‘సీమ’ టెండర్‌.. 3,307.07 కోట్లు

ABN , First Publish Date - 2020-08-18T09:45:01+05:30 IST

పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ నుంచి సంగమేశ్వర బ్యారేజీలోకి రోజూ మూడు టీఎంసీలను ఎత్తిపోసేందుకుగాను జలవనరుల శాఖ చేపట్టిన రాయలసీమ

‘సీమ’ టెండర్‌.. 3,307.07 కోట్లు

  • పనులు దక్కించుకున్న ఎస్‌పీఎంఎల్‌ జేవీ-సుభాష్‌ ప్రాజెక్ట్స్‌
  • రివర్స్‌ టెండరింగ్‌లో 0.88% ఎక్కువకు బిడ్‌
  • రెండో స్థానంలో నిలిచిన నవయుగ ఇన్‌ఫ్రా
  • ఈ పథకంపై సుప్రీంలో తెలంగాణ ఫిర్యాదు
  • ఇప్పటికే కేవియట్లు దాఖలుచేసిన ఏపీ సర్కారు
  • 20న జరగాల్సిన అపెక్స్‌ కౌన్సిల్‌ భేటీ వాయిదా
  • అక్కడే తేల్చుకోవాలని రాష్ట్రప్రభుత్వ నిర్ణయం

రాయలసీమ ఎత్తిపోతల పథకంలో తొలి అంకం ముగిసింది. పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ నుంచి సంగమేశ్వర బ్యారేజీకి రోజుకు మూడు టీఎంసీల చొప్పున ఎత్తిపోసే పనులను రూ.3,307.07 కోట్లకు ఎస్‌పీఎంఎల్‌ జాయింట్‌ వెంచర్‌-సుభాష్‌ ప్రాజెక్ట్స్‌ దక్కించుకున్నాయి. అయితే జాతీచ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్‌జీటీ) ఆదేశాల దృష్ట్యా రాష్ట్రప్రభుత్వం అధికారికంగా టెండర్ల ఖరారు నిర్ణయాన్ని ప్రకటించలేదు..


అమరావతి, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ నుంచి సంగమేశ్వర బ్యారేజీలోకి రోజూ మూడు టీఎంసీలను ఎత్తిపోసేందుకుగాను జలవనరుల శాఖ చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకం టెండర్లను రూ.3,307.07 కోట్లకు ఎస్‌పీఎంఎల్‌ జాయింట్‌ వెంచర్‌- సుభాష్‌ ప్రాజెక్ట్స్‌ దక్కించుకున్నాయి. ఈ సంస్థలు ప్రభుత్వం అంచనా వేసినట్లే రివర్స్‌ టెండరింగ్‌లో 0.88 శాతం ఎక్కువకు బిడ్‌ వేశాయి. 1.40 శాతం ఎక్కువ వేసిన నవయుగ ఇంజనీరింగ్‌ ఇన్‌ఫ్రా రెండోస్థానంలో నిలిచింది. రాయలసీమ ఎత్తిపోతల పథకం అంచనా విలువను రూ.3,278.18 కోట్లుగా జలవనరుల శాఖ అంచనా వేసింది. ఈ విలువకే టెండర్లను పిలిచింది. ఎస్‌పీఎంఎల్‌ జాయింట్‌ వెంచర్‌-సుభాష్‌ ప్రాజెక్ట్స్‌, నవయుగ ఇన్‌ఫ్రా, మ్యాక్స్‌ ఇన్‌ఫ్రా బిడ్లు వేశాయి.


ఈ నెల 12న సాంకేతిక బిడ్లను ఓపెన్‌ చేసి ఈ మూడు కంపెనీలకు సాంకేతికంగా ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టే అర్హత, సామర్థ్యం ఉన్నాయని తేల్చారు. సోమవారం ఫైనాన్స్‌ బిడ్లు తెరిచారు. ఇందులో ఎస్‌పీఎంఎల్‌ జేవీ-సుభాష్‌ ప్రాజెక్ట్స్‌.. 1.90 శాతం ఎక్కువకు అంటే.. 3,340.47 కోట్లకు బిడ్‌ వేసింది. నవయుగ 1.40ు ఎక్కువకు.. రూ.3,324.074 కోట్లకు బిడ్‌ వేసి ఎల్‌-1గా నిలిచింది. మ్యాక్స్‌ ఇన్‌ఫ్రా దాఖలు చేసిన బిడ్‌ అర్హత సాధించలేదని జలవనరుల శాఖ తేల్చింది. ఈ నేపథ్యంలో ఎస్‌పీఎంఎల్‌ జేవీ-సుభాష్‌ ప్రాజెక్ట్స్‌, నవయుగ ఇన్‌ఫ్రాలతో రివర్స్‌ టెండరింగ్‌కు వెళ్లింది. మొదట 0.5 శాతం తగ్గించేందుకు నవయుగ అంగీకరించింది. దీనిపై ఎస్‌పీఎంఎల్‌ జేవీ-సుభాష్‌ ప్రాజెక్ట్స్‌ మరో 0.5 తగ్గించింది. ఈ ధరకు తాము చేయలేమని నవయుగ తేల్చిచెప్పింది. దీంతో.. 0.88 శాతం ఎక్కువకు అంటే.. రూ.3,307.07 కోట్లకు ఎస్‌పీఎంఎల్‌ జేవీ-సుభాష్‌ ప్రాజెక్ట్స్‌కు రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు అప్పగించేందుకు జల వనరుల శాఖ సిద్ధమైంది.


