పెగ్గుపై పీఛేముడ్‌!

ABN , First Publish Date - 2020-08-06T08:25:07+05:30 IST

మద్య నిషేధమే లక్ష్యంగా మందు ధరలు పెంచేసిన వైసీపీ ప్రభుత్వం.. ఇప్పుడు దానిపై వెనకడుగు వేయబోతోందా? త్వరలోనే పాత పద్ధతిలోకి

పెగ్గుపై పీఛేముడ్‌!

  • పెంచిన మద్యం ధరలపై పునరాలోచన
  • 30 శాతానికి మద్యం అమ్మకాలు పతనం
  • మిగతా 70% ఎన్‌డీపీఎల్‌, నాటుసారా వైపు
  • ఆర్జనా, నియంత్రణా నీరుగారడంతో వెనక్కి?

అమరావతి, ఆగస్టు 5(ఆంధ్రజ్యోతి): మద్య నిషేధమే లక్ష్యంగా మందు ధరలు పెంచేసిన వైసీపీ ప్రభుత్వం.. ఇప్పుడు దానిపై వెనకడుగు వేయబోతోందా? త్వరలోనే పాత పద్ధతిలోకి తీసుకురానుందా? అంటే అవుననే అంటున్నాయి ఉన్నతస్థాయి వర్గాలు. ఒక్కసారిగా మద్యం అమ్మకాలు పడిపోవడం, పక్క రాష్ర్టాల నుంచి భారీగా ‘ఎన్‌డీపీఎల్‌’(అక్రమ మద్యం) రావడం, నాటుసారా పెరగడం, ప్రజలు శానిటైజర్లు తాగడం వంటి ఘటనలు ప్రభుత్వాన్ని పునరాలోచనలో పడేశాయని చెబుతున్నాయి. ముఖ్యంగా  మద్యం పై వచ్చే ఆదాయంలో భారీగా కోత పడింది. ప్రభుత్వం అంచనా ప్రకారం నెలకు కనీసం రూ.1,700 కోట్లు అయినా రావాల్సి ఉండగా, పెంచిన ధరలతో సగం ఆదాయం తగ్గిపోయింది. అసలే కరోనాతో అన్ని రకాలుగా ఆదాయం కోల్పోయిన ప్రభుత్వానికి స్థిరంగా వచ్చే మద్యం ఆదాయం కూడా తగ్గిపోవ డం ఇబ్బందిగా మారింది. మద్య నిషేధం పేరుతో ధరలు పెంచేస్తే  తాగుడు మానేస్తారని భావించగా, ‘ఎన్‌డీపీఎల్‌’ యథేశ్ఛగా రావడంతో అటువైపు మళ్లుతున్నారు.


దీంతో పాత విధానమే మేలనే అభిప్రాయానికి ప్రభుత్వ వ ర్గాలు వచ్చినట్లు తెలుస్తోంది. లాక్‌డౌన్‌ తర్వాత ప్రభుత్వం ఒకేసారి 75 శాతం ధరలు పెంచింది. ఇప్పుడు అందులో 40ు తగ్గిస్తారనే ప్రచారం జ రుగుతోంది. దీనిపై ఇప్పటికే అధికార వర్గాలు కసరత్తు ప్రారంభించాయి. మద్యం వినియోగాన్ని నిరుత్సాహపరుస్తూనే ధరలు తగ్గించడం ఎలా? అనే కోణంలో ఆలోచన చేస్తున్నాయి. కాగా, ఇప్పటికే ధరలపై కొన్ని ప్రతిపాదన లు సిద్ధం చేసినట్లు తెలిసింది. ఆ ప్రతిపాదనలు సీఎంకు వివరించి ఆయన ఆమోదం లభిస్తే, ధరలు తగ్గించవచ్చని భావిస్తున్నాయి. 


ఆవేశంగా అనాలోచిత నిర్ణయం

తొలి విడత లాక్‌డౌన్‌ అనంతరం మద్యం షాపులు తెరిచేందుకు కేంద్రం అనుమతినిచ్చింది. ప్రజలు మద్యం షాపుల వద్ద గుమిగూడితే కరోనా విస్తరిస్తుందని భావించిన రాష్ట్ర ప్రభుత్వం, 25శాతం ధరలు పెంచింది. అయినప్పటికీ మందుబాబులు బారులు తీరారు. దీనిపై విమర్శలు రావడం తో ప్రభుత్వం అమ్మకాలు ఆపేసి, మరో 50ు ధర పెంచింది. అంటే మొత్తం 75ు పెంపు అమల్లోకి వచ్చింది. ఆ తర్వాత మద్యం షాపులు తెరిచిన తెలంగాణ ప్రభుత్వం.. అనూహ్యంగా 11ు, 16ు రెండు కేటగిరీల్లోనే మద్యం ధరలు పెంచడం ఏపీ అమ్మకాలను దెబ్బతీసింది. ఒక బ్రాండ్‌ క్వార్ట ర్‌ ధర తెలంగాణలో రూ.140 ఉంటే, ఏపీలో రూ.250. దీంతో తెలంగాణ నుంచి ‘ఎన్‌డీపీఎల్‌’ ఏపీలోకి భారీగా పెరిగింది. దీంతో మద్యనిషేధం కోసమే ధరలు పెంచామని చెప్పిన నేపథ్యంలో.. ధరలు తగ్గించలేక, ఎన్‌డీపీఎల్‌ను ఆపలేక సర్కారు సతమతమవుతోంది.


ఇటీవల పలు చోట్ల శానిటైజర్లు తాగి కొందరు చనిపోవడంతో ధరలు తగ్గించక తప్పదనే ఆలోచనకు వచ్చినట్లు అఽధికార వర్గాలు చెబుతున్నాయి. అయితే, మద్యం ధరలు తగ్గించడం పెద్ద పని కాదు. కానీ ఎందుకు తగ్గిస్తున్నారనే దానిపై ప్రజలకేం చెప్పాలి అనేదే ఇప్పుడు ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారింది. పెంచే రోజున కరోనా వల్ల పెంచుతున్నాం అనే మాట చెప్పి ఉంటే ఇప్పుడు తగ్గించినా ప్రజలు అడిగేవారు కాదు. కానీ మద్య నిషేధమే లక్ష్యం అని చెప్పి,  ఇప్పుడు తగ్గిస్తే ప్రజల్లో వ్యతిరేకత వస్తుందనే ఆందోళన నెలకొంది. 

Updated Date - 2020-08-06T08:25:07+05:30 IST