రైట్.. రైట్
ABN , First Publish Date - 2020-05-19T08:20:48+05:30 IST
ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కేందుకు రంగం సిద్ధమవుతోంది. ఇందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు.

3-4 రోజుల్లో బస్సు సర్వీసులకు పచ్చజెండా
బస్టాండ్ నుంచి బస్టాండ్ దాకే.. మధ్యలో బస్సు ఎక్కించుకోవద్దు
బస్సులో 20 మందే.. బస్టాండ్‌లో దిగగానే కొవిడ్ పరీక్షలు
వలస కూలీల తరలింపు కాగానే ప్రజారవాణా ప్రక్రియ మొదలు
ఉద్యోగులంతా కార్యాలయాలకు.. సీఎస్ ఆదేశాలు ఇవ్వాలి
ఇకపై పగలంతా దుకాణాలు.. ఉ.7 నుంచి రా.7 దాకా తెరవొచ్చు
ఐదుగురికి మించి గుమిగూడొద్దు.. రెస్టారెంట్ల వద్ద టేక్ అవేకు ఓకే
రాత్రి 7 నుంచి ఉ. 5 దాకా కర్ఫ్యూ.. ముఖ్యమంత్రి జగన్ ఆదేశాలు
వలస కూలీలపై బాగాపనిచేశారని అధికారులకు అభినందనలు
అమరావతి, మే 18 (ఆంధ్రజ్యోతి): ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కేందుకు రంగం సిద్ధమవుతోంది. ఇందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు. ‘‘వలస కార్మికుల తరలింపు పూర్తయ్యాక బస్సు సర్వీసులను నడపాలి. మూడు నాలుగు రోజుల్లో తేదీని ప్రకటించండి’’ అని కోరారు. బస్టాండు నుంచి బస్టాండు వరకూ నాన్‌స్టాప్ సర్వీసులుగా బస్సులను నడపాలని సూచించారు. ప్రభుత్వోద్యోగులంతా కార్యాలయాలకు హాజరయ్యేలా ఆదేశాలివ్వాలని ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నిని జగన్ ఆదేశించారు. కొవిడ్-19పై ప్రజల్లో భయాందోళనలు పోవాలన్న ముఖ్యమంత్రి, వలస కార్మికుల విషయంలో అధికారులు బాగా స్పందించారంటూ అభినందించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సోమవారం ఆయన కొవిడ్ -19పై సమీక్షించారు. ‘‘వలస కార్మికుల విషయంలో యుద్ధప్రాతిపదికన అధికారులు చర్యలు తీసుకున్నారు. వీళ్లు మన ఓటర్లా...రాష్ట్ర ప్రజలా అని ఆలోచన చేయడం సరికాదు. మానవతా దృక్పథంతో వ్యవహరించాల్సిన సమయమిది. వలస కూలీలను మనమంతా ఆదుకోవాలి’’ అని సీఎం పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం తాజాగా జారీచేసిన మార్గదర్శకాలపై ఈ సమావేశంలో చర్చ జరిగింది. అలాగే, అంతర్రాష్ట్ర సర్వీసుల అంశంపైనా చర్చించారు.
‘‘హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాల నుంచి రావాలనుకుంటున్నవారి కోసం బస్సులను నడపడంపై దృష్టి సారించాలి. దశలవారీగా సర్వీసులు పెంచుకుంటూ వెళ్లాలి. బస్టాండ్‌లో ప్రయాణికుడి పూర్తి వివరాలు తీసుకొని బస్సు ఎక్కించాలి. మధ్యలో ప్రయాణికులు ఎక్కేందుకు అనుమతి ఇవ్వవద్దు.బస్సు దిగగానే ప్రయాణికులకు పరీక్షలు నిర్వహించాలి. భౌతిక దూరం తప్పక పాటించాలి. ప్రయాణికులు తప్పనిసరిగా మాస్క్ ధరించాలి’’ అని స్పష్టం చేశారు. అలాగే, రాష్ట్రంలోకూడా బస్సు సర్వీసులను నడిపేలా, విధి విధానాలు రూపొందించాలని ఆదేశించారు. సగం సీట్లతో సర్వీసులు నడిపించేందుకు ప్రైవేటు బస్సులను అనుమతించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.
దుకాణంలో ఐదుగురు..పెళ్లిలో యాభైమంది
ప్రజా భాగస్వామ్యంతోనే కరోనాను దూరం చేయగలమని సీఎంఅన్నారు. కారులో ముగ్గురికి, బస్సులో 20 మందికి, ప్రతి దుకాణంలో ఐదుగురికి, పెళ్లిళ్లూ శుభకార్యాలకు 50 మందికి మాత్రమే అనుమతి ఇవ్వాలని ఆదేశించారు.