పోస్టు ముట్టుకొంటే ‘షాక్’!
ABN , First Publish Date - 2020-08-16T08:30:19+05:30 IST
విద్యుత్ శాఖలో షిఫ్ట్ ఆపరేటర్ల పోస్టులను కూరగాయల మాదిరిగా అమ్ముకొంటున్నా అధికారులు మౌనముద్ర వహిస్తున్నారని ఆరోపణలు గుప్పుమంటున్నాయి...

- షిఫ్ట్ ఆపరేటర్ పోస్టుకు 10లక్షలు
- అధికార నేతలు చెబితేనే చాన్స్
- భర్తీలో జోక్యం వద్దని సీఎం చెప్పినా
- విద్యుత్‌శాఖలో వారిదే మొత్తం హవా
- గగ్గోలు పెడుతున్న యూనియన్లు
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
విద్యుత్ శాఖలో షిఫ్ట్ ఆపరేటర్ల పోస్టులను కూరగాయల మాదిరిగా అమ్ముకొంటున్నా అధికారులు మౌనముద్ర వహిస్తున్నారని ఆరోపణలు గుప్పుమంటున్నాయి. పారదర్శకంగా ఈ పోస్టులు భర్తీ చేయాలని ఉన్నతాధికారులు ఒక ఆదేశం జారీచేసి చేతులు దులుపుకొన్నారని, కిందిస్థాయి అధికారులు మాత్రం స్థానిక ఎమ్మెల్యే చెబితేనే పోస్టు ఇస్తామని తెగేసి చెబుతుండటంతో భారీగా బేరసారాలు చోటు చేసుకొంటున్నాయని యూనియన్లు గగ్గోలు పెడుతున్నాయి. ఒక్కో పోస్టుకు రూ.పది లక్షలు వంతున ఎమ్మెల్యేలు, మంత్రులు వసూలు చేస్తున్నారని ఆరోపణలు రావడంతో, కొంత కాలంక్రితం ఈ పోస్టుల భర్తీని నిలిపివేశారు. రాజకీయ ఒత్తిడి పెరగడంతో తిరిగి వీటి భర్తీకి నిర్ణయం తీసుకొన్నారు.
పారదర్శకంగా, పక్షపాతరహితంగా వీటిని భర్తీ చే యాలని ఆదేశిస్తూ ఇంధనశాఖ కార్యదర్శి నాగులపల్లి శ్రీకాంత్ ఇ టీవల డిస్కంలకు ఆదేశాలు జారీచేశారు. దీంతో రాజకీయ సిఫారసులకు తెర లేచింది. రాతపరీక్ష లేదా కరెంటు పోల్ ఎక్కడంలో నైపుణ్యం వంటిది ఏదైనా పరీక్షపెట్టి ఆ ప్రకారం ఎంపికలు చేసి ఉంటే బాగుండేదని, ఏ విధానం లేకపోవడంతో వసూళ్లకు అవకాశం ఇచ్చినట్లయిందని యూనియన్ నేతలు అంటున్నారు.
కోర్టు చెప్పినా...
విద్యుత్ సబ్ స్టేషన్లలో దీర్ఘకాలంగా పనిచేస్తున్న వాచ్‌మెన్లను షిఫ్ట్ ఆపరేటర్ పోస్టుల భర్తీకి పరిశీలనలోకి తీసుకోవాలని ఇటీవల కోర్టు ఉత్తర్వు ఇచ్చింది. ఒక డిస్కం సంస్థ సీఎండీని కలిసి ఒక యూనియన్ నేతలు ఈ విషయంపై విన్నవించారు. ‘‘వాచ్‌మెన్లను వెళ్లి స్థానిక ఎమ్మెల్యేను కలిసి వారితో చెప్పించుకోమని చెప్పండి. ఎమ్మెల్యే చెబితేనే మేం ఇస్తాం. అంతకుమించి మేం ఏమీ చేయలేం’’ అని ఆ అధికారి వారికి తేల్చిచెప్పారు. రాజకీయ నాయకులు ఒక్కో పోస్టుకు రూ.లక్షల్లో అడుగుతున్నారని, అంత ఇచ్చుకొనే స్థోమ త వాచ్‌మెన్లకు లేదని యూనియన్ నేతలు చెప్పారు. ‘‘ఈ విషయం పై నుంచి కిందవరకూ అందరికీ తెలుసు. అది రహస్యమేమీ కాదు. కానీ మేమేం చేయలేం’’ అని ఆయన వారికి బదులిచ్చారు. ఈ వ్యవహారం ముదరడంతో విద్యుత్ కార్మికుల సంఘాలు బహిరంగ ప్రకటనలు విడుదల చేస్తున్నాయి. ‘‘స్థానిక ఎమ్మెల్యేలు, అధికారులు కుమ్మక్కై లక్షల రూపాయలు లంచాలుగా ఇచ్చేవారిని షిఫ్ట్ ఆపరేటర్ పోస్టుల్లో పెడుతున్నారు. ముఖ్యమంత్రి మాటలు నేతి బీరకాయలో నెయ్యి మాదిరిగా ఉన్నాయి. ప్రభుత్వం పారదర్శకంగా ఒక నోటిఫికేషన్ ఇచ్చి నిర్దిష్ట ఎంపిక విధానం ద్వారా ఎంపిక చేస్తే నిజాయితీగా వ్యవహరించినట్లు అవుతుంది. ముఖ్యమంత్రి జోక్యం చేసుకొని విద్యుత్ సంస్థల్లో ఈ అవినీతిని అరికట్టాలని కోరుతున్నాం’’ అని యునైటెడ్ విద్యుత్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. బాల కాశి ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.
ఇవ్వకపోగా కొత్త ఇక్కట్లు..
ఇంధనశాఖ కార్యదర్శి జారీచేసిన ఆదేశాల్లో ప్రతి సబ్ స్టేషన్‌లో సిబ్బంది సంఖ్య నలుగురికి మించరాదని పేర్కొన్నారు. ఇప్పుడు ప్రతి సబ్ స్టేషన్‌కు నలుగురు షిఫ్ట్ ఆపరేటర్లు, ఒక నైట్ వాచ్‌మెన్ ఉన్నారు. ఒక ఈ ఆదేశాలను అడ్డుపెట్టుకొని షిఫ్ట్ ఆపరేటర్లను మాత్రం ఉంచి వాచ్‌మెన్లను పూర్తిగా తీసివేసే ప్రమాదం ఉందని వారు ఆందోళన చెందుతున్నారు. జగన్మోహన్‌రెడ్డి పాదయాత్రలో హామీ ఇచ్చిన ప్రకారం కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ పర్మినెంట్ చేయాలని యునైటెడ్ విద్యుత్ కార్మిక సంఘం డిమాండ్ చేసింది.