సైలెంట్‌గా బాదుడు

ABN , First Publish Date - 2020-07-27T08:48:50+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ర్టేషన్‌ ధరల పెంపునకు రంగం సిద్ధం చేసింది. అది కూడా ప్రజలకు చెప్పకుండా, నిశ్శబ్దంగా భారం మోపేందుకు ..

సైలెంట్‌గా బాదుడు

ప్రజల ముందు  పెట్టకుండానే..

అభ్యంతరాలు స్వీకరించకుండానే

రిజిస్ర్టేషన్‌ ధరల పెంపునకు రంగం సిద్ధం 

ఇప్పటికే అంతంతమాత్రంగా లావాదేవీలు

పెంచితే ఈ రంగం కుదేలేనంటున్న నిపుణులు


అమరావతి, జూలై 26(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ర్టేషన్‌   ధరల పెంపునకు రంగం సిద్ధం చేసింది. అది కూడా ప్రజలకు చెప్పకుండా, నిశ్శబ్దంగా భారం మోపేందుకు సర్వసన్నద్ధం అయినట్లు సమాచారం. సాధారణంగా రిజిస్ర్టేషన్‌ చార్జీలు పెంచేందుకు పెద్ద ప్రక్రియ ఉంటుంది. దీనిని ప్రజాస్వామ్యయుతంగా చేస్తారు. ఏయే సర్వే నంబర్లు, ఏ ప్రాంతాల్లో ఎంతెంత విలువలు పెంచాలని నిర్ణయం తీసుకుంటారో... వాటన్నింటినీ రిజిస్ర్టేషన్‌శాఖ వెబ్‌సైట్‌లో పెడతారు. ప్రజలు వాటిని చూసుకోవచ్చు. 15 రోజుల ముందే ఇలా వెబ్‌సైట్‌లో పెట్టి ప్రజల నుంచి వచ్చే అభ్యంతరాలను స్వీకరిస్తారు. ఉదాహరణకు ఒక సర్వే నంబరులో గతంలో చదరపు అడుగుకు రూ.10వేల విలువ ఉంటే... ఇప్పుడు దానిని రూ.12వేలు చేయాలనుకున్నామని పెడతారు. ఈ పెంపు సరికాదని, అది వాస్తవాన్ని ప్రతిబింబించడం లేదని, లేకుంటే అక్కడ లావాదేవీలు కూడా లేవని... ప్రజలు ఎవరైనా ఇలా అభ్యంతరాలు తెలపవచ్చు. ఇలా అభ్యంతరాలు వ్యక్తమైన వాటిని మళ్లీ చార్జీల పెంపు కమిటీ ముందు పెట్టి, అప్పుడు పెంపుపై తుది నిర్ణయం తీసుకుంటారు. కానీ ఇప్పుడు ఆ ప్రక్రియను నామకార్థంగా చేసి ధరల పెంపునకు రంగం సిద్ధం చేసేశారని తెలుస్తోంది. ధరల పెంపుపై 15 రోజుల ముందు వెబ్‌సైట్‌లో ప్రజలకు అందుబాటులో ఉంచకుండానే... మరో నాలుగు రోజుల్లో, అంటే ఆగస్టు ఒకటో తేదీ నుంచి రిజిస్ర్టేషన్‌ చార్జీలు పెంచేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ప్రజలకు అధికారికంగా చెప్పకుండా చాపకింద నీరులా చార్జీల పెంపుపై నిర్ణయం తీసుకునేందుకు అన్ని ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. 


కరోనా కాలంలో ధరలెక్కడ పెరిగాయి?

రిజిస్ర్టేషన్‌ చార్జీలను సాధారణంగా బహిరంగ మార్కెట్లో పెరిగే ధరలకు అనుగుణంగా పెంచుతుంటారు. పట్టణ ప్రాంతాల్లో ఏడాదికోసారి, గ్రామీణ ప్రాంతాల్లో రెండేళ్లకు ఒకసారి విలువల పెంపును సమీక్షిస్తారు. అయితే బహిరంగ మార్కెట్‌లో పెరుగుదల లేనప్పుడు రిజిస్ర్టేషన్‌ చార్జీలు కూడా పెంచరు. 2018-2019లో విలువలు పెంచలేదు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలి ఏడాది కాలంలో భూముల ధరలు పెరగలేదు. పైగా... ఇంకా తగ్గాయి. రాజధాని మార్పు ప్రకటనలు, ఇసుక కొరత, ఉద్యోగ కల్పన లేకపోవడం, నిర్మాణ కార్యకలాపాలు స్తంభించిపోవడం తదితర కారణాలతో రియల్‌ ఎస్టేట్‌ రంగం పరిస్థితి అంతంతమాత్రంగానే ఉంది. వ్యవసాయ భూములు, గ్రామాల్లో స్థలాలు, లే అవుట్లతోపాటు పట్టణాలు, నగరాల్లోనూ అదే పరిస్థితి నెలకొంది.


మరోవైపు గత నాలుగు నెలల నుంచి దీనికి కరోనా తోడైంది. ఇక పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు రిజిస్ర్టేషన్‌ చార్జీలను వీలైతే తగ్గించాలి కానీ...పెంచడం అన్నది ఏమాత్రమూ సరికాదన్న అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి. సామాన్యుడి నుంచి రైతు వరకూ అందరిపై ప్రభావం చూపే ఈ రిజిస్ర్టేషన్‌ చార్జీలను అవసరమైతే తగ్గించి.. లావాదేవీలు పెంచేదిశగా వ్యూహాం ఉండాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అలా చేయకపోగా ఇప్పుడు కరోనా కాలంలోనూ రిజిస్ర్టేషన్‌ చార్జీల పెంపుపై కసరత్తు ప్రారంభించడం సరికాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 

Updated Date - 2020-07-27T08:48:50+05:30 IST