-
-
Home » Andhra Pradesh » Registration Value Final
-
రిజిస్ట్రేషన్ విలువే ఫైనల్!
ABN , First Publish Date - 2020-11-25T09:27:18+05:30 IST
రాష్ట్రంలోని పట్టణ స్థానిక సంస్థల ఆదాయాన్ని గణనీయంగా పెంచే ఆర్డినెన్స్‌కు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఆమోదం తెలిపిన దరిమిలా.. ఇకపై విధించాల్సిన ఆస్తి పన్ను మదింపు, నిర్ధారణకు సంబంధించిన విధివిధానాలను పురపాలక శాఖ మంగళవారం విడుదల చేసింది. పట్టణాల్లో ఆస్తి పన్ను మదింపులో మార్పులపై ఓపక్క రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున వ్యతిరేకత వ్యక్తమవుతున్నప్పటికీ ఏమాత్రం ఖాతరు చేయలేదు. ‘లెవీ అండ్ అసె్‌సమెంట్ ఆఫ్ ప్రాపర్టీ

దాని ఆధారంగానే పట్టణాల్లో ఆస్తి పన్ను నిర్ధారణ
ఇళ్లకు మూల విలువలో 0.10ు-0.50ు వరకు
నివాసేతర భవనాలకు 0.20-2 శాతం మధ్య
భవనాలను వర్గీకరించి పన్ను నిర్ధారణ
మార్పుచేర్పులు గుర్తించేందుకు నెలవారీ పరిశీలన
పన్ను మదింపులో లోటుపాట్లుంటే మళ్లీ మదింపు
5 అర్ధ సంవత్సరాల వెనుక నుంచి పన్ను వసూలు
పురపాలక, రిజిస్ట్రేషన్ల డేటాబేస్‌ల అనుసంధానం
ప్రతి డోర్ నంబరుకూ పదంకెల ‘పీటీవోఎన్’
ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి కొత్త పన్నుల విధానం
దాని ఆధారంగానే పట్టణాల్లో ఆస్తి పన్ను నిర్ధారణ
ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి కొత్త విధానం
పట్టణాల్లో ఆస్తి పన్ను మార్గదర్శకాలు జారీ
అమరావతి, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని పట్టణ స్థానిక సంస్థల ఆదాయాన్ని గణనీయంగా పెంచే ఆర్డినెన్స్‌కు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఆమోదం తెలిపిన దరిమిలా.. ఇకపై విధించాల్సిన ఆస్తి పన్ను మదింపు, నిర్ధారణకు సంబంధించిన విధివిధానాలను పురపాలక శాఖ మంగళవారం విడుదల చేసింది. పట్టణాల్లో ఆస్తి పన్ను మదింపులో మార్పులపై ఓపక్క రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున వ్యతిరేకత వ్యక్తమవుతున్నప్పటికీ ఏమాత్రం ఖాతరు చేయలేదు. ‘లెవీ అండ్ అసె్‌సమెంట్ ఆఫ్ ప్రాపర్టీ ట్యాక్స్ రూల్స్- 2020’ పేరిట పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి జె.శ్యామలరావు ఈ మార్గదర్శకాలను జారీచేశారు. వీటి ప్రకారం.. రాష్ట్రంలోని అన్ని నగర పంచాయతీలు, పురపాలక సంఘాలు, నగర పాలక సంస్థల్లోని భవనాలు, ఖాళీ స్థలాలన్నిటికీ.. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి వాటి మూల విలువ (స్టాంపులు-రిజిస్ట్రేషన్ల శాఖ నిర్ణయించే కేపిటల్ వాల్యూ) ఆధారంగా ఆస్తి పన్నును నిర్ణయిస్తారు. ఇప్పటి వరకూ వాటి వార్షిక అద్దె విలువ ప్రాతిపదికన దీనిని విధిస్తున్నారు. ఈ విధానానికి సంబంధించి భవనాల విస్తీర్ణాన్ని చదరపుటడుగుల్లోనూ, భూములు- ఇళ్ల స్థలాలను చదరపు గజాల్లోనూ పరిగణనలోకి తీసుకుంటారు. ఇందుకోసం ప్రతి పట్టణం లేదా నగరాన్ని అవి ఉండే ప్రదేశాలు- అక్కడి వసతులు, సంస్థలు, కార్యాలయాల ఆధారంగా కొన్ని ప్రాదేశిక జోన్లుగా విభజిస్తారు. కట్టడాలను వాటి స్వరూపం (ఆర్‌సీసీ, రేకులు, పెంకులు, గుడిసెలు వంటి 7 రకాలు), వినియోగం (నివాస, నివాసేతర, మిక్స్‌డ్- వాటి వయస్సు, ప్లింత్ ఏరియా) మొదలైన అంశాల ఆధారంగా విభజించి, వాటి ప్రాతిపదికగా ఆస్తి పన్నును మదింపు చేస్తారు.
ప్రధానాంశాలివీ..
