దాచాలంటే దాగదులే!
ABN , First Publish Date - 2020-09-18T08:08:08+05:30 IST
.జగన్ మీడియా కథనం వెలువడగానే సామాన్యులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, రాజకీయ నాయకులు ఎవరైనా ఆయా గ్రామాల పరిధిలో భూములు ...

‘‘గుంటూరు జిల్లా తుళ్లూరు, అమరావతి, మంగళగిరి, తాడేపల్లి మండలాల్లో కృష్ణా నదిని ఆనుకుని రాజధాని వచ్చే అవకాశముంది. ఆ గ్రామాల్లో రెవెన్యూ సర్వే విభాగాలు రంగంలోకి దిగాయి. రాజధానికి భూములిచ్చే రైతులకు తాయిలాలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది!’’
...ఇది రాజధాని గ్రామాల పేర్లతో సహా, దాదాపుగా స్పష్టంగా 2014 సెప్టెంబరు 13న నేటి సీఎం, నాటి విపక్ష నేత జగన్ సొంత పత్రికలో ప్రచురితమైన ప్రత్యేక కథనం!
ఈ కథనం ప్రచురితమైన దాదాపు 2 నెలలకు... అంటే 2014 నవంబరు 8వ తేదీన రాజధాని ప్రాంతం సరిహద్దులతో సహా విధాన ప్రకటన వెలువడింది!
..జగన్ మీడియా కథనం వెలువడగానే సామాన్యులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, రాజకీయ నాయకులు ఎవరైనా ఆయా గ్రామాల పరిధిలో భూములు కొన్నారనుకుందాం!! అది ‘ఇన్సైడర్ ట్రేడింగ్’ అవుతుందా? నేరం, ఘోరం, మోసం అవుతుందా? అసలు... నవ్యాంధ్ర రాజధాని విషయంలో జరిగిందేమిటి? అందులో ఎప్పుడైనా, ఎక్కడైనా ‘రహస్యం’ దాగుందా? మీరే చూడండి!
రాజధానిపై దాగుడుమూతలెక్కడ?
ఎప్పటికప్పుడు మీడియాలో వార్తలు
అధికారిక ప్రకటనకు 2 నెలల ముందే
జగన్ పత్రికలో స్పష్టమైన కథనం
‘తుళ్లూరు తుళ్లింత’పేరిట ‘ఆంధ్రజ్యోతి’లో
ప్రమాణ స్వీకారం చేసిన మరునాడే
‘గుంటూరు-బెజవాడ’పై బాబు ప్రకటన
విడిపోతే రాజధాని అదేనని అందరి అంచనా
టీ-ఉద్యమం నుంచే రియల్టర్ల హల్చల్
నేడు వ్యూహాత్మకంగా ‘ఇన్సైడర్’ బూచి!
(అమరావతి - ఆంధ్రజ్యోతి)
అమరావతిని అటకెక్కించేందుకు, విపక్ష నేతలపై గురి పెట్టేందుకు ఎంచుకున్న ఒక అస్త్రం... ‘రాజధాని భూముల్లో కుంభకోణం... ఇన్సైడర్ ట్రేడింగ్’! అయితే... 2012, 2013తో పోల్చితే 2014లో అమరావతి ప్రాంతంలో అసాధారణమైన, అసహజ రీతిలో భూ లావాదేవీలు ఏవీ జరగలేదని రిజిస్టర్ అయిన డాక్యుమెంట్ల సంఖ్యను కూడా వివరిస్తూ గురువారం ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనం ప్రచురించింది. ఆ విషయాన్ని పక్కనపెడితే... రాష్ట్ర విభజనంటూ జరిగితే, గుంటూరు-విజయవాడ మధ్యే రాజధాని వస్తుందనేది ప్రజల్లో ఉన్న విస్తృతమైన అభిప్రాయం. తెలంగాణ ఉద్యమం జోరుగా సాగుతూ, రాష్ట్ర విభజనకు యూపీఏ సర్కారు సానుకూల సంకేతాలు పంపుతున్నప్పటి నుంచే దీనిపై రియల్ ఎస్టేట్ హల్చల్ మొదలైంది. ‘విభజన జరిగితే విజయవాడే ఆంధ్రుల రాజధాని’ అని 2008లోనే ‘ఆంధ్రజ్యోతి’లో కథనం ప్రచురితమైంది. ఇక... విభజన జరిగిన తర్వాత 2014 అక్టోబరు 26న ‘తుళ్లూరు తుళ్లింత’ శీర్షికన రాజధాని ఈ మండల పరిధిలోనే ఏర్పడే అవకాశముందని ‘ఆంధ్రజ్యోతి’ ఒక కథనం ప్రచురించింది.
