108పై రివర్సా? రిజర్వా?

ABN , First Publish Date - 2020-06-25T07:33:23+05:30 IST

రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా 108 అంబులెన్స్‌ల నిర్వహణ కోసం అరవిందో కంపెనీని ఎంపిక చేశామన్న ప్రభుత్వ వాదన ..

108పై రివర్సా?   రిజర్వా?

అల్లుడి కంపెనీకి ముందే ఫిక్స్‌.. దానికోసం నిబంధనల మార్పు

ప్రభుత్వ వివరణ అబద్ధాల పుట్ట.. సర్కారుపై తెలుగుదేశం ఫైర్‌


అమరావతి, జూన్‌ 24 (ఆంధ్రజ్యోతి): రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా 108 అంబులెన్స్‌ల నిర్వహణ కోసం అరవిందో కంపెనీని ఎంపిక చేశామన్న ప్రభుత్వ వాదన ఒట్టి బూటకమని, ఎంపీ విజయసాయిరెడ్డి అల్లుడి కంపెనీ కోసం అది ముందే రిజర్వు అయిన టెండరని తెలుగుదేశం పార్టీ పేర్కొంది. ఈ టెండర్‌ విషయంలో న్యాయ సమీక్షను కూడా ఒక ఫార్సుగా మార్చారని, తాము అనుకొన్న కంపెనీకి టెండర్‌ దక్కడం కోసం పాత నిబంధనలు ఎత్తివేసి అదనపు సడలింపులు ఇచ్చారని ఆ పార్టీ ఆరోపించింది. ఈ అంబులెన్స్‌లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన వివరణపై టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి బుధవారం విలేకరులతో మాట్లాడారు. ‘‘రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా ఈ టెండర్‌ ఇచ్చామని ప్రభుత్వం చెబుతోంది. రివర్స్‌ టెండరింగ్‌ అంటే గతంలో ఉన్న ధర కంటే తక్కువకు ఇవ్వాలి. ఇంతకుముందు ఉన్న బీవీజీ కంపెనీకి ఒక అంబులెన్స్‌ నిర్వహణకు నెలకు రూ. 1.43 లక్షలు ఇచ్చారు.


ఇప్పుడు అరవిందో ఫౌండేషన్‌కు నెలకు రూ.1.78 లక్షలకు ఇచ్చేలా మాట్లాడుకొన్నారు. పాత అంబులెన్సులకు ఇంకా పెంచి నెలకు రూ.2.21 లక్షలు ఇస్తున్నారు. ఇది తగ్గించినట్లా? అరవిందో కంపెనీ ఇంకా ఎక్కువ అడిగిందని, తాము చాలా కష్టపడి తగ్గించామని ప్రభుత్వం చెబుతోంది. ఇది రివర్స్‌ టెండరింగా లేక రిజర్వు టెండరింగా?’’ అని పట్టాభి ప్రశ్నించారు. అంబులెన్సుల టెండర్లలో న్యాయ సమీక్ష డొల్లతనం బయటపడిందని ఆయన విమర్శించారు. ‘‘అంబులెన్సుల్లో ఉన్న పరికరాలు పాడైనా, పోయినా వాటిని నిర్వహిస్తున్న కంపెనీదే బాధ్యత అని టెండర్‌ డాక్యుమెంట్‌లో రాస్తే, న్యాయ సమీక్షలో దాన్ని పూర్తిగా ఎత్తివేశారు. అంబులెన్స్‌ల నిర్వహణలో ఐదేళ్ల అనుభవం ఉండాలని టెండర్‌ డాక్యుమెంట్‌లో ముందు పెట్టారు. న్యాయ సమీక్షలో విదేశాల్లో ఆ అనుభవం ఉన్నా ఫర్వాలేదని మార్పు చేశారు. అరవిందో ఫౌండేషన్‌కు అంబులెన్స్‌లు నిర్వహించిన అనుభవం లేదు.విదేశాల్లో ఉన్నా ఫర్వాలేదని న్యాయ సమీక్షలో పెట్టిన తర్వాత ఆ కంపెనీ బ్రిటన్‌లో అంబులెన్స్‌లు నిర్వహిస్తున్న ఒక కంపెనీతో జాయింట్‌ వెంచర్‌ ఏర్పాటుచేసుకొని అర్హత సాధించింది. కావాల్సిన కంపెనీకి అనుకూలంగా సడలింపులు ఇవ్వడానికేనా న్యాయసమీక్ష? ఇవన్నీ మేం అధికారిక డాక్యుమెంట్లలో చూసిన విషయాలే’’ అని చెప్పారు. 


పవర్‌ ప్రజంటేషన్‌కు అన్ని మార్కులా!

ఏదైనా కంపెనీ పనితీరుకి, అనుభవానికి ఎక్కువ మార్కులు వేస్తారని, కాని పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌కు అత్యధికంగా నలభై మార్కులు పెట్టి అరవిందో ఫౌండేషన్‌కు ఎక్కువ మార్కులు వచ్చేలా చేశారని పట్టాభి ఆరోపించారు. ఇంతకు ముందు అంబులెన్స్‌లు నిర్వహించిన బీవీజీ కంపెనీ పనితీరు అసలు బాగోలేదని, అందుకే తొలగించామని ప్రభుత్వం తన వివరణలో చెప్పడం కూడా ఒక కుంటిసాకని పట్టాభి విమర్శించారు. ఇంతకు ముందు ఉన్న అంబులెన్స్‌లు ఏవీ పనికిరావడం లేదని... తాము వచ్చి కొత్తవి కొంటున్నట్లుగా వైసీపీ ప్రభుత్వం చేసుకొనే ప్రచారంలో నిజం లేదని పట్టాభి అన్నారు. ‘‘టీడీపీ ప్రభుత్వంలో 825 వాహనాలు కొనుగోలు చేశాం. మేం వచ్చి రాగానే 278 కొత్త అంబులెన్స్‌లు కొన్నాం.


సంచార వైద్య శాలల పేరుతో మరో 275 అంబులెన్స్‌లను కొనుగోలు చేశాం. ‘తల్లీ బిడ్డ ఎక్స్‌ప్రెస్‌’ పేరుతో గర్భిణీ స్త్రీల అవసరాలకోసం మరో 270 అంబులెన్స్‌లు, గిరిజన ప్రాంతాల కోసం ప్రత్యేకంగా బైక్‌ అంబులెన్స్‌లు, మహా ప్రస్థానం పేరుతో మరికొన్ని వాహనాలు కొనుగోలు చేసింది’’ అని వివరించారు. అన్నింటికీ ట్వీట్లు చేసే ట్విటర్‌ రెడ్డి ఈ అంశాలపై కిక్కురుమనడం లేదని, ఆరోగ్య మంత్రి పూర్తిగా మౌనం పాటించారని పట్టాభి ఎద్దేవా చేశారు. ప్రభుత్వానికి దమ్ముంటే ఈ అంశాలపై సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. 

Updated Date - 2020-06-25T07:33:23+05:30 IST