టీచర్లకు వేతన వెతలు!

ABN , First Publish Date - 2020-05-19T08:56:26+05:30 IST

ప్రపంచవ్యాప్తంగా కోరలు చాపిన కరోనా వైర్‌సను నిలువరించేందుకు విధించిన లాక్‌డౌన్‌ నేపథ్యంలో మార్చి నాలుగో వారం నుంచి రాష్ట్రంలోని ప్రైవేట్‌ విద్యా సంస్థలన్నీ పూర్తిగా మూతపడ్డాయి.

టీచర్లకు వేతన వెతలు!

జీతాల్లో కోత..అధ్యాపకుల కుదింపు

ప్రైవేట్‌ విద్యా సంస్థలపై కరోనా ప్రభావం


అమరావతి, మే 18 (ఆంధ్రజ్యోతి) : ప్రపంచవ్యాప్తంగా కోరలు చాపిన కరోనా వైర్‌సను నిలువరించేందుకు విధించిన లాక్‌డౌన్‌ నేపథ్యంలో మార్చి నాలుగో వారం నుంచి రాష్ట్రంలోని ప్రైవేట్‌ విద్యా సంస్థలన్నీ పూర్తిగా మూతపడ్డాయి. ఫలితంగా ట్యూషన్‌ ఫీజులు, హాస్టల్‌, మెస్‌ చార్జీల రూపంలో రావాల్సిన రాబడిమార్గాలు చాలావరకు మూసుకుపోయాయి. ఆ ప్రభావం అధ్యాపకవర్గంపై తీవ్రంగాపడింది. ప్రైవేట్‌ రంగంలో నడుస్తున్న పాఠశాలలు, జూనియర్‌, పాలిటెక్నిక్‌, డిగ్రీ కాలేజీలు, ప్రొఫెషనల్‌ కాలేజీలన్నింటిపై కరోనా ప్రభావం ప్రత్యక్షంగా పడిందని చెప్పవచ్చు. మార్చి నెల జీతాలు కనాకష్టంగా అధ్యాపకులకు చెల్లించాయి. కొన్ని సంస్థలు మార్చి నుంచి జీతాలు ఆపేసినట్లు సమాచారం. ఏప్రిల్‌ నెలకు సంబంధించి సింహభాగం సంస్థలు తమ టీచర్లకు పూర్తిగా జీతాలు చెల్లించలేదు.


ఆర్థికంగా వెసులుబాటు ఉన్న కొన్ని విద్యాసంస్థలు మాత్రం 75 శాతం..50శాతం..25శాతం...ఇలా కట్‌ చేసి జీతాలు చెల్లించాయి. మేనెల నుంచి పూర్తిగా జీతాలు ఆపేయాల్సిన పరిస్థితి ఉందని యాజమాన్యాలు పేర్కొంటున్నాయి. రాష్ట్రంలో ప్రధాన కార్పొరేట్‌ విద్యాసంస్థలు మార్చి నెల జీతాలు చెల్లించినప్పటికీ, ఏప్రిల్‌ నెలవి ఇప్పటివరకు ఇవ్వలేదు. వైరస్‌ మహమ్మారి భవిష్యత్తు ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయా సంస్థలు నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్‌ నెలకు సంబంధించి అధ్యాపకులకు జీతాల్లో కోత విధించనున్నాయి. రూ.15వేలలోపు జీతం ఉన్న అధ్యాపకులకు పూర్తి జీతం ఇవ్వాలని, రూ.15 వేలకు మించి ఎంత జీతం ఉన్నప్పటికీ 50శాతం జీతమే ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాయి. అంటే రాష్ట్రప్రభుత్వం అనుసరిస్తున్న మార్గంలోనే చర్యలు తీసుకుంటున్నాయి.


సిబ్బంది కుదింపు..