అంతకు నెల రోజుల ముందే జగన్ మీడియాలోనే రాజధాని గ్రామాలపై మరింత స్పష్టమైన కథనం వచ్చింది. 2014 అక్టోబరు 9న అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు... విజయవాడ-గుంటూరు మధ్యలోనే రాజధాని ఉంటుందని ప్రకటించారు. ఆ తర్వాత... అదే నెల 26వ తేదీన రాజధాని ప్రాంతం సరిహద్దులతో కూడిన విధానపరమైన ప్రకటన వెలువడింది. అంతకుముందుగానే... నవ్యాంధ్ర రాజధాని ఎంపికపై అధికారుల స్థాయిలో అందించే సమాచారం ఆధారంగా ఎప్పటికప్పుడు ఊహాగానాలు, అంచనాలు వెలువడుతూనే ఉన్నాయి. ఇందులో భాగంగానే... ఎవరికి వారు తమ అంచనాల ప్రకారం విజయవాడ, గుంటూరు, మంగళగిరి, అమరావతి, తాడికొండ, తాడేపల్లి, నూజివీడు, జగ్గయ్యపేట, కంచికచర్ల, ఒంగోలు ఇలా పలు ప్రాంతాల్లో భూములు, స్థలాలు కొన్నారు. ఇలా కొనుగోలు చేసిన వారిలో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల వారూ ఉన్నారు.
శివరామకృష్ణన్ భేటీల్లోనూ..
రాష్ట్రాన్ని విభజించిన యూపీఏ ప్రభుత్వమే... రాజధానిపై శివరామకృష్ణన్ కమిటీని నియమించింది. చంద్రబాబు సీఎం అయిన తర్వాత ప్రభుత్వ ఆలోచనలు, శివరామకృష్ణన్ కమిటీతో భేటీల వివరాలన్నీ మీడియాలో ఎప్పటికప్పుడు వస్తూనే ఉన్నాయి. 2014 జూన్ 15న కమిటీ సభ్యులతో జరిగిన భేటీలో తమ అభిప్రాయాన్ని చంద్రబాబు స్పష్టంగా చెప్పారు. ‘విజయవాడ-గుంటూరే రాజధాని! శివరామకృష్ణన్ కమిటీకి చంద్రబాబు స్పష్టీకరణ’ అని జగన్ పత్రికలోనూ వార్త వచ్చింది. రాజధాని అనేది అభివృద్ధి, ఉపాధి అవకాశాలకు కేంద్రంగా, త్వరితంగా విస్తరించేందుకు అవకాశమున్న ప్రాంతంగా, విజ్ఞానం, వినోదాలతో కూడి ఉండాలని చంద్రబాబు చెప్పారని కూడా ఆ కథనంలో వివరించారు. ఆ తర్వాత కూడా ఇలాంటి సమావేశాలు అనేకం జరిగాయి. శివరామకృష్ణన్ కమిటీ భేటీల్లో పాల్గొన్న నేటి మంత్రి బొత్స సత్యనారాయణ కూడా ఆ సమావేశ వివరాలను వెల్లడించారు. ఇక... గుంటూరు-విజయవాడ మధ్య రాజధాని వస్తుందని నాటి సభాపతి దివంగత కోడెల శివప్రసాదరావు ప్రకటించారు. 2014 జూలై 23వ తేదీన ‘నడిబొడ్డున రాజధాని’ అని శివరామకృష్ణన్ కమిటీకి నాటి పురపాలక శాఖ మంత్రి నారాయణ స్పష్టంగా చెప్పినట్లు వార్తలు వచ్చాయి. వీటన్నింటినీ బట్టి చూస్తే... రాజధాని అంశాన్ని ఎప్పు డూ రహస్యంగా ఉంచలేదని అర్థమవుతుంది. నవంబరు 8న రాజధాని ప్రాంతంపై ప్రకటన చేయ గా... సెప్టెంబరు 11 నుంచే రైతులతో భూసమీకరణపై రాష్ట్ర ప్రభుత్వం చర్చలు ప్రారంభించింది. ఈ విషయం మీడియాలో వచ్చింది. రాజధాని గ్రామాలకే వెళ్లి ప్రభుత్వం ఈ చర్చలు జరిపింది. మరి... ఏది రహస్యం? ఎక్కడ ఇన్సైడర్ ట్రేడింగ్?
