రాజధానిలో రివర్స్‌

ABN , First Publish Date - 2020-12-17T09:27:14+05:30 IST

అమరావతి ఉద్యమంలో మరో మైలు రాయి. ఈ పోరు నిర్విరామంగా 365వ రోజుకు చేరింది. నాడు ఓ వెలుగు వెలిగిన రాజధాని వాసుల బతులు ఏడాదిగా చీకట్లో మగ్గిపోతున్నాయి.

రాజధానిలో రివర్స్‌

ఉపాధి కోల్పోయి పూట గడవని దుస్థితి

కుమార్తెకు పెళ్లి చేయలేని దీనస్థితిలో ఓ తండ్రి. వేరే ప్రాంతానికి వెళ్లి చదువుకుంటున్న కుమారుడికి ఫీజులు, అవసరాలకు డబ్బు పంపలేని మరో తండ్రి. రుణాలు తెచ్చి పెట్టిన వ్యాపారాలు డీలా పడి కిస్తీలు కట్టలేని స్థితిలో మరొకరు. ఇలా ఎవరిని కదిలించినా ఓ దీనగాథ. వీటన్నింటినీ పంటిబిగువన భరిస్తూ.. జేఏసీ జెండా భుజాన వేసుకొని జై అమరావతి అంటూ నినాదాలు చేస్తున్నారు రాజధాని గ్రామాల ప్రజలు. ఉద్యమం 365 రోజుల మైలు రాయిని చేరుతున్న సందర్భంగా అక్కడి ప్రజల దీనస్థితిపై ప్రత్యేక కథనం...

రైతులు, చేతివృత్తిదారుల బతుకు ఛిద్రం

వ్యాపారాలూ కుదేలు..

బ్యాంకు ఈఎంఐ కట్టలేని స్థితి


(గుంటూరు-ఆంధ్రజ్యోతి): అమరావతి ఉద్యమంలో మరో మైలు రాయి. ఈ పోరు నిర్విరామంగా 365వ రోజుకు చేరింది. నాడు ఓ వెలుగు వెలిగిన రాజధాని వాసుల బతులు ఏడాదిగా చీకట్లో మగ్గిపోతున్నాయి. రివర్స్‌ పాలనలో వారి జీవితాలు అధోఃగతి పాలయ్యాయి. ఎవరిని కదిలించినా కష్టాలు, కన్నీళ్లే. రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలనే నినాదంతో వారంతా ఏడాదిగా ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నారు. మూడు రాజధానులు అంటూ సీఎం జగన్‌ అసెంబ్లీలో ప్రకటించిన రోజు నుంచి దీక్షలు, ధర్నాలు, ర్యాలీలతో నిరసన తెలియజేస్తున్నారు. పోలీసుల దూషణలు, లాఠీ దెబ్బలు, కోర్టు కేసులు ఇలా ఎన్నో ఘట్టాలను చవిచూసిన రైతులు మహిళలు ప్రభుత్వం స్పందించే వరకు ఆందోళనలు కొనసాగుతాయని తేల్చి చెబుతున్నారు. 


ప్రపంచ శ్రేణి నగరంగా అమరావతిని నిర్మించేందుకు నాడు ప్రణాళిక రూపొందించారు. రాజధాని అంటే కేవలం పరిపాలనకే పరిమితం కాకుండా ఆర్థిక, సామాజిక, విద్య, వైద్యం, పరిశోధన, పర్యాటకం, ఆతిథ్యం, కళలు, సాంస్కృతికం, వాణిజ్యం, సాంకేతిక కార్యకలాపాలకు ప్రముఖంగా నిలవాలన్నది నాటి సీఎం చంద్రబాబు ఆకాంక్ష. ఇవన్నీ వస్తే ఉపాధి అవకాశాలు వాటంతటవే వస్తాయని అమరావతికి భూములిచ్చిన రైతులు బలంగా నమ్మారు. దానికి అనుగుణంగా కొందరు వ్యాపారాలు ప్రారంభిస్తే, మరికొందరు అద్దెలకు ఇవ్వటానికి బ్యాంకు రుణాలతో పక్కా ఇళ్లు కట్టుకున్నారు.

 

నాడు రోడ్డు పక్కనే కార్ల అమ్మకం..

అమరావతి రాజధాని అని ప్రకటించాక తుళ్లూరు సహా రాజధాని గ్రామాలు కళకళలాడాయి. రెండెకరాలున్న రైతులు అరెకరం అమ్ముకొని పిల్లలను మంచి కాలేజీల్లో చేర్చారు. మరికొందరు మిగిలిన డబ్బుతో ప్రకాశం, నెల్లూరు తదితర జిల్లాల్లో మంచి రేట్లు పెట్టి భూములు కొన్నారు. వీరి పుణ్యమా అంటూ ఆ భూములకు ధరలు వచ్చాయని గొప్పగా చెప్పుకున్నారు. నాడు కార్ల కంపెనీలు షోరూంలు తెరవాలంటే సమయం పడుతుందని రోడ్డు పక్కనే టెంట్లు వేసి కార్లు అమ్మాయి. బ్యాంకు అంటే తెలియని ఊళ్లలో రాత్రికి రాత్రే బ్యాంకులు వెలిశాయి. పిలిచి అప్పులిచ్చాయి. దీంతో అందరూ చక్కగా ఇళ్లు కట్టుకున్నారు. వాహనాలూ సమకూర్చుకున్నారు. కానీ, వైసీపీ ప్రభుత్వం రావటంతో వారి జాతకాలు రివర్స్‌ అయ్యాయి. నేడు బ్యాంకు రుణంపై నెలవారీ కిస్తీ కట్ట లేని దుస్థితి. వాహనాల నిర్వహణ లేక, వాటిని అమ్ముకోలేక ఇంటి ముందు అలంకార ప్రాయంగా వదిలేశారు. 


సాగని వ్యాపారాలు..

అమరావతి పనులు జరిగేటప్పుడు చేతివృత్తుల వారికి చేతినిండా పని. రోజుకు రెండు షిఫ్టులు పనిచేసినవారూ ఉన్నారు. నెలకు రూ.25-30 వేల దాకా సంపాదించుకున్నారు. నేడు పరిస్థితి మారింది. నిర్మాణానికి వచ్చిన కంపెనీలు వెనక్కి వెళ్లాయి. పనులు లేవు. వ్యాపారాలు పెట్టుకున్న వారి పరిస్థితీ అలానే ఉంది. బోణీ కూడా కావటం లేదని కన్నీటిపర్యంతమవుతున్నారు. 

Updated Date - 2020-12-17T09:27:14+05:30 IST