సజ్జల నన్ను చంపించాలని చూస్తున్నారు: జేసీ ప్రభాకర్‌ రెడ్డి

ABN , First Publish Date - 2020-12-27T21:00:42+05:30 IST

ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తనను చంపించాలని చూస్తున్నారని టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌ రెడ్డి సంచలన ఆరోపణ చేశారు. సజ్జల చెప్పినట్టు పోలీసులు వింటున్నారని, సీసీ ఫుటేజీ తీసుకొని కేసు పెట్టమంటే... పోలీసులు ఒత్తిళ్లు ఉన్నాయన్నాని చెప్పారన్నారు.

సజ్జల నన్ను చంపించాలని చూస్తున్నారు: జేసీ ప్రభాకర్‌ రెడ్డి

అనంతపురం: ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తనను చంపించాలని చూస్తున్నారని టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌ రెడ్డి సంచలన ఆరోపణ చేశారు. ‘‘నేను ప్రజల మనిషి.. ప్రజల్లోనే ఉంటా..చంపుతావా?. సజ్జల చెప్పినట్టు పోలీసులు వింటున్నారు. పార్నపల్లి, పెండెకల్లు, అచ్యుతాపురంలో దాడులు చేసి దోచుకున్నారు. చంబల్‌ లోయల్లో ఉండాల్సినవాళ్లు తాడిపత్రిలో ఉన్నారు. సీసీ ఫుటేజీ తీసుకొని కేసు పెట్టమంటే... పోలీసులు ఒత్తిళ్లు ఉన్నాయని అంటున్నారు. నేను కేసు పెడితే పోలీసులు సస్పెండ్ అవుతారు. ఏపీలో లా అండ్‌ ఆర్డర్‌ లేదు. రాష్ట్రంలో పోలీసులు మారాల్సిన అవసరముంది’’ అని జేసీ ప్రభాకర్‌ రెడ్డి సూచించారు.


జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇంట్లోకి పెద్దారెడ్డి వెళ్లడం, దీనిపై ఇరువర్గాల మధ్య సాగిన భీకర రాళ్ల దాడులతో అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణం గురువారం కొన్నిగంటలపాటు అట్టుడికిపోయింది. జేసీ ప్రభాకర్‌రెడ్డి లేని సమయంలో ఆయన ఇంట్లోకి  కేతిరెడ్డి తన అనుచరులతో దూసుకెళ్లారు. ఇళ్లంతా కలియతిరుగుతూ వీరంగం సృష్టించారు. అక్కడున్న జేసీ అనుచరుడు దాసరి కిరణ్‌పై ఎమ్మెల్యే అనుచరులు దాడిచేశారు. అంతటితో ఆగకుండా.. అక్కడే కాసేపు జేసీ ప్రభాకర్‌రెడ్డి కుర్చీలో పెద్దారెడ్డి కూర్చొని హల్‌చల్‌ చేశారు. ఈ వ్యవహారమంతా సీసీ ఫుటేజీల్లో స్పష్టంగా రికార్డు అయింది.


ఇంత జరిగినప్పటికీ ముందు ప్రభాకర్ రెడ్డిపైనే పోలీసులు కేసు నమోదు చేశారు. జేసీ ప్రభాకర్ రెడ్డితో పాటు అనుచరులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు తోపాటు 307సెక్షన్ కింద తాడిపత్రి వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత పెద్దారెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. పెద్దారెడ్డి ఇద్దరు కుమారులపై కూడా కేసు నమోదయింది. న్యాయవాది శ్రీనివాసులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసులు నమోదు చేశారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి డ్రైవర్ సుబ్బరాయుడును కులం పేరుతో దూషించడంతో పాటు బెదిరించారంటూ కేసు నమోదు చేశారు. 

Updated Date - 2020-12-27T21:00:42+05:30 IST