ఎరియర్స్‌తోనే సరి!

ABN , First Publish Date - 2020-07-08T08:00:37+05:30 IST

ద్రవ్య వినిమయ బిల్లును గవర్నర్‌ ఆమోదించి ఐదు రోజులు! ఇతరత్రా ఎలాంటి కారణమూ కనిపించడంలేదు. అయినప్పటికీ మంగళవారం రాత్రి 9 గంటల

ఎరియర్స్‌తోనే సరి!

  • అసలు వేతనాలకు ఎదురుచూపులే
  • ఐదు రోజులైనా ఉద్యోగులకు అందని జీతాలు

అమరావతి, జూలై 7(ఆంధ్రజ్యోతి): ద్రవ్య వినిమయ బిల్లును గవర్నర్‌ ఆమోదించి ఐదు రోజులు! ఇతరత్రా ఎలాంటి కారణమూ కనిపించడంలేదు. అయినప్పటికీ మంగళవారం రాత్రి 9 గంటల వరకూ ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు జమ కాలేదు. 6వ తేదీన మాత్రం కొన్ని ఎరియర్‌ వేతన బిల్లులు వారి ఖాతాల్లో జమయ్యాయి. జూలై 2న గవర్నర్‌ ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం తెలుపగానే.. ఆ రోజు అర్ధరాత్రే బడ్జెట్‌ అమల్లోకి వచ్చిందని ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ మరుసటి రోజే శుక్రవారం వేతనాలు పడతాయని ఉద్యోగులు ఆశించారు. కానీ వారికి నిరాశే మిగిలింది. తర్వాత రోజు శనివారం ఆర్‌బీఐ యథావిధిగా పనిచేస్తుంది. కాబట్టి వేతనాలు వస్తాయనుకున్నారు. అ రోజూ రాలేదు.


ఆదివారం వదిలేసి సోమవారం తప్పనిసరిగా జీతాలు జమవుతాయని ఎదురుచూశారు. అదేమీ జరగలేదు. పోనీ మంగళవారం వస్తాయిలే అని భావించారు. కానీ రాత్రి పొద్దుపోయేదాకా ఉద్యోగులకు జీతాలు జమ కాలేదు. డబ్బులు ఉన్నప్పటికీ వేతనాలు వేయడానికి ప్రభుత్వం ఎందుకు ఆలస్యం చేస్తోందో అర్థంగాక ఉద్యోగులు రకరకాలుగా స్పందిస్తున్నారు. రాజకీయ కారణాలు ఉన్నాయని, ద్రవ్య వినిమయ బిల్లుకు టీడీపీ శాసనమండలి అడ్డుపడిందని ప్రచారం చేస్తూ... ఉద్యోగులను తప్పుదారి పట్టించేందుకే వేతనాలు ఆలస్యం చేస్తున్నారని అంటున్నారు.

Updated Date - 2020-07-08T08:00:37+05:30 IST