రెండో రోజే...
రాష్ట్ర విభజన తర్వాత, 2014 జూన్ 8వ తేదీన ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేశారు. ఆ మరుసటి రోజునే... అంటే, జూన్ 9వ తేదీన విజయవాడ - గుంటూరు ప్రాంతంలో రాజధాని ఉంటుందని ప్రకటించారు. భూ సమీకరణ పద్ధతిలో రాజధాని నిర్మాణం కోసం ముందుకెళ్తామనే సంకేతాలు పంపుతూ... ‘వినూత్న పద్ధతిలో భూమి సేకరిస్తాం. రైతులు కూడా దీనిలో భాగస్వాములవుతారు’’ అని తెలిపారు. ఈ విషయాన్ని స్థానిక పత్రికలతోపాటు జాతీయ పత్రికలూ ప్రచురించాయి.
తెలిసింది... జరిగింది!
2014 జూన్ 8: సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేశారు. విజయవాడ-గుంటూరు మధ్యే రాజధాని అని ఆ మరుసటి రోజునే ప్రకటించారు. అంతకు ముందు నుంచే రియల్ ఎస్టేట్ వ్యాపారులు, బ్రోకర్లు, కొనుగోలుదారుల హడావుడి మొదలైంది. ఈ పరిణామాలపై విజయవాడ-గుంటూరు మధ్య రియల్ భూం.. శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’ 2014 జూన్ 8న ప్రత్యేక కథనం ప్రచురించింది.
2014 జూలై 23: ‘నడిబొడ్డున రాజధాని’ అని మంత్రి నారాయణ ప్రకటించారు. శివరామకృష్ణన్ కమిటీతో సమావేశంలోనే ఇది చెప్పారు.
2014 సెప్టెంబరు 4: విజయవాడ చుట్టుపక్కల రాజధాని అని అసెంబ్లీలో ప్రకటించారు. దీనికి వైసీపీతో సహా అన్ని పార్టీలు సమ్మతించాయి.
2014 సెప్టెంబరు 13: జగన్ సొంతపత్రికలో ‘రంగంలోకి రెవెన్యూ సర్వే విభాగాలు, రాజధానికి భూములిచ్చే రైతులకు తాయిలాలు’ అంటూ తుళ్లూరు, అమరావతి, మంగళగిరి, తాడేపల్లి మండలాల్లోని కృష్ణా నదిని ఆనుకుని ఉన్న గ్రామాల్లో సర్వే ప్రారంభమైందని రాశారు.
2014, అక్టోబరు 9: విజయవాడ-గుంటూరు మధ్య.. గుంటూరు జిల్లా పరిధిలో రాజధాని ఉంటుందని చంద్రబాబు ప్రకటించారు.
2014 నవంబరు 8: రాజధాని ప్రాంత గ్రా మాలు, సరిహద్దులపై అధికారికప్రకటన వచ్చింది.