సాధారణంగా విద్యా సంవత్సరం 12 నెలలు. 2020-21 విద్యా సంవత్సరాన్ని మాత్రం 16 నెలలు కొనసాగించాల్సిన అసాధారణ పరిస్థితి ఉంటుందని ఆయా సంస్థల యాజమాన్యాలు అంచనా వేసినట్లు చెబుతున్నారు. అధ్యాపకుల సంఖ్యను 30 శాతం మేర కుదించేందుకు సిద్ధమయ్యాయి. ఈ మేరకు మే నుంచే కార్యాచరణ ప్రణాళికను అమలుచేస్తున్నాయి. కార్పొరేట్‌ విద్యాసంస్థలు లాక్‌డౌన్‌ ప్రారంభం నుంచి ప్రతి రోజు ఒక సబ్జెక్టుపై రెండు గంటల పాటు ప్రత్యేక యాప్‌ల ద్వారా తరగతులు బోధిస్తున్నాయి. పరీక్షలు నిర్వహిస్తున్నాయి. జూమ్‌ యాప్‌ ద్వారా తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించి వారం రోజులు ఆ విద్యార్థికి ఎలాంటి తర్ఫీదు ఇవ్వాలి, ఎలా చదివించాలి అనేది ప్లాన్‌ చేయిస్తున్నారు. ఉపాధ్యాయుడు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు తన క్లాస్‌లో ఉన్న 40 మంది విద్యార్థులకు ఆ రోజు పాఠం బోధించడం, నిన్నటి హోంవర్క్‌ పేపర్లను స్కానింగ్‌ చేసి వాట్సాప్‌ ద్వారా తెప్పించుకోవడం, వాటిని మూల్యాంకనం చేసి ఏరోజు కారోజు వారి ప్రావీణ్యతను తెలుపుతున్నారు. తరగతిలో బోధించడం కంటే ఈ ఆన్‌లైన్‌ బాధలు ప్రైవేట్‌ ఉపాధ్యాయునికి కష్టంగా మారిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయినా ఉద్యోగ భద్రత లేకుండా పోతున్నదని ఆందోళన చెందుతున్నారు.


రాష్ట్రవ్యాప్తంగా రెసిడెన్షియల్‌ పాఠశాలలు, కళాశాలల్లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యార్థుల అడ్మిషన్లు అయ్యే పరిస్థితులు కన్పించడంలేదు. ఈ కారణంతోనూ కార్పొరేట్‌ విద్యా సంస్థల యాజమాన్యాలు ఒక అడుగు ముందుకు వేసి ఇప్పటికే సంస్థలో పనిచేస్తున్న టీచర్లకు కోతలతో జీతాలు చెల్లించి ..‘పాఠశాలలు పున: ప్రారంభమయ్యే టప్పుడు పిలుస్తాం. అంత వరకు మీకు అవకాశం ఉంటే చూసుకోండి’ అని సంకేతాలు ఇస్తున్నాయి. ఇలా వేలాది మంది ప్రైవేట్‌ ఉపాధ్యాయులు ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదంలో ఉన్నారు. కరోనా నేపథ్యంలో  ప్రైవేట్‌ ఉపాధ్యాయులను ప్రభుత్వమే గుర్తించి ,వారికి గుర్తింపు కార్డులు, హెల్త్‌ కార్డులు ఇవ్వాలని, ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.


శ్రీకాకుళంలో స్లాబ్‌లవారీగా..

ప్రైవేట్‌ ఇంజనీరింగ్‌ కాలేజీల విషయానికి వస్తే, మార్చినెలలో 90శాతం కాలేజీలు అధ్యాపకులకు పూర్తిజీతాలు చెల్లించాయి. 10శాతం కాలేజీలు ఆర్థిక సమస్యలను సాకుగా చూపి అసలు జీతాలే ఇవ్వలేదు. ఏప్రిల్‌ నెలకు సంబంధించి, సింహభాగం కాలేజీలు 50 శాతం నుంచి 100 శాతం జీతాలు కోత పెట్టాయి. అధ్యాపకులను కేటగిరీగా చేసి, జీతాలను తగ్గించాయి. రాష్ట్రంలో 14,400 ప్రైవేట్‌ పాఠశాలలు ప్రభుత్వ గుర్తింపుతో నడుస్తుండగా, ఇందులో దాదాపు 95 వేలమంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. అనధికారికంగా మరో లక్షమంది వరకు పనిచేస్తున్నారు. ప్రాథమిక పాఠశాలల్లో టీచర్లకు రూ.7500 నుంచి రూ.10 వేలవరకు, ఉన్నతపాఠశాలల్లో రూ.15 వేల నుంచి రూ.30 వేల వరకు వరకు జీతాలు చెల్లిస్తుంటారు. కరోనా నేపథ్యంలో మార్చి- ఏప్రిల్‌ నెలల్లో సగం జీతాలే చెల్లించారు. శ్రీకాకుళం నగరంలో మొత్తం 16 ప్రైవేట్‌ పాఠశాలలు ఉండగా, జీతాలకు స్లాబ్‌లు పెట్టుకుని మరీ కోతలు విధించారు. గుంటూరు జిల్లా వినుకొండలోని ప్రైవేట్‌ జూనియర్‌ కాలేజీలు గత రెండు నెలలుగా లెక్చరర్లకు జీతాలు ఇవ్వలేదని చెబుతున్నారు. రాష్ట్రం నలుమూలలా ఇవే పరిస్థితులు నెలకొన్నట్లు సమాచారం. 

Updated Date - 2020-05-19T08:56:26+05:30 IST