జనతాబజార్లలో ఆక్వా ఉత్పత్తుల విక్రయం: సీఎం
ABN , First Publish Date - 2020-04-25T09:46:43+05:30 IST
జనతా బజార్లలో పండ్లు, కూరగాయలతో పాటు ఆక్వా ఉత్పత్తులు విక్రయించేలా చూడాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేయదలిచిన జనతా బజార్ల విధివిధానాలపై శుక్రవారం

అమరావతి, ఏప్రిల్ 24(ఆంధ్రజ్యోతి): జనతా బజార్లలో పండ్లు, కూరగాయలతో పాటు ఆక్వా ఉత్పత్తులు విక్రయించేలా చూడాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేయదలిచిన జనతా బజార్ల విధివిధానాలపై శుక్రవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సంబంధిత అధికారులతో సీఎం సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎం జగన్మోహన్‌రెడ్డి ‘‘కరోనా నేపథ్యంలో వికేంద్రీకరించిన రైతు బజార్లు భవిష్యత్‌లోనూ కొనసాగించాలి. జనతా బజార్ల ద్వారా రైతులకు మార్కెటింగ్ అవకాశాలు లభించాలి. రైతుల నుంచి సేకరించిన పంట ఉత్పత్తులను వీటిలో విక్రయించేలా చూడాలి. ఇందులో కనీసం 25 రకాల ఉత్పత్తులు ఉండాలి. గ్రామ స్థాయిలోనే గ్రేడింగ్, ప్యాకింగ్ విధానం జరగాలి. ప్రతి గ్రామ, వార్డు సచివాలయం వద్ద ఇవి శాశ్వతంగా కొనసాగేలా చూడాలి. రైతులకు, వినియోగదారులకు అందుబాటు ధరలతో జనతా బజార్ల నిర్వహణ సాగాలి. రైతు సంఘాలు, స్వయం సహాయక సంఘాలను వీటిలో భాగస్వాములను చేయాలి. జనతా బజార్లను సమర్థవంతంగా నిర్వహించేలా మరింత మేధోమథనం చేసి, తగిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలి’’ అని అధికారులను ఆదేశించారు.