రిహార్సల్స్‌

ABN , First Publish Date - 2020-12-26T08:31:57+05:30 IST

కరోనా టీకా కార్యక్రమ సన్నద్ధతను పరీక్షించే ప్రయత్నాలకు కేంద్రం శ్రీకారం చుట్టింది.

రిహార్సల్స్‌

  • 4 రాష్ట్రాల్లో వ్యాక్సిన్‌పై ‘డ్రై రన్‌’కు సన్నాహాలు
  • 28, 29 తేదీల్లో నిర్వహిస్తాం: కేంద్రం
  • మన రాష్ట్రంలో కృష్ణా జిల్లా ఎంపిక 
  • అసోం, పంజాబ్‌, గుజరాత్‌ల్లోనూ నిర్వహణ
  • వ్యాక్సినేషన్‌ సన్నద్ధతపై కేంద్రం పర్యవేక్షణ 
  • ఆ నాలుగు రాష్ట్రాలకూ మార్గదర్శకాలు జారీ
  • వ్యాక్సిన్‌పై రిహార్సల్స్‌

న్యూఢిల్లీ/అమరావతి/విజయవాడ, డిసెంబరు 25(ఆంధ్రజ్యోతి): కరోనా టీకా కార్యక్రమ సన్నద్ధతను పరీక్షించే ప్రయత్నాలకు కేంద్రం శ్రీకారం చుట్టింది. వ్యాక్సినేషన్‌ కోసం ప్రత్యేకంగా రూపొందించిన కోవిన్‌ (కొవిడ్‌ వ్యాక్సిన్‌ ఇంటెలిజెన్స్‌ నెట్‌వర్క్‌)లో డేటా ఎంట్రీ నుంచి.. వ్యాక్సిన్‌ సరఫరా, టీకా కార్యక్రమంలో పాల్గొనే సభ్యుల నియామకం, సెషన్‌ సైట్లలో మాక్‌డ్రిల్‌ దాకా పర్యవేక్షించేందుకు సిద్ధమైంది. అందులో భాగంగా.. ఏపీ, గుజరాత్‌, అసోం, పంజాబ్‌లలో డ్రైరన్‌ నిర్వహించనున్నట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటించింది. ఈ 4 రాష్ట్రాల్లో రెండేసి జిల్లాల చొప్పున ఎంపిక చేసి.. సోమ, మంగళవారాల్లో (28, 29 తేదీల్లో) డ్రై రన్‌ నిర్వహించనున్నారు. డ్రై రన్‌ అంటే.. టీకా కార్యక్రమ సంసిద్ధతను అంచనా వేయడానికి ఉపయోగ పడే ప్రక్రియ. వ్యాక్సినేషన్‌ సందర్భంగా క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సవాళ్లను, తీసుకోవలసిన ముందస్తుజాగ్రత్తలను అంచనా వేయడానికి ఈ ప్రక్రియ దోహదం చేస్తుంది. వ్యాక్సినేటర్లు, వ్యాక్సిన్లు ఇచ్చే వైద్య సిబ్బంది అనుసరించాల్సిన విధి విధానాలపై కూడా ఈ డ్రై రన్‌లో అధ్యయనం చేస్తారు. టీకా కార్యక్రమం జరిగే వైద్య కేంద్రాలు శుభ్రంగా ఉన్నాయా లేవా? కరోనా వ్యాప్తి నిరోధానికి తీసుకుంటున్న జాగ్రత్తలు, టీకా వేసే చోట ప్రజల నియంత్రణ (భౌతిక దూరం పాటించేలా చేయడం) వంటి అంశాలను కూడా అధికారులు పర్యవేక్షిస్తారు. ఫీడ్‌ బ్యాక్‌ను రాష్ట్ర, కేంద్ర ఆరోగ్య శాఖలకు ఇస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఈ రెండు రోజుల్లో వ్యాక్సిన్‌ ఇవ్వడం మినహా  మిగిలిన అన్ని దశలనూ అధికారులు పర్యవేక్షిస్తారన్నమాట. ఈ మేరకు.. డ్రై రన్‌ మార్గదర్శకాలను, చెక్‌లి్‌స్టను ఎంపిక చేసిన నాలుగు రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్యశాఖ జారీ చేసింది.


కృష్ణాలో 5 ఆస్పత్రుల్లో...: కరోనా వ్యాక్సినేషన్‌ డ్రై రన్‌ను కృష్ణాజిల్లాలోని ఐదు ఆస్పత్రుల్లో సోమ, మంగళవారాల్లో చేపట్టేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. విజయవాడ ప్రభుత్వాస్పత్రి, కంకిపాడు మండల పరిధిలోని ఉప్పులూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, విజయవాడ ప్రకాశ్‌నగర్‌లోని అర్బన్‌ హెల్త్‌ కేర్‌ సెంటర్‌ (ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రం), తాడిగడపలోని గ్రామ సచివాలయం/ హైస్కూలు, విజయవాడలోని పూర్ణా హార్ట్‌ కేర్‌ ఇనిస్టిట్యూట్‌ (ప్రైవేటు ఆస్పత్రి)లో డ్రై రన్‌ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఒక్కో ఆస్పత్రి పరిధిలో 25మందికి డ్రై వ్యాక్సిన్‌ (కరోనా టీకా లేకుండానే మాక్‌ డ్రిల్‌) ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఎంపిక చేసిన ఆస్పతిలో ఒక మెడికల్‌ ఆఫీసర్‌, నలుగురు వ్యాక్సినేషన్‌ సిబ్బంది అందుబాటులో ఉంటారు.  యూరాలజిస్ట్‌, కార్డియాలజిస్ట్‌, గైనకాలజిస్ట్‌ తదితర వైద్యనిపుణులను కూడా అందుబాటులో ఉంచేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. కాగా, డ్రై రన్‌ కోసం వెబ్‌ ఆధారిత సాఫ్ట్‌వేర్‌ను రూపొందించినట్లు వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్‌ కాటంనేని భాస్కర్‌ పేర్కొన్నారు. కాగా.. కరోనా వ్యాక్సిన్‌ వేసే వైద్య సిబ్బందికి దేశవ్యాప్తంగా జాతీయ స్థాయి శిక్షణ కార్యక్రమం చేపట్టగా ఇప్పటికే 2,360 మంది శిక్షణ పొందినట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. తొలి విడతలో భాగంగా.. ఆరోగ్య సిబ్బందికి, ఇతరత్రా కరోనా యోధులకు, యాభై ఏళ్లు పైబడినవారికి.. ఇలా ఎంపిక చేసిన 30 కోట్ల మందికి వ్యాక్సిన్‌ వేసేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. 

Updated Date - 2020-12-26T08:31:57+05:30 IST