ఆంధ్ర-ఒడిశా సరిహద్దులో రోడ్డు బ్లాక్
ABN , First Publish Date - 2020-04-25T11:56:27+05:30 IST
ఆంధ్ర-ఒడిశా సరిహద్దులో రోడ్డు బ్లాక్

మట్టి వేసి రాకపోకలు నిలువరించిన ఒడిశా అధికారులు
రాకపోకలకు ఆంధ్రాలో ఉన్న నాలుగు పంచాయతీల వాసుల అవస్థలు శ్రీకాకుళం/పాలకొండ(కొత్తూరు): ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో కౌసల్యాపురం వద్ద ఒడిశా అధికారులు రోడ్డుకు అడ్డంగా మట్టి దిబ్బలు వేసి రాకపోకలు నిలుపుదల చేశారు. దీంతో కొత్తూరు మండలంలోని నాలుగు పంచాయతీలు కౌశల్య పురం, బలద, హంస, కడుము ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వివరా లిలా ఉన్నాయి.. కరోనా నేపథ్యంలో ఒడిశాలోకి ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారెవ రూ రాకుండా ఏర్పాటు చేశారు. ఆంధ్రా నుంచి ఒడిశా వెళ్లాలంటే హడ్డుబంగి జంక్షన్ మీదుగా ప్రధనా రహదారి కావడంతో రాకపోకల నివారణకు, లాక్‌డౌన్‌ను సక్రమంగా అమలుకు ఒడిశా అధికారులు హడ్డుబంగి వద్ద, ఇటు ఆంధ్రా అధికారు లు మాతల వద్ద చెక్కుగేట్లను ఏర్పాటు చేసి రాకపోకలను నిలువరిస్తున్నారు. అయి తే ఒడిశా అధికారులు ఒక అడుగు మందుకు వేసి ఒడిశా సరిహద్దులో రహదారిపై మట్టిని వేసి రాకపోకలను నిషేధించారు. దీంతో ఈ నాలుగు పంచాయతీలకు రోడ్డు సదుపాయం లేకుండా పోయింది. దీంతో వారంతా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కౌసల్యాపురం వద్ద రోడ్డు బ్లాక్ చేయడంతో ఈ నాలుగు గ్రామాల ప్రజలకు ఏ కష్టం వచ్చి అత్యవసర వైద్యం కోసం వాహనాలు వెళ్లలేని పరిస్థితి ఎదురవుతోంది. ఒక పక్క వంశధార నది అడ్డంగా ఉండగా, మరో పక్క ఒడిశా అధికారులు రోడ్డును మూసివేయడంతో ఈ పంచాయతీల ప్రజలు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. ఈ విషయం తెలుసుకుని కొత్తూరు తహసీల్దార్ ఎం.బాల బ్లాక్ చేసిన రోడ్డు వద్దకు వచ్చి సమస్యపై ఒడిశా అధికారులతో చర్చించినా ఫలితం లేకపోయింది. ఉన్నతా ధికారుల ఆదేశాల మేరకు సరిహద్దు గ్రామాల వద్ద మట్టితో మూసివేమని వారు చేతులెత్తేయడంతో ఆంధ్రా అధికారులు చేసేది లేక వెనుదిరిగారు.