వివిధ స్థిరాస్తుల ఆస్తి పన్నును.. నివాస భవనాలకైతే వాటి మూల విలువలో కనిష్ఠంగా 0.10 శాతం.. గరిష్ఠంగా 0.50 శాతం వరకు.. అదే నివాసేతర భవనాలకైతే కనిష్ఠంగా 0.20 శాతం.. అత్యధికంగా 2 శాతం లోపు నిర్ణయించాలి. ఖాళీ భూములు, ఇళ్ల స్థలాలకైతే మున్సిపాలిటీల్లో 0.20 శాతం, నగర పాలక సంస్థల్లోనైతే 0.50 శాతంగా నిర్ధారించాలి. ఏయే ఆస్తులకు ఎంతెంత శాతం మేర ఆస్తి పన్ను విధించాలో ఆయా పట్టణ స్థానిక సంస్థలు తీర్మానం చేశాక.. మున్సిపల్ కమిషనర్లు వాటిని ప్రాపర్టీ ట్యాక్స్ బోర్డుకు పంపాలి. ఆ సంస్థ వాటిని అదే స్థాయి పట్టణ సంస్థల్లోని ఆస్తి పన్నుతో బేరీజు వేసి, తన సూచనలతో తిరిగి పంపుతుంది. వీటిపై ప్రజలు అభ్యంతరాలు తెలిపేందుకు నెల గడువిచ్చి, తర్వాత 7 రోజుల్లో వాటిని పరిశీలించి.. తదనుగుణమైన సిఫారసులను సంబంధిత కౌన్సిల్ లేదా కార్పొరేషన్ ముందుంచుతారు. అనంతరం 10 రోజుల్లో ప్రత్యేక భేటీ నిర్వహించి, ప్రాపర్టీ ట్యాక్స్‌లను ఖరారు చేస్తారు. 2021-22 నుంచి పైన పేర్కొన్న విధంగా ఆస్తి పన్నులను నిర్ణయించాలి. స్టాంపులు-రిజిస్ర్టేషన్ల శాఖ ఆయా ఆస్తుల రిజిస్ట్రేషన్ విలువలను సవరించినట్లయితే తదనుగుణంగా వాటికవే (ఆటోమేటిగ్గా) మార్పుచేర్పులకు లోనవుతాయి. మారిన ప్రాపర్టీ ట్యాక్స్‌లు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయి.
అనధికార నిర్మాణాలకు పెనాల్టీలు..
సంబంధిత పట్టణ సంస్థ ఆమోదం లేకుండా కట్టిన అనధికార నిర్మాణాల నుంచి కూడా వాటి మూల విలువలో నిర్ణీత మొత్తాలను పెనాల్టీలుగా వసూలు చేస్తారు. ఆ విధంగా అవి క్రమబద్ధీకరణో లేదా కూల్చివేతకో గురయ్యే వరకూ కొనసాగిస్తారు. మంజూరైన ప్లాన్‌లో 10 శాతం అతిక్రమణలుంటే ఆస్తి పన్నులో 25 శాతాన్ని పెనాల్టీగా విధిస్తారు. నిబంధనల ఉల్లంఘనలు 10 శాతాన్ని మించితే 50 శాతం, అనధికార అంతస్థులకు 100 శాతం, పూర్తిగా అనధికార కట్టడాలకు 100 శాతాన్ని జరిమానా రుసుముగా వసూలు చేస్తారు. నూతన ఆస్తి పన్ను విధానంలో పొరపాట్లు, లోపాలు చోటు చేసుకుని, పట్టణ స్థానిక సంస్థల ఆదాయానికి నష్టం కలుగకుండా నివారించేందుకు వాటి కమిషనర్లు నెలవారీ పరిశీలనలు జరుపుతారు. ఆ నెలలో జరిగిన నిర్మాణాలు, వాటిల్లో మార్పుచేర్పులు, విస్తరణ, వినియోగంలో మార్పులతోపాటు వాటి యజమానుల పేర్లలో ఏమైనా మార్పులున్నాయేమో గమనిస్తారు. వాటిలో ఉంటోంది యజమానులా, ఇతరులా అనే అంశంపైనా దృష్టి సారిస్తారు. ఆయా వివరాలను ఎప్పటికప్పుడు అసె్‌సమెంట్ రిజిస్టర్లలో నమోదు చేస్తారు. ఏ ఆస్తుల మదింపులోనైనా లేక వాటికి విధించిన ఆస్తి పన్నుల్లోనైనా తేడాలున్నట్లుగా కమిషనర్లు అనుమానిస్తే అంతకు 5 అర్ధ వార్షిక సంవత్సరాలు వెనక్కి వెళ్లి, వాటిని పునఃమదింపు చేసి, అవకతవకలు నిర్ధారణ అయితే.. ఆ సమయం నుంచి తేడా పడిన మొత్తాలను వసూలు చేస్తారు.
