రల్లో భాగంగా తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం చక్రద్వారబంధం గ్రామంలో ఆదివారం వారు పర్యటించారు. విశాఖలో వైసీపీ కబ్జా చేసిన 6 వేల ఎకరాల భూబాగోతం బయటపడుతుందనే ఉద్దేశంతో తమ నాయకుడు చంద్రబాబును విశాఖలో అడ్డుకున్నారన్నారు. మరో రెండు రోజుల్లో విశాఖలో ప్రజా చైతన్యయాత్రలు ప్రారంభిస్తామని రాజప్ప చెప్పారు. మంగళగిరిలోని పార్టీ ఆఫీసులో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మాట్లాడుతూ.. పాలన చేతగాక పది నెలలలోనే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేసిన ఘనత వైసీపీ ప్రభుత్వానికే దక్కిందని విమర్శించారు. ముఖేశ్ అంబానీతో జగన్ సమావేశం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోందని, ఆయనతో ఏం చర్చించారో జగన్ వెల్లడించాలని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య డిమాండ్ చేశారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టీడీపీ ఎమ్మెల్సీ నాగ జగదీశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రంలో ఎమర్జెన్సీ పాలన కొనసాగుతోందని, అమరావతిలోనే ఒకే రాజధాని ఉంచి, మిగతా జిల్లాల్లో అభివృద్ధి చేసేలా సీఎం జగన్‌ను దీవించాలని స్వామిని కోరుకున్నట్లు చెప్పారు.
రాష్ట్రంలో మూడు ముక్కలాట: సీపీఐ
సీఎం జగన్మోహన్‌రెడ్డి మూడు రాజధానుల పేరుతో రాష్ట్రంలో మూడు ముక్కలాట ఆడుతున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. నెల్లూరులోని సీపీఐ జిల్లా కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రతిపక్ష నేతగా జగన్ అమరావతి రాజధానికి తన సమ్మతి తెలిపి అధికారంలోకి రాగానే మాటమార్చారన్నారు. కేవలం చంద్రబాబునాయుడు మీద కక్షతోనే ఇలాంటి నిర్ణయం తీసుకోవటం వల్ల రాష్ట్రంలోని ఐదు కోట్లమంది ప్రజలు మనోవేదనకు గురవుతున్నారని చెప్పారు.
ప్రధాని వంటి వారే అమరావతి రాజధానికి శంకుస్థాపన చేస్తే ఆయన నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రభుత్వం వ్యవహరించటం ప్రధాని పదవినే అవమానించినట్లు ఉందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు జరగకూడదన్న ఆలోచనలతోనే ప్రభుత్వం 59శాతం రిజర్వేషన్లు ప్రకటించిందని విమర్శించారు. కేంద్రంలోని బీజేపీ మతోన్మాదంపై సీపీఐ ప్రజాపోరాటాలు కొనసాగిస్తుందన్నారు.