అయితే అధికారికంగా టెండర్లను ఖరారుచేయడానికి ఓ అవరోధం ఉంది. ఈ పథకానికి టెండర్లను పిలిచేందుకు ఆమోదం తెలిపిన జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్‌జీటీ).. వివిధ కారణాల దృష్ట్యా వాటిని ఖరారు చేయొద్దని ఆదేశించింది. రాయలసీమ ఎత్తిపోతల పథకం కింద పోతిరెడ్డిపాడు నుంచి సంగమేశ్వర ఎత్తిపోతలకు రోజూ 3టీఎంసీల చొప్పున వర ద జలాలను శ్రీశైలం కుడి ప్రధాన కాలువలోకి ఎత్తిపోస్తారు. ఇదే సమయంలో ఈ పథకంపై ముందుకు వెళ్లకుండా ఆంధ్రప్రదేశ్‌ను నిలువరించాలని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో, తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ వేసింది. కాంగ్రెస్‌ మాజీ ఎమ్మెల్యే వంశీచంద్‌ రెడ్డి కూడా తెలంగాణ హైకోర్టులో ఈ పథకానికి వ్యతిరేకంగా పిటిషన్‌ వేశారు. ఈ రెండు కోర్టుల్లో ఆంధ్ర ప్రభుత్వం కేవియట్‌ పిటిషన్లు దాఖలు చేసింది. దీంతో తెలంగాణ హైకోర్టు ఆంధ్ర ప్రభుత్వ వివరణ కోరింది. అఫిడవిట్‌ రూపకల్పనలో సర్కారు నిమగ్నమై ఉంది.


అపెక్స్‌ ఆమోదించాకే..!

నిజానికి సీమ స్కీం చేపట్టడానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం జీవో 203ని జారీ చేసిన వెంటనే.. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ)కు తెలంగాణ నీటి పారుదల శాఖ ఫిర్యాదు చేసింది. దీనిపై కేఆర్‌ఎంబీ ఆంధ్రప్రదేశ్‌ను వివరణ కోరింది. డీపీఆర్‌లను సమర్పించాలని, కేంద్ర జల సంఘం ఆమోదం పొందాలని స్పష్టం చేసింది. అపెక్స్‌ కౌన్సిల్‌లోనూ చర్చించి ఆమోదం తీసుకోవాలని తెలిపింది. అయితే ఇది కొత్త పథకం కాదని.. తెలంగాణ తన ప్రాజెక్టులకు శ్రీశైలం జలాశయంలో 800 అడుగుల నుంచే నీరు తీసుకుంటోందని.. పోతిరెడ్డిపాడు నుంచి తాము తీసుకోవడానికి 854 అడుగుల వరకు వేచిచూడాల్సి వస్తోందని.. ఈలోపు ఎడమగట్టు జలవిద్యుత్కేంద్రం నుంచి తెలంగాణ నీటిని తోడేస్తోందని ఆంధ్రప్రదేశ్‌ పేర్కొంది. ఈ పథకంతోపాటు జలవివాదాల పరిష్కారానికి ఈ నెల 5న అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం ఏర్పాటు చేస్తున్నామని.. ఈలోపు ఈ పథకంపైగానీ, కొత్త ప్రాజెక్టులపై గానీ ఉభయరాష్ట్రాలూ ముందుకు వెళ్లొద్దని కేంద్ర జల శక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ లేఖ రాశారు.


ఆ సమావేశంలో బలంగా వాదనలు వినిపించాలని ఆంధ్ర ప్రభుత్వం నిర్ణయించుకుని.. అన్నీ సిద్ధం చేసుకుంది. అయితే 20వ తేదీ తర్వాత ఈ భేటీ ఏర్పాటు చేయాలని తెలంగాణ సీఎం కేసీఆర్‌ జలశక్తి మంత్రిని కోరారు. షెకావత్‌ అంగీకరించి భేటీని వాయిదా వేశా రు. ఇప్పటి వరకూ న్యాయస్థానాల నుంచి సీమ ఎత్తిపోతల పథకంపై ఎలాంటి ఆంక్షలూ లేవు. ఎన్‌జీటీ మాత్రం టెండర్లు పిలవడానికి అంగీకరించింది. అయితే ఖరారు చేయవద్దని నిర్దేశించింది. ట్రైబ్యునల్‌ ఏర్పాటుచేసిన సంయుక్త కమిటీ ఇది కొత్త పథకం కాదని.. పర్యావరణ అనుమతులు అక్కర్లేదని నివేదిక సమర్పించింది కూడా. ఎన్‌జీటీ నిర్ణయం ఎలా ఉన్నా.. అయితే అపెక్స్‌ కౌన్సిల్‌ భేటీలోనే దీనిపై తేల్చుకోవాలని రాష్ట్రప్రభుత్వం గట్టిగా భావిస్తోంది.Updated Date - 2020-08-18T09:45:01+05:30 IST