విశాఖలో గెస్ట్‌హౌస్‌ నిర్మాణానికి కన్సల్టెంట్‌ నియామకం

ABN , First Publish Date - 2020-09-18T08:33:38+05:30 IST

విశాఖలో పరిపాలన రాజధాని పనులు నిరాటంకంగా కొనసాగుతున్నాయి. హైకోర్టు స్టే ఇచ్చినా నిర్మాణాలకు అనుగుణంగా ...

విశాఖలో గెస్ట్‌హౌస్‌ నిర్మాణానికి కన్సల్టెంట్‌ నియామకం

ప్రభుత్వ సంస్థను కాదని ప్రైవేట్‌కు బాధ్యతలు 

విశాఖపట్నం, సెప్టెంబరు 17(ఆంధ్రజ్యోతి): విశాఖలో పరిపాలన రాజధాని పనులు నిరాటంకంగా కొనసాగుతున్నాయి. హైకోర్టు స్టే ఇచ్చినా నిర్మాణాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. రాజధాని ఏర్పాటులో భాగంగా అతిపెద్ద గెస్ట్‌హౌస్‌ నిర్మాణానికి కాపులుప్పాడ  గ్రేహౌండ్స్‌ కొండపై 30ఎకరాలు కేటాయించిన సంగతి తెలిసిందే. ఆ స్థలంలో గెస్ట్‌హౌస్‌ నిర్మాణ బాధ్యతను విశాఖ మహానగర ప్రాంత అభివృద్ధి సంస్థ(వీఎంఆర్‌డీఏ)కు అప్పగించారు. ప్రాజెక్టు డిజైన్‌, కన్సల్టెంట్‌, పర్యవేక్షణ కోసం బిడ్లను ఆహ్వానిస్తూ ఆగస్టులోనే వీఎంఆర్‌డీఏ నోటిఫికేషన్‌ ఇచ్చింది. కేవలం ఒక్క బిడ్‌ మాత్రమే దాఖలు కావడంతో రెండోసారి నోటిఫికేషన్‌ ఇచ్చింది. అహ్మదాబాద్‌కు చెందిన హెచ్‌సీపీ డిజైన్స్‌, ప్లానింగ్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థ, ప్రభుత్వ రంగ సంస్థ (మినీ రత్నం-1) వాప్‌కోస్‌ బిడ్లు సమర్పించాయి. అన్ని అర్హతలు పరిశీలించిన అధికారులు ప్రైవేటు సంస్థ అయిన హెచ్‌సీపీ డిజైన్స్‌కే బాధ్యతలు అప్పగించారు. డీపీఆర్‌ను త్వరగా తయారు చేయాలని, ఆ తర్వాత పనుల ప్రారంభం, పర్యవేక్షణ, అనుమతులు, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌ అన్నీ కన్సల్టెన్సీ సంస్థే చూసుకోవాలని నిబంధనలు పెట్టారు. డిజైన్లు సిద్ధమై డీపీఆర్‌ పూర్తయ్యేసరికి కొండపై 30ఎకరాల్లోనూ ల్యాండ్‌ స్కేపింగ్‌ పూర్తి చేయాలని సూచించారు. ఇదిలా ఉండగా, ఈ ప్రాంతమంతా బౌద్ధక్షేత్రం తొట్లకొండకు చెందినదని, పురావస్తు శాఖ పరిరక్షణలో ఉందని, దీని సర్వే నంబర్లు మార్చేసి ఇతర అవసరాలకు ఉపయోగించడం సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధమని ఇంధనశాఖ మాజీ కార్యదర్శి ఈఏఎస్‌ శర్మ ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. మరోవైపు దీనిపై హైకోర్టులో బౌద్ధ సంఘాలు ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశాయి. 

Updated Date - 2020-09-18T08:33:38+05:30 IST