రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్ట్‌పై ముగిసిన వాదనలు
ABN , First Publish Date - 2020-09-04T03:38:03+05:30 IST
రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్ట్‌పై ఎన్జీటీ చెన్నై బెంచ్ ముందు వాదనలు ముగిశాయి. జడ్జిమెంట్ కోసం జస్టిస్ రామకృష్ణన్ నేతృత్వంలోని ..

చెన్నై: రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్ట్‌పై ఎన్జీటీ చెన్నై బెంచ్ ముందు వాదనలు ముగిశాయి. జడ్జిమెంట్ కోసం జస్టిస్ రామకృష్ణన్ నేతృత్వంలోని ద్విసభ్య బెంచ్ రిజర్వ్ చేసింది. అయితే వారంలోగా రాతపూర్వకంగా వాదనలు దాఖలు చేసేందుకు అవకాశం కల్పించింది.
ఇక తెలంగాణ తరపున అదనపు అడ్వకేట్ జనరల్ రాంచందర్ రావు రెండు గంటల పాటు వాదించారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం భారీ విస్తరణ ప్రాజెక్టని రాంచందర్ రావు తెలిపారు. 15 టీఎంసీల నీటిని కృష్ణానది నుంచి చెన్నైకి తీసుకునేందుకు ఒప్పందాలు ఉన్నాయి తప్ప సాగునీటికి వాడరాదని చెప్పారు.
‘‘ఉమ్మడి రాష్ట్రంలో అక్రమంగా పోతిరెడ్డిపాడును విస్తరించి ఇప్పుడు మళ్లీ రెట్టింపు చేస్తున్నారు. ఏ ప్రాజెక్టు విస్తరణకైనా ముందస్తు అనుమతి తప్పనిసరి. నిబంధనలకు విరుద్ధంగా రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు చేపడుతున్నారు. కేంద్ర జలశక్తి మంత్రి ప్రాజెక్ట్ కట్టొద్దని సూచించినా పట్టించుకోవడం లేదు.’’ అదనపు అడ్వకేట్ జనరల్ రాంచందర్ రావు అన్నారు.
ఏపీ ప్రభుత్వం తరపు సీనియర్ న్యాయవాది వెంకటరమణి వాదనలు
‘‘రాయలసీమ ఎత్తిపోతల ద్వారా అదనంగా నీటి వినియోగించటం లేదు. కాబట్టి పర్యావరణ అనుమతులు అవసరం లేదు. పంపింగ్, చిన్నపాటి రిపేర్లు చేయడం ప్రాజెక్టులో మార్పు కాదు. గవినోళ్ల శ్రీనివాస్ దాఖలు చేసిన పిటిషన్‌ను తెలంగాణ ప్రభుత్వం సొంతం చేసుకుంటుంది. రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు కడితే పర్యావరణం పాడవుతుందని పిటిషనర్ మొసలి కన్నీరు కారుస్తున్నారు. అపెక్స్ కౌన్సిల్‌లో తేవాల్సిన విషయాలను ఎన్జీటీ ముందు ప్రస్తావించడం విడ్డూరం.’’ అని వెంకటరమణి అన్నారు.