-
-
Home » Andhra Pradesh » Reservations in RTC
-
ఆర్టీసీలో రిజర్వేషన్లు షురూ కానీ..
ABN , First Publish Date - 2020-04-07T15:45:16+05:30 IST
ఆర్టీసీలో రిజర్వేషన్లు షురూ కానీ..

- నాన్ ఏసీ బస్సులు తిప్పే యోచన
- ఏసీ బస్సులపై సందిగ్ధం - 15న రోడ్డెక్కనున్న ఆర్టీసీ బస్సులు
కడప(ఆంధ్రజ్యోతి): లాక్‌డౌన్‌ను ఎత్తివేయాలన్న ఆలోచనలో కేంద్రం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నెల 14తో లాక్‌డౌన్ పూర్తి కానుంది. ఆర్టీసీలో ఆన్‌లైన్ బుకింగ్ ఈ నెల 15 నుంచి అందుబాటులోకి వచ్చింది. నాన్ ఏసీ బస్సులు మాత్రమే తిప్పాలని యోచనలో అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. రిజర్వేషన్లలో కూడా నాన్ ఏసీ బస్సులు ఉండడంతో పలు ప్రాంతాలకు వెళ్లే వారు ముందస్తుగా రిజర్వేషన్లు చేసుకునేందుకు సిద్దమవుతున్నారు. శీతల ప్రదేశంలో కరోనా వైరస్ వ్యాప్తి ఉంటుందని చెబుతుండడంతో ఏసీ బస్సులను తిప్పడంపై అధికారులు సందిగ్ధంలో ఉన్నారు. ఒకవేళ లాక్‌డౌన్ పొడిగించినా రిజర్వేషన్ సొమ్మును తిరిగి ఇస్తారన్న ఉద్దేశ్యంతో సుదూర ప్రాంతాలకు వెళ్లే వారు రిజర్వేషన్ చేయించుకుంటున్నారు. జనతా కర్ఫ్యూ నాటి నుంచి బస్సులు రోడెక్కక డిపోలకే పరిమితమయ్యాయి. జిల్లాలో మొత్తం 857 బస్సు సర్వీసులు ఉన్నాయి. 440 బస్సులు పల్లె వెలుగు కాగా, మిగతా బస్సులు అమరావతి, ఇంద్ర, సూపర్ డీలక్స్, అల్ర్టా, ఎక్స్‌ప్రెస్ సర్వీసులు ఉన్నాయి. రోజూ రూ.1.15 కోట్లు దాకా రాబడి వచ్చేది. 15 రోజులుగా బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి.
దూర ప్రాంతాలకు: కడప నుంచి విజయవాడ, చెన్నై, బెంగుళూరు, హైదరాబాదు ప్రాంతాలకు రోజూ సూపర్ డీలక్స్, ఆల్ర్టా, ఏసీ బస్సులు తిరుగుతుండేవి. అయితే ఇప్పుడు నాన్ ఏసీ బస్సులు మాత్రమే తిప్పే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో 97 సూపర్‌లగ్జరీ, 47 ఆల్ర్టా బస్సులు రోడ్డెక్కే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. కరోనా వైరస్ కారణంగా జనతా కర్ఫ్యూ ముందు నుంచే సుదూర పప్రాంతాలకు వెళ్లే ఏసీ బస్సుల్లో ప్రయాణికులు సంఖ్య తగ్గింది. లాక్‌డౌన్ ఎత్తేస్తే అన్ని సవ్యంగా జరిగితే దశల వారీగా నాన్ ఏసీ బస్సులను తిప్పేందుకు అధికార యంత్రాంగం సిద్దమవుతోంది.