పురపాలక శాఖ, స్టాంపులు-రిజిస్ట్రేషన్ల శాఖల డేటాబే్‌సల మధ్య సమన్వయం ఉండేలా చూస్తారు. పట్టణ ప్రాంతాల్లోని ప్రతి ఒక్క డోర్ నంబర్‌ను గుర్తించి, దానికి ప్రత్యేకమైన పదంకెల ‘ప్రాపర్టీ ట్యాక్స్ ఐడెంటిఫికేషన్ నంబర్ (పీటీవెఓన్)’ను కేటాయిస్తారు. ఎవరన్నా పన్ను మదింపుదారులు తమకు ఎక్కువ ప్రాపర్టీ ట్యాక్స్‌ను విధించారని భావిస్తే దానిపై మున్సిపల్ కమిషనర్‌కు ఫిర్యాదు చేసుకోవచ్చు. ప్రతి పిటిషన్‌ను ప్రత్యేక రిజిస్టర్‌లో కమిషనర్లు నమోదు చేయాలి. పిటిషనర్ల వాదనలను ఆలకించి, వాటిని అనుసరించి పన్నులో మార్పుచేర్పులు చేయాలి. ఒకవేళ కమిషనర్లు తీసుకున్న నిర్ణయాలు సంతృప్తి కలిగించకపోతే.. అప్పిలేట్ కమిషనర్ కం రీజినల్ డైరెక్టర్‌కు ఫిర్యాదు చేసుకోవచ్చు.
తక్కువగా ఉంటే పెంచుతారు..
మూల విలువ ఆధారిత ఆస్తి పన్ను విధింపు విధానంలోనూ పురపాలక శాఖ తనదైన ‘చమత్కారం’ చూపింది! ప్రతిపాదిత ఆస్తి పన్ను ప్రస్తుతం వసూలు చేస్తున్న ప్రాపర్టీ ట్యాక్స్ కంటే తక్కువగా ఉన్నట్లయితే ఆ మేరకు ప్రస్తుత పన్నును పెంచుతారు. అధికంగా ఉంటే మాత్రం తగ్గించబోరు. ప్రస్తుత ప్రాపర్టీ ట్యాక్స్ కంటే ప్రతిపాదిత పన్ను మొత్తం 15 శాతం కంటే ఎక్కువ ఉంటే పెంపుదలను 15 శాతంగా ఖరారు చేశారు. ఒకవేళ ఆ వ్యత్యాసం 10 శాతం నుంచి 15 శాతం మధ్య ఉంటే వాస్తవ గ్యాప్‌ను భర్తీ చేయాలి. 10 శాతం లోపు ఉంటే మాత్రం 10 శాతం పెంచుతారు. ఎక్కడన్నా ప్రతిపాదిత ఆస్తి పన్ను కంటే ఇప్పటి ప్రాపర్టీ ట్యాక్సే ఎక్కువగానో లేదా సమానంగానో ఉంటే మాత్రం ఆ మేరకు తగ్గించరు. పైగా.. ప్రస్తుత పన్నును 10 శాతం మేర పెంచి, నిర్ణయిస్తారు.
మినహాయింపులిలా..
- 375 చ.అడుగుల లోపు భవనాలకు వార్షిక ఆస్తి పన్ను రూ.50. అయితే అందులో దాని యజమానులు నివసిస్తూ ఉండాలి.
- మాజీ సైనికులు, వారి వితంతువులు, ప్రస్తుతం సైన్యంలో పని చేస్తున్న వారికి చెందిన గృహాలకు ఆస్తి పన్ను నుంచి మినహాయింపు. అయితే ప్రస్తుత సైనికుల గృహాల్లో వారి కుటుంబాలే నివసిస్తూ ఉండాలి.
- ప్రార్థనా స్థలాలు, ఆధ్యాత్మిక ప్రదేశాలు, ధర్మసత్రాలు, గుర్తింపు కలిగిన సంస్థల ఆధ్వర్యంలో నడిచే విద్యా సంస్థలు (10వ తరగతి వరకు), వసతిగృహాలకు దాతలిచ్చిన ఆస్తులు, స్వచ్ఛంద సేవాసంస్థలు, మైనారిటీ సంస్థల ఆధ్వర్యంలో వృద్ధులు, అనాథలు, దివ్యాంగులు, వ్యాధిగ్రస్తులు, వీధిబాలుర కోసం నడిచే సంస్థలు, ఉచిత ప్రవేశం కల్పించే గ్రంథాలయాలు, క్రీడామైదానాలు, పురాతన వస్తుసంపదను భద్రపరిచే కట్టడాలు, సేవానిరతితో పని చేసే ఆస్పత్రులు/వైద్యశాలలు, రైల్వే శాఖ ఆస్పత్రులు/డిస్పెన్సరీలు, స్థానిక పట్టణ సంస్థల భవనాలు, నీటిపారుదల శాఖ ఆస్తులు మొదలైనవాటికి ఆస్తి పన్నులో 50 శాతం మినహాయింపు లభిస్తుంది.