ఆర్‌జీయూకేటీ సెట్ ఫలితాలు విడుదల
ABN , First Publish Date - 2020-12-13T09:25:52+05:30 IST
రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జి టెక్నాలజీస్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (ఆర్‌జీయూకేటీ సెట్-2020) ఫలితాలు

జనవరి 4 నుంచి కౌన్సెలింగ్.. 18 నుంచి క్లాసులు
గ్రామీణ, ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులకు వెయిటేజీ
విద్యామంత్రి ఆదిమూలపు సురేశ్ వెల్లడి
సివిల్స్ లక్ష్యం
ట్రిపుల్ ఐటీలో సీఎ్‌ససీ లేదా ఈసీఈ బ్రాంచ్ ఎంపిక చేసుకుంటా. కోర్సు పూర్తయిన తర్వాత సివిల్స్ లక్ష్యం. ట్రిపుల్ ఐటీ కోసం రెండు నెలలు కోచింగ్ సెంటర్‌లో శిక్షణ తీసుకున్నా
జకీర్ హుస్సేన్, 99 మార్కులు, కడప జిల్లా
అమరావతి, డిసెంబరు 12(ఆంధ్రజ్యోతి): రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జి టెక్నాలజీస్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (ఆర్‌జీయూకేటీ సెట్-2020) ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ శనివారం విజయవాడలో ఈ ఫలితాలను విడుదల చేశారు. నూజివీడు, ఇడుపులపాయ, శ్రీకాకుళం, ఒంగోలుల్లోని ట్రిపుల్ ఐటీల్లో అడ్మిషన్ల నిమిత్తం ఈ నెల 5న తెలుగు రాష్ట్రాల్లోని 638 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు. మొత్తం 85,755 మంది విద్యార్థులు(బాలురు 46,629, బాలికలు 39,126 మంది) హాజరయ్యారు. గుంటూరు జిల్లా దాచేపల్లిలోని ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థి గుర్రం వంశీకృష్ణ, కడప జిల్లా ప్రొద్దుటూరు మండలానికి చెందిన ప్రైవేటు పాఠశాల విద్యార్థి పోతుగంటి జకీర్ హుస్సేన్ 99 మార్కులతో టాపర్లుగా నిలిచారు. వీరిద్దరిదీ బీసీ-బి కేటగిరీ. అలాగే, శ్రీకాకుళం జిల్లా రాజాం మండలంలోని డోలపేట జడ్పీ హైస్కూల్ విద్యార్థి ఇనుముల శివశంకర్ వర యుగంధర్ 98 మార్కులు సాధించాడు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులు టాప్ ర్యాంకులు సాధించడం శుభపరిణామమని మంత్రి సురేశ్ అన్నారు. ప్రాథమిక కీపై 1900 అభ్యంతరాలు రాగా, వాటిలో రెండింటిని(2 మార్కులు) పరిగణనలోనికి తీసుకున్నట్లు తెలిపారు. జనవరి 4 నుంచి కౌన్సెలింగ్, 18 నుంచి తరగతులు మొదలవుతాయని మంత్రి వెల్లడించారు.
విద్యార్థులు ఆర్‌జీయూకేటీ వెబ్‌సైట్లో హాల్‌టికెట్ నెంబరు నమోదు చేసి తమ ర్యాంకు కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు.గ్రామీణ ప్రాంతాలు, ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు వెయిటేజీ కల్పించి అడ్మిషన్లు చేపట్టనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆర్‌జీయూకేటీ చాన్సెలర్ ప్రొఫెసర్ కేసీ రెడ్డి, వీసీ ప్రొఫెసర్ కె.హేమచంద్రారెడ్డి, సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ డి.హరినారాయణ పాల్గొన్నారు.
కోర్టు తుది తీర్పు మేరకు ఇంటర్ అడ్మిషన్లు..
కాగా, ఇంటర్‌లో అడ్మిషన్లు పారదర్శకంగా జరిగేందుకే ఆన్‌లైన్‌లో చేపట్టాలని నిర్ణయించామని, ఇది గిట్టని కార్పొరేట్ కాలేజీలు కోర్టుకు వెళ్లాయని మంత్రి సురేశ్ చెప్పారు. తుది తీర్పునకు అనుగుణంగా నడుచుకుంటామన్నారు. నిబంధనలు పాటించకుండా తాత్కాలిక అఫిలియేషన్‌తో నడుస్తున్న ప్రైవేట్ జూనియర్ కాలేజీల గుర్తింపును వచ్చే విద్యా సంవత్సరం నుంచి రద్దు చేస్తామని హెచ్చరించారు. కొన్ని కాలేజీలు గత పదేళ్లుగా లీజు భవనాల్లో రేకుల షెడ్లలో నడుస్తున్నాయన్నారు.