-
-
Home » Andhra Pradesh » Results of corona tests
-
నిన్న నెగిటివ్.. నేడు పాజిటివ్!
ABN , First Publish Date - 2020-06-22T09:01:59+05:30 IST
కరోనా పరీక్షల ఫలితాలు వెల్లడించడంలో అధికారుల నిర్లక్ష్యం బట్టబయలైంది. ఏలూరులోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో పెంటపాడు మండలానికి

- పశ్చిమలో అధికారుల నిర్వాకం
ఏలూరు క్రైం, జూన్ 21: కరోనా పరీక్షల ఫలితాలు వెల్లడించడంలో అధికారుల నిర్లక్ష్యం బట్టబయలైంది. ఏలూరులోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో పెంటపాడు మండలానికి చెందిన ఓ మహిళ ఈ నెల 15న మృతిచెందింది. మృతదేహాన్ని తీసుకువెళ్లడానికి ఏలూరుకు చెందిన ఒక ప్రైవేటు అంబులెన్స్ డ్రైవర్ కిరాయి మాట్లాడుకుని వెళ్తున్నాడు. మార్గమధ్యంలో మృతురాలి కుమారుడికి అధికారులు ఫోన్‌చేసి ఆమెకు కరోనా పాజిటివ్ వచ్చిందని చెప్పడంతో మృతదేహాన్ని ఏలూరు ప్రభుత్వాస్పత్రి మార్చురీలో భద్రపర్చారు. 16న కరోనా నిబంధనల ప్రకారమే అంత్యక్రియలు నిర్వహించారు. తర్వాత ఆ మహిళ భర్తకు, ఆమె కుమారుడికి, అల్లుడికి, కూతురికి, సమీపంలోని మరో మహిళకు పాజిటివ్ రావడంతో సదరు అంబులెన్స్ డ్రైవర్ అప్రమత్తమయ్యాడు.
17న కరోనా పరీక్షలు చేయించుకొని, ఇంటికి వెళ్లకుండా వేరేచోట ఒంటరిగానే ఉంటున్నాడు. విధులకు సైతం హాజరు కాలేదు. 20న సాయంత్రం అతనికి నెగిటివ్ వచ్చినట్లు మెసేజ్ పంపించారు. దీంతో స్నేహితులను కలిసి శనివారం రాత్రి ఇంటికి వెళ్లిపోయాడు. ఆదివారం ఉదయం అతనికి పాజిటివ్ వచ్చిందంటూ కలెక్టరేట్ నుంచి ఫోన్ రావడంతో కుప్పకూలిపోయాడు. ఆ డ్రైవర్‌ను ఆశ్రం ఆస్పత్రికి తరలించిన అధికారులు కుటుంబ సభ్యులను హోం క్వారంటైన్‌లో ఉంచారు. ఇలాంటి తప్పుడు రిపోర్టులు ఇస్తున్నవారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.